తెలంగాణాతో గొడవలు...బాబు సంచలన కామెంట్స్!
ఉమ్మడి ఏపీ విడిపోయాక ఏపీకి మాత్రమే సీఎం గా ఉన్న చంద్రబాబుకు ఒక స్పెషాలిటీ ఉంది.
By: Tupaki Desk | 19 Jun 2025 9:49 PM ISTఉమ్మడి ఏపీ విడిపోయాక ఏపీకి మాత్రమే సీఎం గా ఉన్న చంద్రబాబుకు ఒక స్పెషాలిటీ ఉంది. ఆయన ఒక్కరే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఉన్న యునైటెడ్ ఏపీకి సీఎం గా తొమ్మిదేళ్ళ పాటు పనిచేశారు. అంటే బాబు తెలంగాణాకు కూడా సీఎం గా ఉన్నారు అన్న మాట. మరి అలాంటిది బాబు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేరు. అంతే కాదు ఆయన తన పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించి ఉన్నారు.
దాంతో బాబుకు తెలంగాణాతో వివాదాలు కానీ విభేదాలు కానీ అసలు కోరుకోరు. ఇది చాలా క్లియర్. అలాంటిది తెలంగాణాలో ఉన్న స్థానిక రాజకీయం మూలంగా ఏపీ మీద అక్కడ వారు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సూటిగానే బాబుని ప్రశ్నించారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో ఏపీ వైఖరిని తప్పు పట్టారు.
కేంద్రం వద్ద బాబుకు పలుకుబడి ఉంటే ఉండొచ్చు కానీ బనకచర్ల ప్రాజెక్ట్ అన్నది ఎప్పటికీ పూర్తి కాదు అని కూడా ప్రకటించారు. రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ పెంచుకోవద్దు అని కూడా సూచించారు. ఇలా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడింది ఎపుడూ లేదు దాంతో చంద్రబాబు కూడా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది.
ఆయన మాట్లాడుతూ తెలంగాణా విషయంలో తన ఆలోచనలను చెప్పేశారు. తెలంగాణా రాష్ట్రం వారితో గొడవ పడే ఉద్దేశ్యం తనకు ఎప్పుడూ లేదని అన్నారు. తనకు తెలంగాణా వారితో పోరాటం చేయడం అన్నది కూడా ఆలోచనలో లేదని అన్నారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో ఏపీతో పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన దానికి ఆయన ఈ విధంగా రియాక్ట్ అయ్యారు.
మరో వైపు చూస్తే కనుక తెలంగాణా వారు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటారో కట్టుకోవచ్చు తాను అడ్డుపడేది లేదని కూడా బాబు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని తెలంగాణలో వారు కడితే తాము అడ్డుపడి ఆపామా అని బాబు ప్రశ్నించారు. తాము పోరాటం ఎవరితో చేయమని బాబు గట్టిగా చెప్పారు.
పైన ఉన్న వారు నీరు వాడుకోకపోతే అవి దిగువకు వస్తాయని బాబు చెప్పారు. గోదావరిలో మిగులు జలాలనే తాము వాడుకుంటామని బాబు అన్నారు. ఈ విషయంలో ఎవరికీ ఏ విధమైన నష్టం బనకచర్ల ప్రాజెక్ట్ కట్టడం వల్ల వచ్చేది ఏమీ ఉండదని బాబు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా పెద్ద మనిషి తరహాలో బాబు కొన్ని ప్రతిపాదనలు చేశారు. సముద్రంలో వృధాగా పోయే నీటిని వాడుకోవాల్సి ఉందని అన్నారు. ఈ విషయంలో అవసరం అయితే ఏపీ తెలంగాణా ప్రభుత్వాల పెద్దలు కూర్చుని మాట్లాడుకుందామని బాబు సూచించారు. అంతే కాదు ఎవరి నీరు వారిదే అన్నారు. ఈ విషయంలో గొడవలు అనవసరమని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ని తాను అభివృద్ధి చేశాను అన్నారు. దాని వల్లనే ఈ రోజున తెలంగాణాకు ఆదాయం ఎక్కువగా వస్తోంది అన్నారు. ఏది అభివృద్ధి చేసినా ప్రజల కోసమే అని అన్నారు. గొడవల వల్ల ఎవరికీ ఉపయోగం లేదని బాబు చెప్పారు. కూర్చుని మాట్లాడుకోవడం వల్లనే ఫలితం ఉంటుందని ఆయన చెప్పారు.
ఉమ్మడి ఏపీలో సాగు నీటి ప్రాజెక్టులను తానే ప్రారంభించాను అని బాబు గుర్తు చేశారు. మొత్తానికి గొడవల కంటే చర్చల వల్లనే లాభం అని బాబు అంటున్నారు. అయితే తెలంగాణా నుంచి మాత్రం తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యూహాలు ప్రణాళికలు స్పష్టంగా ఉన్నాయని చెబుతున్నారు. దాంతో బనకచర్ల విషయంలో ఏమి జరుగుతుంది అన్నది తేలాల్సి ఉంది.
