Begin typing your search above and press return to search.

ఇరాన్ పై యుద్ధం వేళ.. చంద్రబాబు కీలక నిర్ణయం, అలా చేస్తే ఏపీకి తిరుగు ఉండదన్న సీఎం

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర భయాందోళనకు కారణమవుతోంది.

By:  Tupaki Desk   |   17 March 2026 10:35 PM IST
ఇరాన్ పై యుద్ధం వేళ.. చంద్రబాబు కీలక నిర్ణయం, అలా చేస్తే ఏపీకి తిరుగు ఉండదన్న సీఎం
X

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర భయాందోళనకు కారణమవుతోంది. ముడి చమురు రవాణాకు ఆటంకం ఏర్పడటంతోపాటు సముద్ర వాణిజ్యం, జల రవాణాపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని తట్టుకుని నిలబడటంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి సవాళ్లు ఎదురైతే ఏం చేయాలన్నదానిపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఇక మనదేశంలో కూడా తీర ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు చమురు సంక్షోభం ఎదురుకాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్రం ఫోకస్ చేసింది. ఇదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రస్తుతం యుద్ధం కారణంగా దుబాయ్, గల్ఫ్ దేశాల్లోని ఓడరేవులు ఇబ్బందుల్లో పడ్డాయని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ లోని ఈస్ట్ కోస్ట్ లో ఉన్న పోర్టులే సురక్షితం అన్న అభిప్రాయం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఈ ప్రయోజనాన్ని రాష్ట్రం అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్ల ద్వారా ఈస్ట్ -వెస్ట్ కార్గో కారిడార్గా ఏపీని అభివృద్ధి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల్లో త్వరితగతిన కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్లు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ మూడు పోర్టుల నుంచి పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్ఘఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణా, కర్ణాటకల హింటర్ ల్యాండ్ నుంచి కార్గో రవాణా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు 2026 డిసెంబరు నాటికి పూర్తి అవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీ కూడా ఏర్పాటైన అనంతరం కంటైనర్, బల్క్ కార్గో పోర్టుగా రామాయపట్నం మారుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రామాయపట్నం నుంచి కడప స్టీల్ ప్లాంట్ వరకూ ప్రత్యేక మార్గాన్ని వేసేందుకు కూడా రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని సీఎం తెలిపారు. మూడు పోర్టులకు సమీపంలోనూ పోర్టు టౌన్ షిప్ ఏర్పాటు చేయడం ద్వారా వాణిజ్య పరమైన లావాదేవీలు కూడా పెరుగుతాయని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వీటితో పాటు పోర్టులకు సమీపంలో పారిశ్రామిక కారిడార్‌లు కూడా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉందన్నారు. రెండో దశలో బుడిగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్లను కూడా వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. సమీప భవిష్యత్తులో ప్రతీ 50 కిలోమీటర్లకు పోర్టు, ఫిషింగ్ హార్బర్లు రానున్న నేపథ్యంలో ఈస్ట్ కోస్టు లాజిస్టిక్స్ హబ్ గా ఏపీ మారుతుందన్నారు. ఏపీలో ఉన్న పోర్టులు కార్గో హ్యాండ్లింగ్‌లో గేమ్ ఛేంజర్‌గా మారాలని సీఎం సూచనలు చేశారు.