ఇంటింటి కీ టీడీపీ...బాబు కొత్త వ్యూహం
ఇప్పట్లో ఎన్నికలు లేవు. కచ్చితంగా మరో మూడేళ్ళ వరకూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది.
By: Satya P | 22 May 2026 9:34 AM ISTఇప్పట్లో ఎన్నికలు లేవు. కచ్చితంగా మరో మూడేళ్ళ వరకూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ఇంకా చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి. ప్రభుత్వానికి వీలైనంత సమయం ఉంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తొందర పడుతున్నారు. ఆయన ఆలోచనలు అన్నీ 2029 ఎన్నికల మీదనే ఉన్నాయని అంటున్నారు. ఆయన ప్రతీ సమావేశంలోనూ బహిరంగ సభలలోనూ కూడా ప్రజలను కోరుతున్నది కూడా అదే. మళ్ళీ వైసీపీని తెచ్చుకోవద్దు అని వైకుంఠపాళి ఆడవద్దు అని చెబుతూనే ఉన్నారు.
ప్రభుత్వం సిద్ధం :
ఇక ప్రభుత్వం మొత్తం కూడా ప్రజల వద్దకు వెళ్లేలా ముఖ్యమంత్రిగా ఆయన యాక్షన్ ప్లాన్ ని రెడీ చేశారు. కలెక్టర్లు సంబంధిత ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో పర్యటించాలని కూడా బాబు కోరారు. ప్రజల వద్దకు వెళ్ళి సమస్యలు తెలుసుకోవాలని వినతులు ఫిర్యాదులు స్వీకరించాలని కూడా ఆయన సూచించారు. చాలా వరకూ వీలైన సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాలని తద్వారా ప్రభుత్వం పట్ల ప్రజలలో విశ్వాసం పెంచాలని కూడా ఆయన కోరారు. తాజాగా జరిగిన కలెక్టర్ల సమావేశంలో బాబు ఈ మేరకు కీలకమైన సూచనలు చేశారు.
పార్టీ సైతం అదే బాటలో :
ఇపుడు చూస్తే చంద్రబాబు పార్టీని సైతం జనం వద్దకు పంపిస్తున్నారు. ప్రతీ ఇంటికీ వెళ్ళి ప్రజలను నేరుగా కలుసుకోవాలని ఆయన సూచిస్తున్నారు పొలిట్ బ్యూరో సమావేశంలో బాబు పార్టీ యంత్రాంగానికి అతి ముఖ్యమైన సూచనలు చేశారు. గడచిన రెండేళ్ళలో కూటమి ప్రభుత్వం ఏపీలో ప్రజలకు ఏమి చేసింది అన్న దాని మీద ప్రభుత్వ విజయాల మీద అన్నీ వివరించాలని ప్రజలకు వాటి మీద అవగాహన కల్పించాలని బాబు కోరారు. ఈ మేరకు తగిన కార్యాచరణను రూపొందించాలని పొలిట్ బ్యూరో సమావేశంలో బాబు పేర్కొన్నారు.
క్షేత్ర స్థాయిలోనే :
పార్టీ నేతలు అంతా నిరంతరం ప్రజలలో ఉండాలని క్షేత్ర స్థాయిలో ఉండాలని పొలిట్ బ్యూరో సమావేశంలో తీర్మానించారు. ఆ విధంగా ప్రజలతో మమేకం అయితేనే పార్టీ ప్రజలు చేసిన మేలు ఏమిటి అన్నది వారికి తెలియచేయడం జరుగుతుందని తద్వారా ప్రభుత్వం మీద అనుకూలత కూడా మరింతగా పెరుగుతుందని బాబు దిశా నిర్దేశం చేశారు.
వీరంతా తప్పనిసరి:
పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కూడా జనంలోనే ఉండాలని పొలిట్ బ్యూరో సంచలన నిర్ణయం తీసుకుంది. రానున్న రోజులలో మహానాడులో ఈ మేరకు చర్చించి టీడీపీ ఇంటింటి కార్యక్రమానికి తుది రూపు ఇస్తారని అంటున్నారు. వచ్చే మూడేళ్ళూ కూడా ప్రజా ప్రతినిధులు అంతా జనం వద్దకే వెళ్ళాలని కూడా పార్టీ సూచిస్తోంది. మొత్తం మీద చూస్తే ఎన్నికలకు చాలా ముందుగానే తెలుగుదేశం పార్టీ ప్రిపేర్ అవుతోంది అని అంటున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా అన్ని విధాలుగా టీడీపీ అగ్ర భాగాన ఉండడమే కాకుండా ఏపీలోని రాజకీయ ప్రత్యర్ధుల మీద పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. మొత్తానికి బాబు మదిలో కొత్త వ్యూహాలు అనేకం ఉన్నాయని అంటున్నారు. మహానాడులో కూడా వాటిని పార్టీ ముందు పెట్టి చర్చిస్తారు అని చెబుతున్నారు.
