48 మంది ఎమ్మెల్యేలకు వార్నింగు.. చంద్రబాబు లిస్టులో ఎవరెవరు?
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ప్రజల్లోనే ఉండాలని చెబుతున్న చంద్రబాబు.. అందుకు విరుద్ధంగా నడుచుకుంటున్న వారి జాబితాను తయారు చేశారు.
By: Tupaki Desk | 8 Nov 2025 8:10 PM ISTముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కోపం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ప్రజల్లోనే ఉండాలని చెబుతున్న చంద్రబాబు.. అందుకు విరుద్ధంగా నడుచుకుంటున్న వారి జాబితాను తయారు చేశారు. ఇందులో 48 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ వ్యవహారాలను సరిగా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, పెన్షన్ల అందజేత సమయంలో ఎమ్మెల్యేలు దూరంగా ఉండటాన్ని సీఎం సీరియసుగా తీసుకున్నట్లు చెబుతున్నారు.
శనివారం టీడీపీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు పార్టీ సీనియర్లతో సమావేశమయ్యారు. బ్యాక్ ఆఫీసు, ప్రొగ్రాం కమిటీతోనూ చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపై చంద్రబాబు సమీక్షించారు. తన ఆదేశాలతోపాటు పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి వారి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. పార్టీ పనులకన్నా ఇతర వ్యవహారాలలో ఎమ్మెల్యేలు బిజీగా ఉండటంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వ్యవహారాలు, పార్టీ పనులను వెనక్కి పెట్టిన ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్ అయ్యారు. పేదల సేవలో భాగంగా ఫించన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాల్సిందేనని సీఎం హుకుం జారీ చేశారు. పెన్షన్ల పంపిణీలో పాల్గొనని ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చి వివరణ తీసుకున్న తర్వాత చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోనని హెచ్చరించారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత కార్యకర్తలు, ప్రజలతో మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు. టీడీపీ కార్యకర్తలకు ఇన్సురెన్స్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కూడా ఎమ్మెల్యేలు భాగస్వామ్యం కవాలని సూచించారు.
ఎమ్మెల్యేలకు నచ్చిన వారినే కాకుండా పార్టీకి సిన్సియర్ గా సేవలు అందించిన కార్యకర్తలను కూడా కలుపుకుని వెళ్లాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఏ నియోజకవర్గంలో అయినా గ్రీవెన్స్ నిర్వహించకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వివరణ తీసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గతంలో కంటే ఎక్కువగా జరుగుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ఈ బాధ్యత ఎమ్మెల్యేలదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
