Begin typing your search above and press return to search.

జగన్ కు ఎదురుదెబ్బ? అమరావతిపై కేంద్రం మరో కీలక నిర్ణయం

కూటమి ప్రభుత్వం చెబుతున్నట్లు అమరావతి అన్ స్టాపబుల్ గా దూసుకుపోతోంది. రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ రాష్ట్రపతి సంతకం చేసిన రెండు రోజులకే కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Desk   |   9 April 2026 2:24 PM IST
జగన్ కు ఎదురుదెబ్బ? అమరావతిపై కేంద్రం మరో కీలక నిర్ణయం
X

కూటమి ప్రభుత్వం చెబుతున్నట్లు అమరావతి అన్ స్టాపబుల్ గా దూసుకుపోతోంది. రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ రాష్ట్రపతి సంతకం చేసిన రెండు రోజులకే కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. రూ.2,534 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టు డీపీఆర్ ను కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపుతున్నారు. ఇందులో రూ.1,299 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్టు, రూ.1,234 కోట్లతో ఉద్యోగుల నివాస సముదాయాలు నిర్మించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఈ పరిణామం గట్టి ఎదురుదెబ్బగా వ్యాఖ్యానిస్తున్నారు.

రాజధాని అమరావతిని వ్యతిరేకిస్తూ కొత్తగా మావిగన్ ప్రతిపాదన తీసుకువస్తున్న జగన్ రెడ్డికి కేంద్రం కూడా షాక్ ఇచ్చిందని అంటున్నారు. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో మూడు రాజధానులను ప్రతిపాదించడంతో కేంద్ర సంస్థలు ఏవీ తమ కార్యాలయాలను నిర్మించడానికి ఆసక్తి చూపలేదు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొన్ని కార్యాలయాలను విశాఖలో ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు జరిగినట్లు గుర్తు చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ అమరావతి పనులు ఊపందుకోవడం, కేంద్రం కూడా చట్టబద్ధత కల్పించడంతో కేంద్ర సంస్థల వైఖరి మారిందని అంటున్నారు.

ఇదివరకే ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు తమ ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపనలు జరిగాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి సిద్ధమైంది. అమరావతి కేంద్రంగా పనిచేసే ఉద్యోగుల కోసం గృహ సముదాయాలు నిర్మించడంతోపాటు సెంట్రల్ ఎక్సైజ్, రైల్వే, ఆదాయపు పన్ను ఇలా రాష్ట్రంలో పనిచేసే కేంద్ర కార్యాలయాలు అన్నీ ఒకే చోట ఉండేలా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్రం రెడీ అయింది. ఇందుకోసం సీఆర్డీఏతో చర్చలు జరపగా, అమరావతి పరిధిలోని రాయపూడి వద్ద 23.53 ఎకరాల భూమిని కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేటాయించారు.

5.53 ఎకరాల్లో సెక్రటేరియట్, 17 ఎకరాల్లో ఉద్యోగుల నివాస సముదాయాలు నిర్మించనున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఇంకో 10 ఎకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి హడ్కో ప్రతిపాదనలు చేస్తోంది. కాగా, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించే ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ డిపార్టమెంట్ (అకౌంట్ జనరల్ కార్యాలయం) అమరావతిలో ఏర్పాటు కానుంది. ఇందుకోసం లీజు అగ్రిమెంటు కూడా బుధవారం పూర్తయింది.

ఇలా కేంద్ర కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు వరుసగా అమరావతికి తరలివస్తుండటం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బలంగా మారుతుందని అంటున్నారు. కేంద్రం కూడా అమరావతికి పూర్తిస్థాయిలో మద్దతుగా నిలుస్తుందని, భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా రాజధానిని మార్చే అవకాశం ఉండదని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వాస్తవ పరిస్థితులు ఇలా ఉండగా, మాజీ సీఎం జగన్ మాత్రం ‘మావిగన్’ మాత్రమే రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా చెబుతూ తన వాదనను గట్టిగా వినిపిస్తున్నారు.