Begin typing your search above and press return to search.

''టికెట్ లేదంట‌గా'' పేర్ని వ‌ర్సెస్ బుచ్చ‌య్య‌.. పేలిన స‌టైర్లు!

నిత్యం ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డే వైసీపీ, టీడీపీ నాయ‌కుల మ‌ధ్య స‌టైర్లు పేలాయి

By:  Tupaki Desk   |   6 Feb 2024 7:42 PM GMT
టికెట్ లేదంట‌గా పేర్ని వ‌ర్సెస్ బుచ్చ‌య్య‌.. పేలిన స‌టైర్లు!
X

నిత్యం ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డే వైసీపీ, టీడీపీ నాయ‌కుల మ‌ధ్య స‌టైర్లు పేలాయి. అసెంబ్లీ లాబీల్లో మాట‌ల విరుపుల‌తో ఒక‌రినొక‌రు ప‌ల‌క‌రించుకుంటూనే ప‌ర‌స్ప‌రం స‌టైర్లు వేసుకున్నారు. వారే వైసీపీ మాజీ మంత్రి మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, టీడీపీ కురువృద్ధ నాయ‌కుడు, రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే బుచ్చ‌య్య చౌద‌రి. ఈ ఇద్ద‌రూ కూడా వారి వారి పార్టీల‌కు బ‌లమైన గ‌ళాలుగా ఉన్నారు. తాజాగా అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల రెండో రోజు ఎదురు ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా పేర్ని నాని, బుచ్చ‌య్య‌లు ప‌ల‌క‌రించుకున్నారు.

అయితే..ఈ ప‌ల‌కరింపులో ఇద్ద‌రి మ‌ధ్య ప‌ద విరుపులు, వ్యంగ్యాస్త్రాలు క‌నిపించాయి. ''ఈ సారి టికెట్ లేదంట‌గా'' అనిపేర్ని నాని త‌న ప‌ల‌క‌రింపులోనే వ్యంగ్యాన్ని జోడించారు. అస‌లే గోదావ‌రి జిల్లాల పెద్ద‌మనిషి కావడంతో బుచ్చ‌య్య కూడా అంతే రీతిలో స‌మాధానం ఇచ్చారు. ''ఎవరు చెప్పారు. నేను పోటీలోనే ఉంటా.. తేల్చుకుంటా'' అంటూ.. వ్యాఖ్యానించారు. ''మీరు నేను రిటైర్ కాబోతున్నాం'' అని పేర్ని అన‌గా.. ''నేనేం రిటైర్ కావ‌ట్లేదు.. వ‌య‌సై పోయింద‌ని అనుకుంటున్నావేమో.. యాక్టివ్‌గానే ప‌నిచేస్తున్నా. చూస్తున్నావుగా'' అంటూ త‌న‌కున్న ప‌రిచ‌యంతో ఏక‌వ‌చ‌నంతోనే సంభోదించారు.

ఇద్ద‌రూ కూడా ఒక‌రు కృష్నాజిల్లాకు చెందిన వారు కావ‌డంతో కృష్నా నీటిలో ఉండే.. వ్యంగ్యం, ఒక‌రు గోదావ‌రి జిల్లాకు చెందిన వారు కావ‌డంతో ఆ నీటిలో ఉండే విరుపు వారి మాట‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది. ''లోక‌ల్ పార్టీల్లో అంతా అధిష్టానం నిర్ణ‌య‌మే క‌దా!'' అని వ్యంగ్యాస్త్రం జోడించ‌గా.. ''నా విష‌యంలో అలాంటిదేమీ లేద‌ని, టీడీపీ అలా ఆలోచ‌న చేయ‌దు'' అని బుచ్చ‌య్య అన్నారు. అనంత‌రం.. బుచ్చయ్య మ‌రో సెటైర్ వేశారు.. ''ఏంటీమ‌ధ్య బ‌స్సులు నడుపుకుంటున్నారంట‌.. ట్రైనింగా!'' అని వ్యాఖ్యానించారు. ''మ‌న‌కి బ‌స్సు, ట్రాక్ట‌ర్ ఏదైనా ఒక్క‌టే.. మీరైతే.. ట్రైనింగ్ అవ్వాలి కానీ'' అని పేర్ని అన్నారు. ఈ సంభాష‌ణ విన్న వారు ముసిముసిగా న‌వ్వుకున్నారు. ఇటీవ‌ల ఏలూరులో నిర్వ‌హించిన సిద్ధ స‌భ‌కు త‌న ప‌రివారాన్ని తీసుకువెళ్లే క్ర‌మంలో పేర్ని బ‌స్సు న‌డిపిన విష‌యాన్ని బుచ్చ‌య్య ఇలా గుర్తు చేశార‌న్న‌మాట‌.