'వ్యక్తిత్వ వికాసం' ఆగిపోయింది..!
మనుషులకు వ్యక్తిత్వం ఎంతో అవసరం.. దీనిని ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూ.. సమాజానికి దోహద పడేలా వికసించడమూ అంతే అవసరం
By: Tupaki Desk | 1 July 2025 8:58 PM ISTమనుషులకు వ్యక్తిత్వం ఎంతో అవసరం.. దీనిని ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూ.. సమాజానికి దోహద పడేలా వికసించడమూ అంతే అవసరం. అందుకే.. వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ప్రాధాన్యం ఉందని అంటారు. అలాంటి వ్యక్తిత్వ వికాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి? సమాజంలో మెరుగైన వ్యక్తులుగా ఎలా రాణించాలి? మనకుంటూ.. ప్రత్యేకతను ఎలా సంతరించుకో వాలి? అనే విషయాలపై సమాజాన్ని జాగృతం చేసిన వారు అతి కొద్ది మందే ఉన్నారు. ఇలాంటి వారిలో బీవీ పట్టాభిరాం ఒకరు. వ్యక్తిత్వ వికాస నిపుణుడుగానే కాకుండా.. హిప్నోటిజంలోనూ అందెవేసిన చేయిగా పేరొందిన పట్టాభిరాం.. ఇక లేరు.
మంగళవారం మధ్యాహ్నం.. పట్టాభిరాం కన్నుమూశారు. కొన్ని లక్షల మందివిద్యార్తులను సంపాయించుకున్న ఆయన దేశ, విదేశాల్లోనూ అనేక వేల కార్యక్రమాల ద్వారా.. వికాస నైపుణ్యంపై శిక్షణ ఇచ్చారు. హిప్నాటిస్టుగా కన్నార్పని అనేక మాయలు, మాయాజాలలతో ప్రజలను ఆకట్టుకున్నారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్న 75 ఏళ్ల పట్టాభిరాం.. మంగళవారం గుండె పోటుతో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న స్వగృహంలో కన్నుమూశారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా.. అనేక మంది నాయకులు, ప్రముఖులు.. పట్టాబిరాం మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
ఎక్కడ నుంచి ఎక్కడి వరకు..
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు పట్టాభిరాం.. సంప్రదాయ హిందూ జమీందారుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి బ్రిటీష్ కాలంలో పెద్ద జమీందార్. ‘రావ్ సాహెబ్’ భావరాజు సత్యనారాయణగా పేరున్న ఈ కుటుంబంలో పట్టాభిరాంకి 14 మంది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉన్నారు. చిన్నవయసులో కాలికి పోలియో సోకడంతో వైకల్యం ఏర్పడింది. దీంతో ఆయన కుంగిపోయినా.. కొన్నాళ్లకే కోలుకున్నారు. తనని తాను హిప్నాటిస్టుగా మలుచుకున్నారు. కాకినాడకు చెందిన `ఎంబేర్ రావు` అనే హిప్నాటిస్టు వద్ద శిక్షణ పొంది.. అనతి కాలంలోనే గుర్తింపు సొంతం చేసుకున్నారు.
1970ల నుంచి పట్టాభిరాంకు తిరుగులేకుండా పోయింది. స్వయంగా హిప్నాటిస్టు ప్రోగ్రాములు ఇవ్వడంతోపాటు.. మానసిక వికాస నిపుణులుగా పేరు తెచ్చుకున్నారు. వేలాది వేదికలపై గంటల తరబడి ఆయన ప్రసంగాలు చేశారు. ఎంతో మంది మేధావులను కూడా కదిలించారు. దేశ, విదేశాల్లోనూ ఆయన కార్యక్రమాలకు ఆడిటోరియంలు కిటకిటలాడేవి. అనేక పుస్తకాలు రచించారు. అనేక కార్యక్రమాలు చేశారు. చేతబడి వంటి మూఢనమ్మకాలపై ప్రజలను జాగృతం చేసే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. హిప్నాటిజాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి పలు రుగ్మతలను పోగొట్టవచ్చని నిరూపించారు. అప్పటి సీఎం ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారిలో పట్టాబిరాం ముఖ్యులు. ఆ తర్వాత.. చంద్రబాబు కూడా ఆయనను ఆదరించారు. అనేక కార్యక్రమాల్లో ఆయనకు పెద్దపీట వేశారు.
