Begin typing your search above and press return to search.

బొత్సకు చీపురుపల్లి సేఫేనా...!?

ఆయన 2004లో మొదటిసారి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.

By:  Tupaki Desk   |   5 March 2024 4:05 AM GMT
బొత్సకు చీపురుపల్లి సేఫేనా...!?
X

వైసీపీ సీనియర్ మంత్రి, విజయనగరం జిల్లా రాజకీయాల్లో పండిన వారు అయిన బొత్స సత్యనారాయణ తన రాజకీయ జీవితంలో ఐదవసారి వరసగా చీపురుపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయన 2004లో మొదటిసారి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. ఇక 2009లో రెండవసారి గెలిచారు. మంత్రితో పాటు ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు.

విభజన తరువాత కాంగ్రెస్ లోనే ఉంటూ చీపురుపల్లి నుంచి 2014లో పోటీ చేస్తే దాదాపుగా యాభై వేల దాకా ఓట్లు తెచ్చుకున్నారు బొత్స. ఇక 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి మూడవసారి విజయం సాధించారు. జగన్ క్యాబినెట్ లో అయిదేళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. ఇపుడు 2024లో మరోసారి చీపురుపల్లి నుంచి బొత్స బరిలోకి దిగుతున్నారు.

ఈసారి ఆయనకు రాజకీయంగా ఎలా ఉంటుంది అన్నది జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు తావిస్తోంది. దానికి కారణం టీడీపీ అధినాయకత్వం బొత్స మీద ఫోకస్ పెట్టడమే. బొత్సను ఈసారి ఓడించి తీరాలని చంద్రబాబు లెవెల్ లోనే పధక రచన సాగుతోంది. దాంతో ధీటైన అభ్యర్ధిగా మాజీ మంత్రులను బాబు అక్కడికి పంపాలనుకుంటున్నారు.

విశాఖకు చెందిన గంటా శ్రీనివాసరావుని చీపురుపల్లి వెళ్లమన్నారు. కానీ ఆయన నో చెప్పేశారు. శ్రీకాకుళానికి చెందిన మరో మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావుని కూడా పోటీ చేయించాలని చూసినా ఆయన వద్దు అనేశారు. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మీద ఒక సర్వే చేయిస్తున్నారు. ఇంకా ఏవేవో పేర్లను బాబు మదిలో ఉంచుకున్నారు.

అయితే టీడీపీ ఇంకా బొత్స మీద అభ్యర్ధిని ఖరారు చేయడంలేదు కానీ బొత్స మాత్రం తనదైన రాజకీయ వ్యూహంతో దూసుకుని పోతున్నారు. ఆయన టీడీపీ నుంచి కీలక నేతలను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. జనాలలో కలియ తిరుగుతున్నారు. అధికారం చేతిలో ఉండడం రాజకీయ అనుభవంతో ఆయన చీపురుపల్లిలో మరోమారు జెండా ఎగరేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

నిజానికి చూస్తే చీపురుపల్లిలో మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జున ఇంచార్జిగా ఉండి గత అయిదేళ్లుగా పార్టీ తరఫున పోరాడుతున్నారు. యువకుడు విద్యాధికుడు అయిన నాగార్జున 2019లో ఫస్ట్ టైం పోటీ చేసి ఓటమి పాలు అయినా అయిదేళ్ళుగా అక్కడే ఉంటూ వస్తున్నారు. దాంతో ఆయన జనాల్లో కొంత సింపతీ సాధించారు. ఈసారి టికెట్ ఇస్తే విజయం సాధిస్తాను అంటున్నారు.

ఆయనకు తొలి విడతలో టికెట్ ప్రకటించి ఉంటే ఈపాటికి ఒక ఊపు వచ్చేదని టీడీపీ క్యాడర్ అంటోంది. పక్క జిల్లాల నుంచి మాజీ మంత్రులను తెచ్చి పెట్టాలని చూడడం వల్ల రాజకీయ నష్టమే తప్ప లాభం ఉండదని అంటున్నారు. అయితే టీడీపీ హై కమాండ్ కి మాత్రం నాగార్జున మీద నమ్మకం లేదా అన్న సందేహాలు వస్తున్నాయి.

ఒక సీనియర్ మంత్రి మీద అభ్యర్ధిని ప్రకటించే విషయంలో ఇంత డైలమా ఉంటే అది కచ్చితంగా బొత్సకు మరోసారి మంచి విజయాన్నే కట్టబెడుతుందని తమ్ముళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బొత్స సేఫ్ జోన్ గానే చీపురుపల్లిని మలచుకుంటున్నారు. దానికి టీడీపీ హై కమాండ్ మరి కొంత మేలు చేసేలా వ్యవహరిస్తోంది అన్నదే చర్చగా ఉంది.