Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు ఏమేమి ఇష్టమో చెబుతున్న బోయపాటి!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   7 Oct 2023 10:37 AM GMT
చంద్రబాబుకు ఏమేమి ఇష్టమో చెబుతున్న బోయపాటి!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చంద్రబాబు జైలు జీవితం 28వ రోజుకు చేరింది. ఇంటి నుంచి వచ్చే భోజనం తింటూ, మెడిసిన్స్ క్రమం తప్పకుండా వాడుతూ బాబు ఆరోగ్యంగానే ఉన్నారని తెలుస్తుంది.

ఆ సంగతి అలా ఉంటే... చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ప్రతీ శనివారం నారా బ్రాహ్మణి ఒక్కో నిరసన కార్యక్రమం ప్లాన్ చేస్తున్నట్లున్నారు. గత శనివారం కంచాలపై గరిటెలతో కొట్టాలని, గంట కొట్టాలని, విజిల్స్ వేయాలని, హారన్స్ మోగించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ శనివారం (నేడు) కూడా రాత్రి 7 గంటలకు లైట్లు ఆపేసి కొవ్వుత్తులూ, దీపాలు వెలిగించాలని ఆమె కోరారు.

మరోపక్క చంద్రబాబు అరెస్ట్ పై సినిమా ఇండస్ట్రీ జనాలు స్పందించడం లేదనే కామెంట్లు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సినిమా జనాలకు చంద్రబాబు అరెస్ట్ విషయంపై స్పందించే విషయంలో మినహాయింపు ఇవ్వాలని పవన్ కల్యాణ్ కోరారు. ఈ సమయంలో సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీను స్పందించారు. చంద్రబాబు ఇంకొన్ని రోజులైనా జైల్లో ఉంటారని చెప్పుకొచ్చారు.

అవును... తాజాగా చంద్రబాబుపై స్పందించిన బోయపాటి శ్రీను... "చంద్రబాబు గురించి నేను ఒకటి చెప్పగలను... ఎందుకంటే నేను ఆయనతో జర్నీ చేసి ఉన్నాను" అని మొదలుపెట్టారు. అనంతరం... "ఆయన మనీ గురించి ఆలోచన చేయరు.. ప్రతీ మనిషి గురించి ఆలోచిస్తారు" అని అన్నారు.

అదేవిధంగా... "ఆయన మనీ గురించి ఆలోచించరు.. మంచి వ్యవస్థ గురించి ఆలోచిస్తాడు.! మనీ గురించి అస్సలు ఆలోచించరు.. ప్రతీ ఒక్కరూ బాగుండాలి, అందరూ డెవలప్ అవ్వాలని కోరుకుంటారు!" అని తనదైన స్టైల్లో స్పందించారు బోయపాటి శ్రీను. ఇదే సమయంలో... "ఆయన నిజాయితీగా నిలబడే ప్రాసెస్ లో అవసరమైతే జైలుకి వెళ్తారు, అవసరమైతే ఇంకొన్ని రోజులు ఉండమన్నా ఉంటారు" అని బోయపాటి చెప్పుకొచ్చారు.

దానికి కారణం... "ఆయనకు జనం అంటే అంత ఇష్టం, డెవలప్ మెంట్ అంతే అంత ఇష్టం" అని అన్నారు. స్కిల్ స్కాం లో జైలుకు వెళ్లడానికి... నిజాయితీగా నిలబడే ప్రాసెస్ లో జైలుకి వెళ్తారనడానికి సంబంధం ఏమిటనే సంగతి కాసేపు పక్కనపెడితే... చంద్రబాబు కోసం తాజాగా బోయపాటి శ్రీను చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.