Begin typing your search above and press return to search.

పవన్ ని గాలితో పోల్చిన బాబు...!

మాకు అధికారం కోసం పొత్తులు పెట్టుకోలేదని తాడేపల్లిగూడెం లో జరిగిన సభలో చెప్పుకొచ్చారు. తాము రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నామని అన్నారు.

By:  Tupaki Desk   |   28 Feb 2024 3:49 PM GMT
పవన్ ని గాలితో పోల్చిన బాబు...!
X

టీడీపీ అధినేత చంద్రబాబు ఇన్ని సార్లు ఏ పేరు తలచి ఉండరు. ఆయన పదే పదే జనసేన అధినేత పవన్ పేరుని ప్రతీ సభలో తలుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఎన్టీయార్ పేరుని కూడా కొంత తగ్గించి పవన్ నామ స్మరణ చేస్తున్నారు. దానికి కారణం టీడీపీతో పొత్తు ఉంది. అంతే కాదు పవన్ అంటే యువతరంలో విపరీతమైన క్రేజ్ ఉంది.

అదే విధంగా ఒక బలమైన సామాజికవర్గంలో కూడా ఆయనకు ఆదరణ ఉంది. అందుకే చంద్రబాబు పవన్ నేనూ అంటున్నారు. మాకు అధికారం కోసం పొత్తులు పెట్టుకోలేదని తాడేపల్లిగూడెం లో జరిగిన సభలో చెప్పుకొచ్చారు. తాము రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నామని అన్నారు.

ప్రజలు కుదిర్చిన పొత్తుగా టీడీపీ జనసేన పొత్తుని ఆయన అభివర్ణించారు. ఈ పొత్తుతో ఏపీలో కొత్త రాజ్యం తప్పకుండా వస్తుందని అన్నారు. అగ్నిని గాలి తోడు అయితే ఎలా ఉంటుందో టీడీపీ పవన్ కలయిక అలా ఉంటుందని బాబు అభివర్ణించారు. పవన్ ని అలా భీకరమైన గాలితో ఆయన సరిపోల్చారు.

టీడీపీని అగ్నిగా ఆయన చెప్పారు. ఈ రెండు కలిస్తే వైసీపీ ప్రభుత్వం దహనమే అంటూ సంచలన కామెంట్స్ చేశారు. తమ ఇద్దరి కలయికతో ఏపీలో కొత్త శకం రాబోతోందని ఆయన చెప్పుకొచ్చారు. తమతో పవన్ చేతులు కలిపారు అని బాబు అంటున్నారు. ఏపీలో మంచి పాలన రావాలనే పవన్ కోరుకుంటున్నారు అని బాబు అంటున్నారు. ఇక జగన్ మీద చంద్రబాబు తనదైన శైలిలో తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

ఏపీలో జగన్ పాలన అంతా బ్లఫ్ మాస్టర్ తీరుగా సాగుతోందని చంద్రబాబు విమర్శించారు. కుప్పంలో నీళ్లు ఇచ్చాను అని చెబుతున్న జగన్ అది కూడా నాటకం మాదిరిగా చేశారు అక్కడ ఇరవై మూడు గంటలలో నీళ్ళు లేకుండా పోయాయని విమర్శించారు. ఏపీలో దుష్ట పాలన అంత కావాలని అంతా కోరుకుంటున్నారు అని చంద్రబాబు చెప్పడం విశేషం.

టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు మేలు చేస్తామని అన్నారు. బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్ తో పాటు ఎస్టీల కోసం వారి మేలు కోసం పనిచేసే పార్టీ టీడీపీ అని చెప్పుకొచ్చారు. ఏపీలో ఈసారి భారీ ప్రభంజనం రాబోతోంది అని అన్నారు. ఇదిలా ఉంటే తానూ పవన్ ఒక్కటే అని చంద్రబాబు చెప్పడం విశేషం. తమ ఇద్దరి ఆలోచనలు ఏపీ ప్రజలకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకే అని అన్నారు.

ఏపీలో వైసీపీ పాలనను కూకటి వేళ్లతో అంతమొందించేందుకు తమది బెస్ట్ కాంబో అని కూడా చెప్పుకున్నారు. మొత్తం మీద చూస్తే చంద్రబాబు అగ్ని అయితే పవన్ సుడిగాలి అన్న మాట. తమది సూపర్ హిట్ పొత్తు అని బాబు అంటున్నారు.