‘సీబీఎన్ @ 361 డిగ్రీస్’.. బాహ్య ప్రపంచానికి తెలియని ఆసక్తికర నిజాలు!
ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, ఆయన తీసుకునే సంచలన నిర్ణయాలపై అంతర్జాతీయ స్థాయి పుస్తకం ఆవిష్కృతమైంది.
By: Tupaki Political Desk | 16 Jun 2026 1:19 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, ఆయన తీసుకునే సంచలన నిర్ణయాలపై అంతర్జాతీయ స్థాయి పుస్తకం ఆవిష్కృతమైంది. సింగపూర్ వేదికగా ‘‘సీబీఎన్ @ 361 డిగ్రీస్.. పాలీమ్యాథ్’’ అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగపూర్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా పుస్తకం తొలి ప్రతులను సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, అసోసియేషన్ ప్రతినిధులకు సీఎం అందజేశారు.
అంతర్జాతీయ దిగ్గజం చంద్రబాబు
ఈ పుస్తకంలో చంద్రబాబు పాలనా దక్షతను ప్రపంచంలోనే అత్యుత్తమ పాలకులైన సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ, న్యూజిలాండ్ మాజీ ప్రధాని జేసిందా ఆర్నాడ్ వంటి అంతర్జాతీయ దిగ్గజ నేతలతో పోల్చారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో ఆయన చూపిస్తున్న శ్రద్ధ, రాష్ట్ర ప్రగతి కోసం ఆయన రూపొందించిన విజన్ ప్రపంచ స్థాయి నేతల నిర్ణయాలను తలపిస్తోందని రచయిత విశ్లేషించారు. ఏపీ రెరా మాజీ చైర్మన్ రామనాధ్ వివిధ సందర్భాల్లో వ్యక్తపరిచిన అభిప్రాయాలు, బాహ్య ప్రపంచానికి ఇప్పటివరకు తెలియని అనేక ఆసక్తికరమైన అంశాలను, చంద్రబాబు పరిపాలనా రహస్యాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.
ఈ ప్రతిష్టాత్మక పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్ట్, 'రేపటికోసం' దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ రచించారు. కాగా, దీనిని అంతర్జాతీయ పాఠకులకు సైతం సులువుగా చేరేలా విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ సత్యనారాయణ అద్భుతంగా ఆంగ్లంలోకి అనువదించారు. గతంలో వెలువడిన 'చంద్రబాబు X.0' పుస్తకం సాఫ్ట్ కాపీ ఏకంగా 8 మిలియన్ల పైగా డౌన్‌లోడ్‌లతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు విడుదలైన ‘‘సీబీఎన్@361 డిగ్రీస్’’ పుస్తకానికి కూడా గ్లోబల్ వైడ్ భారీ రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పుస్తకానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా, త్వరలోనే దీనిని తెలుగు, హిందీ సహా పలు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రచురణకర్తలు ప్రకటించారు. కాగా, పుస్తకంలో పొందుపరచిన అంశాలు రాజకీయ పరిశోధకులు, నాయకత్వ లక్షణాలపై అధ్యయనం చేస్తున్న విద్యార్థులు, మేనేజ్మెంట్ విద్య అభ్యసించే వారికి ఉపయుక్తంగా ఉంటుందని వివరించారు. ఇక ఈ కార్యక్రమంలోనే ఆధునిక సింగపూర్ రూపకర్త లీ క్వాన్ యూ శతజయంతిని పురస్కరించుకుని విడుదల చేసిన ప్రత్యేక వెండి నాణేన్ని అసోసియేషన్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు బహూకరించారు.
