వైసీపీ నేత బొత్సపై ఆ భారమే కుంగదీస్తోందా?
బొత్స కుటుంబసభ్యులను వైసీపీ నాయకులు పలువురు ఫోన్‌లోనే పరామర్శించారు. ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు.
By: Garuda Media | 28 Feb 2026 3:00 PM ISTవైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. గురువారం రాత్రి ఆయనను ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. దీంతో వైద్యులు ఆయనను ఐసీయూకు తరలించి వైద్యం అందిస్తున్నారు. నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచాలని సూచించడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ సిటీ న్యూరో సెంటర్‌లోనే ఆయనను ఉంచారు. బొత్స కుటుంబసభ్యులను వైసీపీ నాయకులు పలువురు ఫోన్‌లోనే పరామర్శించారు. ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు.
బ్రెయిన్ స్ట్రోక్ అంటే.. ?
బ్రెయిన్ స్ట్రోక్ అనేది మెదడులోని ఒక భాగానికి రక్త ప్రవాహం ఆగిపోయినప్పుడు(వైద్య పరిభాషలో దీనిని ఇస్కీమిక్ అంటారు) లేదా రక్తనాళం లీక్ అయినప్పుడు/పగిలిపోయినప్పుడు (రక్తస్రావం) సంభవించడమే. ఇది వైద్యపరమైన అత్యవసర పరిస్థితికి దారి తీస్తుంది, దీని వలన మెదడు కణజాలానికి ఆక్సిజన్ అందదు. దీని వలన మెదడు కణాలు నిమిషాల్లోనే చనిపోతాయి, దీనివల్ల శాశ్వత వైకల్యం లేదా మరణం సంభవించవచ్చునని వైద్యులు చెబుతున్నారు.
బొత్స విషయంలో ఏం జరిగింది?
బొత్స సత్యనారాయణ విషయంలో బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా.. ఆయన మాట్లాడలేక పోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలోనే బొత్స సత్యనారాయణ చికిత్స పొందు తున్నారు. ఆయన తిరిగి మాట్లాడేందుకు వీలుగా మాస్కులు వేసినట్టు తెలిసింది. అయితే.. పూర్తి వివరాలు వెల్లడించేందుకు కుటుంబ సభ్యులు గోప్యత పాటిస్తున్నారు.
భారం అంతా..
ప్రస్తుతం జరుగుతున్న శాసన బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ సభ్యులు అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. దీంతో మండలిపైనే ఎక్కువగా వైసీపీ ఆధారపడింది. దీంతో మండలిలో వైసీపీ పక్ష నాయకుడిగా(ప్రధాన ప్రతిపక్ష) ఉన్న బొత్స సత్యనారాయణపైనే ఎక్కువగా భారం పడింది. ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి నుంచి ఇందార్‌పూర్ డెయిరీ, హెరిటేజ్ డెయిరీలకు సంబంధించిన విషయాలను ఆయన ప్రస్తావించారు. సభలో విపక్ష నాయకుడిగా ఆయన పదే పదే ప్రసంగించడం.. ఈ క్రమంలో ఆవేశానికి గురికావడంతో బొత్స బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్టు తెలుస్తోంది.
ఇదిలావుంటే.. గత ఏడాది కూడా బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి గురయ్యారు. అప్పట్లోనే ఆయన వైసీపీ పక్ష నాయకుడిగా ఉండనని పార్టీ అధినేత జగన్‌కు చెప్పినట్టు సమాచారం. కానీ, సామాజిక సమీకరణల నేపథ్యంలో జగన్ ఆయనను కొనసాగిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
