Begin typing your search above and press return to search.

బాబు బాటలో లోకేష్...వారి సంగతి ?

ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే ఒక మాట చెబుతున్నారు. మంత్రి వర్గ సమావేశాలలో కానీ లేక టెలి కాన్ఫరెన్స్ లో కానీ లేక పార్టీ మీటింగులలో కానీ మంత్రులకు దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 Jun 2025 3:44 AM
బాబు బాటలో లోకేష్...వారి సంగతి ?
X

ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే ఒక మాట చెబుతున్నారు. మంత్రి వర్గ సమావేశాలలో కానీ లేక టెలి కాన్ఫరెన్స్ లో కానీ లేక పార్టీ మీటింగులలో కానీ మంత్రులకు దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. అదేంటి అంటే ప్రజలతో మమేకం కావాలని. ప్రజలతో నిత్యం ఉంటే వారి సమస్యలు పరిష్కరిస్తూ ఉంటే కచ్చితంగా అది పార్టీకి మంత్రులకు ప్రభుత్వానికి సైతం ఎంతో మైలేజ్ ని ఇస్తుందని బాబు చెప్పుకొస్తున్నారు.

మొత్తానికి బాబు మాట పనిచేసి ఇటీవల వృద్ధులకు పెన్షన్ల పంపిణీలో చాలా మంది మంత్రులు పాల్గొన్నారు. కొందరు లబ్దిదారుల ఇళ్ళకు వెళ్ళి మరీ పెన్షన్లు పంపిణీ చేశారు. కొందరు అయితే ఆస్పత్రిలో ఉన్న లబ్దిదారుల వద్దకు వెళ్ళి మరీ పెన్షన్లు అందించారు దాంతో కూటమి ప్రభుత్వానికి కొంత మైలేజ్ వచ్చింది.

అయితే ఇది ఇక్కడితో ఆగిపోవద్దని నిరంతరం అలా జనాల మధ్యనే ఉండాలని బాబు కోరుతున్నారు. చంద్రబాబు అయితే ఎప్పటి నుంచో అలాగే చేస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలతో ముఖా ముఖీ నిర్వహిస్తున్నారు. సభలు పెడితే జనాలను వేదిక మీదకు పిలిపించుకుని మైక్ వారికి ఇచ్చి మరీ సమస్యలు వింటున్నారు. తాజాగా బాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పెన్షన్ పంపిణీలో వేదిక మీదనే ఒకరు పెన్షన్ అందలేదు అంటే కలెక్టర్ ని పిలిచి మరీ సమస్యను అక్కడే పరిష్కరించారు.

ఇక లోకేష్ చూసుకుంటే ఆయన కూడా అదే విధంగా ఉంటున్నారు. లోకేష్ ఎలాంటి ఆర్భాటం లేకుండా జనాలతో కలిసిపోతున్నారు. ఆయన ఈ మధ్యనే కడప మహానాడుకు వెళ్తూ మార్గమధ్యలో ఒక టీ స్టాల్ లో కూర్చుని అందరితో పాటు టీ తాగి అక్కడ జనాలతో మాట్లాడారు, వారి కష్టాలను అడిగి మరీ తెలుసుకున్నారు. ఇలా లోకేష్ ఎక్కడికి వెళ్ళినా లేక మీడియా సమావేశం పెట్టినా సమస్య ఉందని ఎవరైనా వస్తే వారికి మైక్ ఇచ్చి మరీ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.

దానికి తోడు ప్రజా దర్బార్ ని గత ఏడాది కాలంగా లోకేష్ నిర్వహిస్తున్నారు. ఆయన విశాఖ వచ్చినా కూడా దానిని ఆపడం లేదు. ఆ విధంగా చంద్రబాబు లోకేష్ ఎంతో ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇక కొందరు మంత్రులు జనాలతో టచ్ లోకి వెళ్తున్నా బాబు అనుకున్నట్లుగా ఎక్కువ మంది మమేకం కాలేకపోతున్నారు అని అంటున్నారు.

మంత్రులు జిల్లాలకు వెళ్ళినపుడు లేదా నియోజకవర్గాలకు వెళ్ళినపుడు లేదా అధికార కార్యక్రమాలలో ఉన్నపుడు తామే చొరవ తీసుకుని ప్రజలతో ముఖా ముఖీ పెడితే మంచి స్పందన వస్తుందని అంటున్నారు. అలాగే మంత్రులు సైతం రచ్చ బండ మీటింగ్స్ పెట్టడం ద్వారా ప్రజలకు చేరువ అయితే మరింత ఎక్కువగా ప్రభుత్వం ఫోకస్ అవుతుందని అంటున్నారు అయితే ఇంకా చాలా మంది గేర్ మార్చి స్పీడ్ పెంచడం లేదని అంటున్నారు. మరి తొందరలోనే అంతా దూకుడు పెంచాలని ప్రజలతోనే ఉండాలని తాజా మంత్రి వర్గ సమావేశంలోనూ చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. మరి దీని ఫలితాలు ఏ విధంగా వస్తాయన్నది చూడాల్సి ఉంది.