వైసీపీ 'వెన్నుపోటు దినం' వేళ... నేతలకు చంద్రబాబు బిగ్ టాస్క్!
గత ఏడాది ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడిన సంగతి తెలిసిందే. ఆ ఫలితాల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధించాయి.
By: Tupaki Desk | 31 May 2025 10:00 PM ISTగత ఏడాది ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడిన సంగతి తెలిసిందే. ఆ ఫలితాల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధించాయి. 94% స్ట్రైక్ రేట్ తో కనీవినీ ఎరుగని రీతిలో గెలుపొందాయి. అనంతరం జూన్ 12న ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సమయంలో జూన్ 4న ‘వెన్నుపోటు దినం’ అంటూ వైసీపీ ఓ కార్యక్రమం ప్లాన్ చేయగా.. కూటమి నేతలకు చంద్రబాబు ఒక టాస్క్ ఇచ్చారు!
అవును... వచ్చే నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 'వెన్నుపోటు దినం' నిర్వహించాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు. కూటమి సర్కార్ రాకతో ప్రజలకు అన్యాయం జరిగిందని, వారికి ఒక్క సంక్షేమ పథకం కూడా చేరువ కావడం లేదని జగన్ చెబుతున్నారు!
ఈ నేపథ్యంలో కూటమి నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ నుంచి టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, ఎమ్మెల్యేలతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు.. వచ్చే నెల 12తో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోన్న నేపథ్యంలో.. 1వ తేదీ నుంచి ప్రజల మధ్యకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... మీరు ప్రజల వద్దకు వెళ్లండి.. లేదా, మరేదైనా చేయండి. కానీ, జనం మాత్రం మన గురించి, మన ప్రభుత్వం గురించి మాత్రమే మాట్లాడుకోవాలని.. ప్రభుత్వం అందించే సంక్షేమపైనే చర్చ జరగాలని.. ఇది నాయకులందరి బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ 4న చేపట్టిన కార్యక్రమం గురించి బాబుకు నేతలు తెలిపారు!
ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... మీరు కూడా ప్రజల్లోకి వెళ్లి, ఈ 11 నెలలు ప్రజలకు ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలని సూచించారు. 94 శాతం స్ట్రైక్ రేటు సాధించామని.. ప్రజలు తమతోనే ఉన్నారనే.. ఈ విషయాన్ని నేతలంతా గుర్తుపెట్టుకోవాలని.. గడిచిన 11 నెలల్లో ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించాలని.. సంక్షేమం, అభివృద్ధి గురించి వెల్లడించాలని తెలిపారు.
ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు నిర్మించామని.. పెట్టుబడులు పెట్టేలా పెద్ద పెద్ద కంపెనీలను ఒప్పిస్తున్నామని.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామనే విషయం ప్రజలకు చెప్పాలని బాబు సూచించారు. మనం చేసిన మంచిని కూడా చెప్పుకోలేకపోతే తీవ్రంగా నష్టపోతామని, అలాంటి పరిస్థితి రానివ్వొద్దని నేతలకు బాబు తెలిపారు.
