Begin typing your search above and press return to search.

పొత్తు పొడిచిన వేళ ఢిల్లీలో బాబు మాటలు విన్నారా?

అయితే.. ఈ తరహా సందేహాలకు సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యతను గుర్తించిన చంద్రబాబు.. మీడియాతో మాట్లాడే వేళలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

By:  Tupaki Desk   |   10 March 2024 4:59 AM GMT
పొత్తు పొడిచిన వేళ ఢిల్లీలో బాబు మాటలు విన్నారా?
X

ఎట్టకేలకు అనుకున్నది అనుకున్నట్లుగా బీజేపీతో పొత్తు కోసం తెగ ప్రయత్నించిన చంద్రబాబు ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించారు. శనివారం సాయంత్రం కేంద్ర మంత్రి.. బీజేపీ ముఖ్యనేత అమిత్ షాతో భేటీ కావటం.. రానున్న ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం.. జనసేన.. బీజేపీలు కలిసి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని అటు అమిత్ షా.. ఇటు చంద్రబాబు మీడియాకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని మీడియాతో మాట్లాడారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన గెలుపు మీద ధీమాను వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు కుదరటంతో ఆయన చాలా హ్యాపీగా ఉన్నారన్న విషయం ఆయన మాటల్లో స్పష్టమవుతోంది.

ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కలిసి పని చేయటం ముఖ్యమని.. ఇప్పటికే టీడీపీ.. జనసేనలు కలిసి పని చేస్తున్నాయని.. ఇప్పుడు బీజేపీ కూడా కలవటం వల్ల కేంద్ర.. రాష్ట్రాల్లో ఒకేచోట కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని.. అది మేలు చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీ పూర్తిగా విధ్వంసమైందన్న ఆయన.. రాష్ట్ర పరువు ప్రతిష్ఠలు మసకబారినట్లుగా పేర్కొన్నారు.

తాను గతంలో పునాదులు వేసిన హైటెక్ సిటీ.. ఔటర్ రింగ్ రోడ్డు.. శంషాబాద్ ఎయిర్ పోర్టును తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ధ్వంసం చేసి ఉంటే.. ఇప్పుడు చూస్తున్న హైదరాబాద్ ఉండేది కాదన్న చంద్రబాబు.. ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పాలన సాగుతుందన్నారు. గడిచిన పదేళ్లుగా ప్రధాని మోడీ దేశ పురోగతి.. డెవలప్ మెంట్ కోసంపని చేస్తున్నారన్న చంద్రబాబు.. "ప్రస్తుతం భారతదేశం ప్రపంచ గమ్యస్థానంగా మారే పరిస్థితి వచ్చింది" అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఇదంతా చదివే వేళ.. 2019లో జరిగిన ఎన్నికల సందర్భంగా మోడీని.. ఆయన సర్కారును ఉద్దేశించి చేసిన ఘాటు విమర్శలు.. తీవ్రమైన ఆరోపణల మాటేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

అయితే.. ఈ తరహా సందేహాలకు సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యతను గుర్తించిన చంద్రబాబు.. మీడియాతో మాట్లాడే వేళలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. "బీజేపీ నాయకత్వంతో మాకు ఎప్పుడూ వ్యక్తిగత విభేదాల్లేవు. గతంలో మేం కేవలం ప్రత్యేక హోదా డిమాండ్ తోనే ఎన్డీయే నుంచి బయటకు వచ్చాం. అంతకు మించి మరెలాంటి కారణాల్లేవు. ఇప్పుడు రాష్ట్ర సంపూర్ణ ప్రయోజనాల కోసం కలిసి పని చేస్తాం. రాజకీయాల్లో ఫార్ములాలు పని చేయవు. పరస్పరం అర్థం చేసుకోవటమే ముఖ్యం. వైసీపీతో బీజేపీ నాయకత్వానికి ఎలాంటి అధికారిక అవగాహన లేదు" అంటూ స్పష్టత ఇవ్వటం గమనార్హం.

తన అరెస్టు కేంద్రంలోని మోడీ సర్కారు మద్దతుతోనే జరిగిందని తాను అనుకోలేదన్నారు. ఒకవేళ అదే నిజమైతే జీ20 సమావేశాలు ప్రారంభమైన రోజే ఎందుకు చేస్తారని ప్రశ్నించిన చంద్రబాబు.. "బుద్ధి ఉన్న ఏ నాయకుడు ఆ పని చేయడు. కానీ.. జగన్ చేశాడు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆ సమయంలో నా ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. నా యోగక్షేమాలపై వాకబు చేశారు. అందువల్ల వారిని నిందించను. నా అరెస్టును పురందేశ్వరి.. కిషన్ రెడ్డి.. లక్ష్మణ్ లాంటి బీజేపీ నేతలంతా ఖండించారు" అంటూ జరిగిపోయిన అంశాల్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు.

ఇప్పటికే జగన్ సర్కారుపై తాము జనసేనతో కలిసి పోరాడుతున్నామని.. బీజేపీతో కలవటం ద్వారా తాము మరింత శక్తివంతం అయినట్లుగా చంద్రబాబు పేర్కొన్నారు. 2019లో మినహా టీడీపీ ఎప్పుడూ బలంగానే ఉందన్న చంద్రబాబు.. గత ఎన్నికల ఫలితాలు తమను షాక్ కు గురి చేశాయన్నారు. గడిచిన ఐదేళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారు" అంటూ వ్యాఖ్యానించారు. తాను తప్పులు చేస్తూ.. ఎదుటోళ్ల మీద ఆరోపణలు చేయటం జగన్ కు అలవాటని.. ఇప్పుడు అదే చేస్తున్నారన్నారు.

30 ఏళ్ల క్రితం.. 20 ఏళ్ల క్రితం తాము ఏదో చేశామని తమపై ఆరోపణలు చేస్తున్నారన్న చంద్రబాబు.. వాటిపై ఇప్పటికే కోర్టులు విచారించి కొట్టేసినట్లుగా పేర్కొన్నారు. కానీ.. అలాంటి అంశాలపై పదే పదే అబద్ధాలు మాట్లాడటం జగన్ కు అలవాటైందన్నారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు వంగవీటి రంగా హత్యపై చేసిన ఆరోపణలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారని చెబుతున్నారు.