పిల్లలే సంపద...బాబు ఇచ్చిన స్పష్టత
మహాకవి గురజాడ అప్పారావు అయితే దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని అన్నారు. ఆ మాటలనే చంద్రబాబు గుర్తు చేస్తున్నారు.
By: Satya P | 12 July 2026 9:14 AM ISTపిల్లలే సంపద అని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయితే దీని మీద విమర్శలు చేస్తున్న వారు ఉన్నారు. పాలకులతో దీనికి ఏమి సంబంధం అని ప్రశ్నిస్తున్నారు సామాజికవేత్తలు. అయితే పాలకులకు అన్ని విషయాల్లోనూ సంబంధం ఉంటుంది. రేపటి సమాజం ఎలాగ ఉండాలో వారికి అవగాహన ఉంటుంది. దిశా నిర్దేశం చేయడంతో తప్పు లేదు, ముఖ్యమంత్రి చంద్రబాబు విషయమే తీసుకుంటే సీనియర్ మోస్ట్ లీడర్. అంతే కాదు పలు మార్లు ముఖ్యమంత్రిగా చేసిన వారు. ఆయన అనుభవంతోనే ఆయన పిల్లలు సంపద అంటున్నారు. జనాభా పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. సంతానం లేకపోయినా జనాభా తగ్గినా కలిగే దుష్ఫలితాల గురించి కూడా ఆయన విడమరచి చెబుతున్నారు.
మహాకవి గురజాడ మాటలు :
మహాకవి గురజాడ అప్పారావు అయితే దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని అన్నారు. ఆ మాటలనే చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. విజయవాడలో జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సమీప భవిష్యత్తులోనే పిల్లలే సంపద అనే మాటను నిజం చేసి చూపుతామని కూడా బాబు అన్నారు. జనంతోనే అభివృద్ధి అని జనాభా ఉంటేనే భవిష్యత్తు అని ఆయన చెప్పారు. జనాభా నిర్వహణ దేశానికి రాష్ట్రానికి అత్యవసరం అని బాబు చెప్పుకొచ్చారు. ప్రజలతో సంప్రదించి పిల్లలే సంపద కార్యక్రమం చేపడతామని బాబు ప్రకటించారు.
బ్యాలెన్స్ చేసుకుంటూ :
ఒక వైపు యువతరం ఉండాలి. అలాగే అనుభవానికి వృద్ధులు ఉండాలి. సమాజానికి ఈ రెండు వర్గాలు అవసరం. యువత నైపుణ్యం వృద్ధుల అనుభవం సమాజానికి ఆస్తి అని బాబు చెబుతూ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మైక్రో ఫ్యామిలీలు వద్దని ఉమ్మడి కుటుంబమే ముద్దు అని ఆయన నినదించడం కూడా సమాజానికి ఇచ్చే సందేశంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇక మీదట జనాభా నియంత్రణ కాకుండా జనాభా సంరక్షణ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి ప్రకటించడం విశేషం. గతంలో జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వాలు పనిచేశాయని ఆయన అన్నారు. దీని కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు కలిగిన వారిని అనర్హులు చేస్తూ నిబంధనలు కూడా తెచ్చామని చెప్పారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయని బాబు అన్నారు. దీనికి అనుగుణంగా ఇప్పుడు విధానాలను మార్చుకోవాల్సిన తరుణం వచ్చిందని తెలిపారు.
ఇది వాస్తవం కూడా :
ఇదిలా ఉంటే బాబు చెబుతున్నది నిజం అని సామాజికవేత్తలు సైతం అంగీకరిస్తున్నారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా దేశాల్లో జనాభా తగ్గిపోతోంది. అలాగే భారత దేశంలో కూడా జనాభా పెరుగుతున్నట్లుగా కనిపించినా కూడా నిజానికి తగ్గుతోంది. ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాలలో మరీ తగ్గిపోతోంది. ఇదే విషయాన్ని బాబు గుర్తు చేస్తూ దేశంలోనూ రాష్ట్రంలోనూ ఫెర్టిలిటీ రేట్ గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక రెండు దశాబ్దాల క్రితం ఐటీ లాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని సంపద సృష్టించామని అప్పుడు ఐటీ ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. అలాగే జనాభా నిర్వహణ గురించి కూడా చర్చిస్తున్నామని బాబు చెప్పారు. ఇక ఇదే సందర్భంలో టోటల్ ఫెర్టిలిటీ రేటు ఏపీలోనూ పెరగాల్సి ఉందని ఎలాంటి అభివృద్ధి అయినా జనాభా ఉంటేనే అది సార్ధకం అవుతుందని బాబు స్పష్టం చేశారు. "
విశాఖ సహా చాలా జిల్లాలు:
ఇక ఏపీలో చూసుకుంటే శాఖ లాంటి జిల్లాల్లోనూ ఫెర్టిలిటీ రేటు అతి తక్కువగా ఉంది. ఏపీ భౌగోళిక విస్తీర్ణంలో ఏడవ స్థానంలో ఉన్నా పాపులేషన్ డెన్సిటీలో దిగువన ఉంది. ఇక ప్రతీ వంద మంది జనాభాలో 89శాతం మందికి రెండో సంతానం లేదని నివేదికలు చెబుతున్నాయి. అలాగే అంగన్‌వాడీలు, పాఠశాలల్లోనూ చిన్నారుల సంఖ్య తగ్గుతోంది, అదే సమయంలో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపధ్యంలోనే జనాభా సంరక్షణ అనేదే చాలా ముఖ్యమని బాబు చెప్పారు. ఇది ఒక నినాదంగానే కాదు ఉద్యమంగా మారాలని ఆయన కోరారు. పిల్లలతోనే ఆర్ధిక ప్రగతి అని సరిపడా జనాభా లేకుంటే అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయని బాబు ఆందోళన వ్యక్తం చేశారు. తాను జనాభా సంరక్షణ అనేదే ఈ సమయంలో కీలకమని, జనాభా పెంచాలని మాట్లాడితే విమర్శలు వచ్చాయని బాబు అన్నారు. పిల్లలను పెంచటం అనేది కేవలం మహిళలు ఒక్కరిదే బాధ్యత మాత్రమే కాదు అది ఉమ్మడి బాధ్యతగా బాబు చెప్పారు. అదే విధంగా భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం అని అన్నారు.
