టార్గెట్ రూ.50 లక్షల కోట్లు.. చంద్రబాబు అత్యాశ!
రెండు రోజుల సదస్సులో ఏకంగా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న ముఖ్యమంత్రి, ఈ ఐదేళ్ల కాలంలో రూ.50 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేలా పనిచేయాలని అధికార యంత్రాంగానికి టార్గెట్ పెట్టారు.
By: Tupaki Political Desk | 17 Nov 2025 6:00 AM ISTవిశాఖలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు సక్సెస్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబులో ఆత్మవిశ్వాసం తొణికలాడుతోంది. రెండు రోజుల సదస్సులో ఏకంగా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న ముఖ్యమంత్రి, ఈ ఐదేళ్ల కాలంలో రూ.50 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేలా పనిచేయాలని అధికార యంత్రాంగానికి టార్గెట్ పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి రూ.50 లక్షల టార్గెట్ వినగానే అక్కడ ఉన్న అధికారులతోపాటు పారిశ్రామిక వేత్తలు ఆశ్చర్యపోయారని అంటున్నారు. సీఎం చంద్రబాబులో ఆత్మవిశ్వాసంతో అత్యాశ పడుతున్నారా? అని సందేహిస్తున్నారు. అయితే సీఎం సమర్థత, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తే ఆ టార్గెట్ ను చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్న వాదన వినిపిస్తోంది.
కూటమి పాలన ప్రారంభమైన తర్వాత ఏడాదిన్నరలోనే దాదాపు రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటికి అదనంగా సీఐఐ సదస్సు ద్వారా జరిగిన ఒప్పందాలతో రాష్ట్రంలో మొత్తం పెట్టుబడులు సుమారుగా రూ.25 లక్షల కోట్లకు చేరుకున్నాయని అంటున్నారు. వీటిని రానున్న మూడేళ్లలోగా గ్రౌండింగ్ చేయాలని సీఎం భావిస్తున్నారు. దీంతో తన ఎన్నికల హామీ అయిన యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు అవుతుందని, 2029 ఎన్నికల్లో మరోసారి గెలవడానికి మార్గం సుగమం చేసుకోవచ్చని సీఎం ఆలోచనగా ఉందని అంటున్నారు.
అయితే రాజకీయ లక్ష్యాలను అటుంచితే.. పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తున్నాయని చెబుతున్నారు. దీనికి చాలా ఉదాహరణలు చూపుతున్నారు. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న ఆర్సెల్లార్ మిట్టల్ పరిశ్రమ ముందుగా ఒడిశాలో తమ ప్లాంట్ నెలకొల్పాలని భావించింది. అయితే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు, యువనేత, ఐటీ మంత్రి లోకేశ్ చొరవతో ఆ సంస్థ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ నెలలోనే ఈ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. అదేవిధంగా తమిళనాడుతో ఒప్పందం చేసుకున్న దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ షూ కంపెనీ హ్వాసెంగ్ కూడా ఏపీకి తరలివస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఆ సంస్థ తన ప్లాంటును ఏర్పాటు చేయబోతోంది.
ఒకటేంటి ఇలా చాలా కంపెనీలు ఏపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు ఆకర్షితులవుతున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే విశాఖ పెట్టుబడిదారుల సదస్సును ఊహకు అందని విధంగా స్పందన వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. సుమారు 400 ఎంవోయూలు, రూ.9.8 లక్షల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తే, దాదాపు 50 దేశాల నుంచి తరలివచ్చిన ప్రతినిధులు 610 ఎంవోయూలతో రికార్డు నెలకొల్పారు. ఈ ఉత్సాహంతో వచ్చే ఏడాది కూడా విశాఖలో సదస్సు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇలా ఆయన ప్రకటించడం కూడా వ్యూహాత్మక చర్చగానే అభివర్ణిస్తున్నారు. సదస్సును సక్సెస్ చేసిన అధికారులకు వేదికపైనే అవార్డులు ఇచ్చిన చంద్రబాబు.. వచ్చే ఏడాది కాలంలో ఈ పెట్టుబడులను గ్రౌండింగ్ చేసేలా చర్చలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తే పారిశ్రామిక వేత్తలు కూడా ఉత్సాహంతో ముందుకు వస్తారని చంద్రబాబు ఆశిస్తున్నారు. ఇప్పటికే సుమారుగా రూ.25 లక్షల పెట్టుబడులు వచ్చినందున, మిగిలిన రూ.25 లక్షల పెట్టుబడులను రానున్న కాలంలో ఆకర్షించడం పెద్ద కష్టమేమీ కాదని చంద్రబాబు భావనగా కనిపిస్తోందని అంటున్నారు.
