జనాభా లెక్కలతో 'డీలిమిటేషన్' అందరికీ నష్టమే: చంద్రబాబు
టీడీపీ తీర్మానంపై దేశవ్యాప్త చర్చ జరుగుతోందని చంద్రబాబు తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చేసిన తీర్మానంపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందన్నారు.
By: Garuda Media | 30 May 2026 10:00 PM ISTదేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే.. ఈ విషయం లో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) చేస్తే.. అది అన్ని రాష్ట్రాలకూ కూడా ఇబ్బందేనని తెలిపారు. ఏపీ దీనికి మినహాయింపు కాదన్నారు. 2011 జనాభా లెక్కలు అయినా.. ప్రస్తుతం జరుగుతున్న జనాభా లెక్కల ప్రకారమైనా కూడా డీలిమిటేషన్ మంచిది కాదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 50 శాతం నియోజకవర్గాల పెంపును అన్ని రాష్ట్రాలూ స్వాగతించాలని ఆయన పిలుపునిచ్చారు.
శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. ఆయా సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొద్దిసేపు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. డీలిమి టేషన్ ప్రక్రియను అడ్డుకోవద్దని ప్రతిపక్ష పార్టీలకు సూచించారు. అన్ని పార్టీలూ కలసి ఉండి.. ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుం దని తెలిపారు. లేకపోతే.. మొత్తానికే ఇబ్బందులు తప్పకపోవచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 50 శాతం నియోజకవర్గాల పెంపును అందరూ ఆమోదిస్తే.. వెంటనే ఈ ప్రక్రియకు ముగింపు పలకవచ్చన్నారు. ఏపీ పరంగా 50 శాతం సీట్లను పెంచేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
టీడీపీ తీర్మానంపై దేశవ్యాప్త చర్చ జరుగుతోందని చంద్రబాబు తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చేసిన తీర్మానంపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందన్నారు. తద్వారా మహిళలకు అటు పార్లమెంటు ఇటు అసెంబ్లీలో కూడా భాగస్వామ్యం అయ్యేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. టీడీపీ పరంగా మహిళలకు ఆది నుంచి ప్రాధాన్యం కల్పిస్తున్న విషయాన్ని ఆయన మరోసారి చెప్పారు. ఇక, జాతీయస్థాయిలో మహిళా రిజర్వేషన్‌ను విడిగా.. పార్లమెంటు సీట్ల డీలిమిటేషన్‌ను మరోలా చూడలేమన్నారు. రెండు బిల్లుల విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
పనిచేసే వారికే పదువులు..
ఈసందర్భంగా రాజ్యసభ స్థానాల కేటాయింపు అంశంపైనా చంద్రబాబు స్పందించారు. అనేక మంది పోటీ పడుతున్నారని చెప్పారు. అయితే.. ప్రజల మధ్య ఉంటూ వారికి సేవ చేసేవారికి మాత్రమే గుర్తింపు లభిస్తుందన్నారు. ఎవరినీ పార్టీ ప్రత్యేకంగా చూడబోదన్నారు. కేవలం ప్రజల మధ్య ఉండడం..కూటమి పార్టీల తరఫున బలమైన గళం వినిపించడం.. సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడం వంటి కీలక అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. ఎవరికి వారు బాగా చేశామని చెప్పుకోవడం సహజమేనన్న చంద్రబాబు.. ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాకే అంతిమమని పేర్కొ న్నారు. దాని ప్రకారం.. పనిచేసేవారికిపదవులు దక్కుతాయని చెప్పారు.
