సిద్ధమైన లోకేశ్ జట్టు.. 26 జిల్లాల టీడీపీ అధ్యక్షులు వీరే..
తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీల ఎంపికపై కసరత్తు కొలిక్కి వచ్చింది. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్ర, జిల్లా కమిటీల ఎంపికపై తుది నిర్ణయం తీసుకున్నారు.
By: Tupaki Political Desk | 17 Dec 2025 3:27 PM ISTతెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీల ఎంపికపై కసరత్తు కొలిక్కి వచ్చింది. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్ర, జిల్లా కమిటీల ఎంపికపై తుది నిర్ణయం తీసుకున్నారు. 26 జిల్లాలకు అధ్యక్షులను ఖరారు చేశారు. రాష్ట్ర కార్యవర్గం కూర్పును పూర్తి చేశారు. యువనేత లోకేశ్ అందుబాటులో లేకపోవడం వల్ల మంగళవారం కమిటీ ప్రకటన వాయిదా వేశారని అంటున్నారు. మంత్రి లోకేశ్ విశాఖ పర్యటనలో ఉన్నారు. ఆయన రాగానే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో చర్చించి ప్రకటన చేస్తారని సమాచారం. చాలాకాలంగా పెండింగులో ఉన్న జిల్లా కమిటీల ఎంపికపై చంద్రబాబు తుదినిర్ణయం తీసుకున్నారన్న సమాచారంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్రంలోని 26 జిల్లాలకు అధ్యక్షుల నియామకంపై ఒకేసారి ప్రకటన ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఖరారు చేసిన 26 మందిపై మంత్రి లోకేశ్ తోపాటు పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాన్ని మరోసారి తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే అధినేత ఖరారు చేసిన ఆ పేర్లపై ఎటువంటి మార్పులు ఉండవని అంటున్నారు. కొత్త కమిటీల్లో విజయనగరం డీసీసీబీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు మాత్రమే పొడిగింపునిచ్చారు. ఆయన ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అదేవిధంగా 10 మంది సీనియర్లకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇక తాజా జాబితాను చూస్తే ఎక్కువగా కొత్తవారే ఉన్నారు. వీరంతా భవిష్యత్తులో టీం లోకేశ్ గా పనిచేయాల్సివుంటున్న సంకేతాలు పార్టీ నుంచి ఇస్తున్నారు.
మొత్తం 26 జిల్లాల అధ్యక్షల నియామకంలో సామాజిక సమతుల్యాన్ని టీడీపీ హైకమాండ్ పరిగణలోకి తీసుకుందని అంటున్నారు. కొత్తగా అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోయేవారిలో పది మంది అగ్రవర్ణాలకు చెందిన నేతలు ఉండగా, 9 మంది బీసీలు, నలుగురు ఎస్సీ, ఒక ఎస్టీ నేత ఉన్నారు. ఓసీల్లో కమ్మ సామాజికవర్గానికి నాలుగు, కాపు సామాజికవర్గానికి మూడు, రెడ్డి సామాజికవర్గానికి రెండు, క్షత్రియ సామాజికవర్గానికి ఒక పదవి చొప్పున కేటాయించారు. సీనియర్లలో మాజీ మంత్రులు పనబాక లక్ష్మి, కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ గద్దె అనురాధ, మాజీ ఎమ్మెల్యేలు మంతెన రామరాజు, కొమ్మాలపాటి శ్రీధర్, పిల్లి మాణిక్యాలరావు, బీద రవిచంద్ర, సుగవాసి ప్రసాద్ లకు జిల్లా అధ్యక్ష పదవులు కేటాయించారు.
అదేవిధంగా యువతకు పెద్దపీట వేశారు. కిమిడి నాగార్జున, మోజోరు తేజోవతి, పట్టాభిరామ్, కోట్ని బాలాజీ, జ్యోతుల నవీన్, బొడ్డు వెంకటరమణ చౌదరి, గుత్తల సాయి, సలగల రాజశేఖర్, ఎంఎస్ రాజు, సి.భూపేష్ రెడ్డి వంటి వారు 40 నుంచి 50 ఏళ్ల మధ్యవారే కావడం గమనార్హం. వీరంతా భవిష్యత్తులో లోకేశ్ టీంలో కీలక బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు త్వరలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నందున కొత్త కమిటీలపై పెద్ద భారమే ఉంటుందని అంటున్నారు. దీనివల్ల కొన్ని కీలక జిల్లాలకు సీనియర్లను నియమించారని చెబుతున్నారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నాగార్జున స్థానంలో వేరొకరికి అవకాశం ఇవ్వాలని చూసినా, యువ నాయకుడైన నాగార్జున ఆ జిల్లాలో వైసీపీ సీనియర్ నేత బొత్సను సమర్థంగా ఎదుర్కొంటుండటం వల్ల మళ్లీ కొనసాగించడానికే సీఎం మొగ్గుచూపారని సమాచారం. అదేవిధంగా అనంతపురం జిల్లాలో కాలువ శ్రీనివాసులు, ఎన్టీఆర్ జిల్లాలో గద్దె అనురాధకు అధ్యక్ష పదవులు అప్పగించడం కూడా తెలివైన నిర్ణయంగా పార్టీ నేతలు అభినందిస్తున్నారు.
