Begin typing your search above and press return to search.

సామాన్యుడికి కూడా ఏసీ ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఆర్టీసీ బస్సులు అన్నింటిని ఏసీ సర్వీసులు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆర్టీసీలో డీజిల్ బస్సులో 99 శాతం నడుస్తున్నాయి.

By:  Tupaki Political Desk   |   23 April 2026 3:13 PM IST
సామాన్యుడికి కూడా ఏసీ ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
X

భవిష్యత్తులో ఆర్టీసీలో అన్ని బస్సులను ఏసీ సర్వీసులుగా మార్చనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. డబ్బు ఉన్నవారే కాదు సామాన్య ప్రయాణికులు, పేదలు కూడా ఏసీ బస్సుల్లోనే తిరగాలనేది తన స్వప్నమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెన్యూ ఇంగాట్ వేపర్స్ పరిశ్రమకు గురువారం సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో 1050 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తున్నామని, వెయ్యికి పైగా చార్జింగ్ స్టేషన్లు నిర్మిస్తున్నామని చంద్రబాబు వివరించారు.

ఆర్టీసీ బస్సులు అన్నింటిని ఏసీ సర్వీసులు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆర్టీసీలో డీజిల్ బస్సులో 99 శాతం నడుస్తున్నాయి. వీటి స్థానంలో దశల వారీగా విద్యుత్ సర్వీసులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం చాలా కాలంగా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కూడా విద్యుత్ బస్సులను ప్రోత్సహిస్తోంది. దీంతో ఆర్టీసీని పూర్తిగా సంస్కరించి అన్ని సర్వీసులను ఏసీ సర్వీసులుగా మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఇక రాంబిల్లిలో రెన్యూ ప్లాంట్ శంకుస్థాపన అనంతం ముఖ్యమంత్రి ప్రసంగంలో పలు ముఖ్యాంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా పెట్టుబడుల ఆకర్షించడంలో అనకాపల్లి ముందంజలో ఉందని, ఆ జిల్లాను మరో రంగారెడ్డి జిల్లాగా తయారు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రాలో రంగారెడ్డి జిల్లా చాలా వెనుకబడి ఉండేదని, కానీ తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ఇప్పుడు ఆ జిల్లానే సంపద కలిగిన ప్రాంతంగా తయారైందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పుడు అనకాపల్లి జిల్లా సైతం భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోందని, దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.5,400 కోట్లతో రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ నిర్మించనున్న ప్లాంట్ కు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్ ద్వారా 2,100 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. ఇప్పటి వరకు సోలార్ ఇంగాట్ వేఫర్ కోసం విదేశాలపై ఆధారపడే వారు. ఈ ప్లాంటుతో ఆ సమస్య తీరిందని చెబుతున్నారు. రెండేళ్లలో రెన్యూ ఇంగాట్ వేఫర్ ప్లాంట్ నిర్మించేలా సంస్థ పనిచేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.