ఏపీలో క్యారియర్ ఏసీ యూనిట్ ఎంట్రీ.. జాబ్ లు ఎన్నంటే?
ఒకటి తర్వాత ఒకటి అన్నట్లు ఏపీలోని శ్రీసిటీకి పలు దిగ్గజ సంస్థలు రావటం.. తమ యూనిట్లను ఓపెన్ చేయటం తెలిసిందే.
By: Garuda Media | 18 Feb 2026 10:21 AM ISTఒకటి తర్వాత ఒకటి అన్నట్లు ఏపీలోని శ్రీసిటీకి పలు దిగ్గజ సంస్థలు రావటం.. తమ యూనిట్లను ఓపెన్ చేయటం తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో.. ఏసీలకు సంబంధించి క్యారియర్ ఏసీలకు ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిడ్ రేంజ్ వినియోగదారులతో పాటు.. కమర్షియల్ గా ఏసీలు వినియోగించే వారిలో ఎక్కువమంది క్యారియర్ ఏసీలను వినియోగిస్తుంటారని చెబుతారు. అలాంటి సంస్థ ఏపీలోని శ్రీసిటీలో తన యూనిట్ ను స్టార్ట్ చేసేందుకు వీలుగా లీజ్ డీడ్ మీద సంతకం చేసింది.
ఇందులో భాగంగా రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసే ఈ యూనిట్ ద్వారా వెయ్యి మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు.. మరో రెండు వేల మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 39 ఎకరాల విస్తీర్ణంలో క్యారియర్ సంస్థ తన యూనిట్ ను ఏర్పాటు చేయనుంది. హీటింగ్.. వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ రంగంలో దిగ్గజ సంస్థల్లో ఒకటైన క్యారియర్ సంస్థ శ్రీసిటీకి రావటం ద్వారా.. ఏపీలో మరో ప్రముఖ సంస్థ ఎంట్రీ ఇచ్చినట్లైంది.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఒక ప్రముఖ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం.. అందునా వెయ్యి కోట్ల రూపాయిల పెట్టుబడులు అంటే కచ్ఛితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిస్ కాకుండా ఉంటారు.అయితే.. పలు ఇతర కారణాలతో చంద్రబాబు, లోకేశ్ లు ఈ ఎంవోయి కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. దీంతో శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్ సమక్షంలో క్యారియర్ ఎండీ సుందరేశన్ మధ్య పరస్పర ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేవారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు.. పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉండటంతో పాటు.. ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఐటీ మంత్రి లోకేశ్ ప్రోత్సాహంతో తాము కొత్త ప్లాంట్ ను ఏపీలో ఏర్పాటు చేస్తున్నట్లుగా క్యారియర్ ఎండీ పేర్కొనటం గమనార్హం.
