జగన్ ప్రాజెక్టును ఓకే చేసిన చంద్రబాబు!
గత ఐదేళ్లు విధ్వంసకర పాలనే చేశారని ఆరోపిస్తున్న అధికార పార్టీ శ్రేణులకు తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొంత ఉపశమనం కల్పించనుందని అంటున్నారు.
By: Tupaki Desk | 6 Feb 2025 3:00 PM ISTఒక ప్రభుత్వ విధానాన్ని ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం కొనసాగాలని సీఎం తరచూ చెబుతుంటారు. ఇలా చెప్పడమే కాదు తాను ఆచరిస్తానని చేతల్లో నిరూపించారు. ఔను.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతిపక్ష వైసీపీకి కూడా క్రెడిట్ దక్కేలా చేసింది. గత ఐదేళ్లు విధ్వంసకర పాలనే చేశారని ఆరోపిస్తున్న అధికార పార్టీ శ్రేణులకు తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొంత ఉపశమనం కల్పించనుందని అంటున్నారు.
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో అత్యాధునిక వసతులతో విలాసవంతమైన రిసార్ట్స్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పచ్చచెండా ఊపింది. దీంతో తిరుపతిలో ఒబెరాయ్ స్టార్ లగ్జరీ విల్లాస్ అండ్ రిసార్ట్స్ నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. మూడేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఈ రిసార్ట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తుడా అనుమతులు లభించడంలో ఆలస్యం కావడంతో యాజమాన్యం పనులు చేయలేకపోయింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మెగా ప్రాజెక్టుపై ఫోకస్ చేయడంతో ఎట్టకేలకు అన్ని అనుమతులు మంజూరయ్యాయి.
తిరుపతిలో ఇప్పటివరకు ఇంతటి లగ్జరీ రిసార్ట్స్ లేవు. పర్యాటక రంగం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఒబెరాయ్ గ్రూపునకు 2022లో అప్పటి ప్రభుత్వం తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామంలో 20 ఎకరాల భూమిని 66 ఏళ్లకు లీజుకిచ్చింది. ఇందులో మెస్సర్స్ ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్ సెవెన్ స్టార్ లగ్జరీ విల్లాస్ నిర్మిస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. 2023 జులైలో అప్పటి సీఎం జగన్ హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే అనుమతులు రావడం ఆలస్యమైంది. దీంతో పనులు జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వమిచ్చిన అనుమతులకు ఓకే చెప్పింది.
ఈ రిసార్ట్స్ ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.300 కోట్లు. అయితే ఈ ప్రాజెక్టును కూటమి భాగస్వామి పార్టీ బీజేపీ, దాని అనుబంధ సంఘాలైన హిందు సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ పర్యాటక రంగాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం ముందడుగు వేసిందని చెబుతున్నారు. పవిత్ర క్షేత్రంలో ఇలాంటి హోటళ్లు ఉండకూడదని బీజేపీ వాదిస్తోంది. అయితే ఈ సమస్య పరిష్కారానికి చంద్రబాబు చొరవ చూపారు. బీజేపీ, హిందూ సంఘాలను శాంతపరిచేలా హోటల్ కు ముంతాజ్ అనే పేరు తీసివేసి ట్రైడెంట్ గ్రూప్ కింద మార్చాలని ఒబెరాయ్ సంస్థకు సూచించారని చెబుతున్నారు. సీఎం సూచనకు సంస్థ అంగీకరించడంతో బీజీపీ కూడా శాంతించిందని అంటున్నారు.
