బీఆర్ఎస్ బోల్తాకు కారణమెవరు? త్రిమూర్తుల్లో ఎవరి వైఫల్యం ఎంత!
పదేళ్ల అప్రతిహత విజయం.. తిరుగులేని అధికారం.. తెలంగాణ అంటేనే గులాబీ జెండా అన్న రేంజ్ నుంచి, ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి!
By: Tupaki Desk | 15 Feb 2026 7:00 PM ISTపదేళ్ల అప్రతిహత విజయం.. తిరుగులేని అధికారం.. తెలంగాణ అంటేనే గులాబీ జెండా అన్న రేంజ్ నుంచి, ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి! అసలు 'బంగారు తెలంగాణ' రథచక్రాలు ఎక్కడ ఊడాయి? ఉద్యమ కెరటం నుంచి జాతీయ రాజకీయాల కలల వరకు వెళ్లిన ప్రయాణం.. ఒక్కసారిగా పాతాళానికి ఎందుకు పడిపోయింది? ఈ పతనానికి బాధ్యులెవరు? కేసీఆర్ వ్యూహం తప్పిందా? కేటీఆర్ అతి విశ్వాసం కొంపముంచిందా? లేక హరీష్ రావును పక్కన పెట్టడం శాపమైందా? గులాబీ పార్టీలో త్రిమూర్తుల వైఫల్యమే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఓటరు నాడిని పసిగట్టడంలో వరుసగా విఫలమవుతున్న గులాబీ దళం భవిష్యత్తుపై కార్యకర్తల్లో ఆందోళన కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.
తెలంగాణ ఇంటి పార్టీగా గుర్తింపు పొందిన బీఆర్ఎస్, సొంత గడ్డపైనే ఎందుకు పరాజయం పాలవుతోంది అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి సహజంగా గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ ఓట్ల శాతంలో భారీ వ్యత్యాసం గులాబీ పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోందని అంటున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం చెక్కు చెదరకపోయినా, పార్టీకి దూరమైన వర్గాలను తిరిగి ఆకట్టుకోవడంలో బీఆర్ఎస్ అధిష్టానంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.
తెలంగాణ అంటే కేసీఆర్ అన్నట్లు నినదించిన గులాబీ దళం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని తేలిగ్గా తీసుకునే ప్రయత్నాలు చేయడమే ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత తాము 30కి పైగా స్థానాలు గెలుచుకుంటామని ఆశిస్తే, 17 వచ్చాయని, బీజేపీకి అసలు ఒక్కస్థానం కూడా దక్కలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన ఇలా మాట్లాడటం చూసిన వారు మున్సిపల్ ఎన్నికల్లో అపజయాన్ని అంగీకరించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా లేదని అంటున్నారు. మొత్తం పోటీ చేసిన స్థానాలు కాకుండా, ఆశించిన స్థానాల్లో సగం గెలుచుకోవడం గొప్పగా బీఆర్ఎస్ భావిస్తోందా? అని ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి మున్సిపల్ ఎన్నికలే కాదు.. 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన నుంచి నేటి వరకు ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తన ప్రభావం చూపలేకపోతోందని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సరైన రీతిలో పనిచేయకపోవడమే అన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న భావనపైనే బీఆర్ఎస్ పార్టీ ఉండిపోయిందని అంటున్నారు. బీఆర్ఎస్ నేతలకు ఉన్న వ్యతిరేకతను ప్రజా వ్యతిరేకతగా భావిస్తూ తప్పులో కాలేస్తున్నారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆ స్థానంలో చూడటానికి బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికీ ఇష్టపడటం లేదు. ఈ కారణంగానే ఎక్కువ నష్టపోతున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహారశైలి కూడా పార్టీని దెబ్బతీస్తోందని చెబుతున్నారు. ఎన్నికల అనంతరం ఫాం హౌసుకు వెళ్లిపోయిన కేసీఆర్ ఇప్పటికీ అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రయత్నాలు చేయడం లేదని అంటున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను దిశానిర్దేశం చేయాల్సిన కేసీఆర్ తన బాధ్యతలను పూర్తిగా కేటీఆర్, హరీశ్ రావుకు వదిలేసినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీనినే అస్త్రంగా మలుచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు కేసీఆర్ ను దూరం చేయడంలో సక్సెస్ అయ్యారని అంటున్నారు. తెలంగాణ జాతిపితగా కేసీఆర్ ను బీఆర్ఎస్ అభివర్ణిస్తే, సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా జాతిపిత వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. దీనివల్ల కేసీఆర్ ను చులకన చేసే అస్త్రాలు బీఆర్ఎస్ స్వయంగా అందించిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తనను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నా, కేసీఆర్ మౌనంగా ఉండటం, తానొస్తే చీరేస్తానంటూ హెచ్చరించి ఆ వెంటనే ఫాం హౌసుకు వెళ్లి తాళాలు వేసేసుకోవడం వల్ల కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఇబ్బంది పడుతున్నాయని చెబుతున్నారు.
ఇలా తండ్రికొడుకులు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలను తిప్పికొట్టడంలో విఫలమవుతున్నారని అంటున్నారు. అదేసమయంలో సొంత ఇంటిని చక్కబెట్టుకోవడం లో కూడా బీఆర్ఎస్ తడబాటు ప్రదర్శిస్తోందని చెబుతున్నారు. ప్రధానంగా కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ కూతురు కవిత చేస్తున్న వ్యాఖ్యలు సైతం పార్టీలో కలకలం రేపుతున్నాయి. దీనివల్ల క్షేత్రస్థాయిలో ప్రజలు కూడా కేసీఆర్ ఇంటి సమస్యను చక్కదిద్దుకోలేని పరిస్థితిలో ఉన్నారని, ఇక తమ సంగతి ఏం చూస్తారన్న భావనకు వచ్చేస్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న వర్గాలు కేసీఆర్ గైర్హాజరీ వల్ల బీజేపీ వైపు మొగ్గు చూపడం కూడా నష్టం చేకూర్చుతోందని అంటున్నారు.
కేసీఆర్ స్థానంలో కేటీఆర్ ను ఊహించుకునేందుకు ప్రజలు ఇంకా సిద్ధపడటం లేదని, కేటీఆర్ సైతం అందరి ఆమోదం పొందడంలో తడబడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో హరీశ్ రావు సేవలకు పరిమితులు విధించడం వల్ల కూడా బీఆర్ఎస్ కు నష్టం చేస్తుందని అంటున్నారు. తాజా ఎన్నికల్లో హరీశ్ రావు నాయకత్వంలో బీఆర్ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లాలో చెప్పుకోదగిన ఫలితాలు సాధించిందని, కానీ ఆయనను ఇతర ప్రాంతాల్లో తిప్పే విషయంలో అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోలేకపోతోందని అంటున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచనలో మార్పు వస్తే కానీ ఎన్నికల్లో ఫలితాలు మారే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.
