Begin typing your search above and press return to search.

భారీ ఉగ్ర కుట్ర భ‌గ్నం.. నిమాజాబాద్ బోధ‌న్ లోనూ దీని మూలాలు

జార్ఖండ్ నుంచి మొద‌లై ఢిల్లీ మీదుగా మ‌ధ్యప్ర‌దేశ్.. ఆపై నిజామాబాద్ జిల్లా బోధ‌న్ వ‌ర‌కు విస్త‌రించిన ఉగ్ర ముఠా లింకుల‌ను పోలీసులు ఛేదించారు.

By:  Tupaki Desk   |   12 Sept 2025 3:00 PM IST
భారీ ఉగ్ర కుట్ర భ‌గ్నం.. నిమాజాబాద్ బోధ‌న్ లోనూ దీని మూలాలు
X

జార్ఖండ్ నుంచి మొద‌లై ఢిల్లీ మీదుగా మ‌ధ్యప్ర‌దేశ్.. ఆపై నిజామాబాద్ జిల్లా బోధ‌న్ వ‌ర‌కు విస్త‌రించిన ఉగ్ర ముఠా లింకుల‌ను పోలీసులు ఛేదించారు. మూడు రోజుల కింద‌ట బోధ‌న్ లో అనుమానిత ఉగ్ర‌వాదిని ప‌ట్టుకోవ‌డం సంచ‌ల‌నం రేపింది. రాంచీకి చెందిన వ్య‌క్తిని ప‌ట్టుబ‌డ‌డ్డాక‌.. అత‌డిచ్చిన స‌మాచారంతో బోధ‌న్ వ‌చ్చారు ఢిల్లీ పోలీసులు. ఇప్పుడు ఈ నెట్ వ‌ర్క్ మొత్తాన్ని ఛేదించారు. దేశంలో భారీ పేలుళ్ల‌కు కుట్ర ప‌న్నిన ఈ నెట్ వ‌ర్క్ లో బోధ‌న్ లో ప‌ట్టుకున్న వ్య‌క్తి స‌హా ఐదుగురు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.

లీడ‌ర్లే టార్గెట్...

ఢిల్లీ పోలీసులు ప‌ట్టుకున్న ఐదుగురు దేశంలో ఉగ్ర కార్య‌క‌లాపాల‌కు వ్యూహ ర‌చ‌న చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. కొంద‌రు నాయ‌కుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడుల‌కు సిద్ధం అవుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఆత్మాహుతి జాకెట్లు, బాంబుల‌ను సిద్ధం చేసుకున్న‌ట్లు చెప్పారు. మొత్తం 40 మంది క్రియాశీల ఉగ్ర‌వాద నెట్ వ‌ర్క్ స‌భ్యులు నిరంత‌రం ట‌చ్ లో ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

రాంచీలో క‌దిలిన డొంక‌తో...

జార్ఖండ్ లోని రాంచీలో డానీష్ (23) అనే అనుమానితుడిని ప‌ట్టుకోవ‌డంతో డొంక క‌దిలింది. ఢిల్లీ పోలీసులు కేంద్ర సంస్థ‌ల‌తో కో ఆప‌రేట్ చేసుకుంటూ మొత్తం ఐదుగురిని ప‌ట్టుకున్నారు. వీరంతా ప‌లు రాష్ట్రాల‌కు చెందిన‌వారు కావ‌డం గ‌మ‌నార్హం. ఇందులో డానీష్ ప్ర‌ధాన సూత్ర‌ధారి. ముంబైలో అఫ్తాబ్, సుఫీయ‌న్ ల‌ను ఢిల్లీలోనే ప‌ట్టుకున్నారు. ఇక బోధ‌న్ లో దొరికిన‌వాడు హుజైఫా యామ‌న్. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఖ‌మ్రాన్ ఖురేషీని అదుపులోకి తీసుకున్నారు.

ఆరు నెల‌ల ప్ర‌ణాళిక‌...

ఈ ఐదుగురి ప‌ట్టివేత ఏదో హ‌డావుడిగా జ‌రిగిన‌ది కాద‌ని స్ప‌ష్టం అవుతోంది. ఆరు నెల‌లుగా వీరిపై నిఘా ఉంచి మ‌రీ అదుపులోకి తీసుకున్నారు. ఉగ్ర‌దాడికి ప్ర‌ణాళిక వేస్తున్న‌ట్లు తేల‌డంతో ప‌ట్టుకున్నారు. వీరంద‌రినీ బుధ‌, గురువారాల్లో అరెస్టు చేశారు. ఉగ్ర నెట్ వ‌ర్క్ లో వీరంతా చాటింగ్ బ‌య‌ట‌కు రాకుండా సిగ్న‌ల్, ఇత‌ర చాటింగ్ యాప్ ల‌ను ఉప‌యోగిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. పైగా అంద‌రూ ర‌సాయ‌న ఆయుధాల త‌యారీలో నిపుణులు అని చెప్పారు.

పాకిస్థాన్ హ్యాండ్ల‌ర్ల‌తో...

ఈ ఐదుగురు ఉగ్ర‌వాదులు పాకిస్థాన్ ఉగ్ర‌ముఠాల హ్యాండ‌ర్లతో ట‌చ్ లో ఉన్నార‌ని పోలీసులు తెలిపారు. వారి ఆదేశాల మేర‌కు భార‌త్ లో కార్య‌క‌లాపాలు సాగిస్తున్నార‌ని... సాధార‌ణ స‌మ‌యాల్లో ప్ర‌జ‌ల్లో క‌లిసిపోయి స్లీప‌ర్ సెల్స్ గా ఉంటున్నార‌ని, ఆయుధాలు, బాంబుల‌ను ఉగ్ర ముఠాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఉగ్ర‌వాదం వైపు మ‌ళ్లేలా యువ‌త‌ను మ‌త‌త‌త్వ ప్ర‌సంగాల‌తో రెచ్చ‌గొడుతున్న‌ట్లు వివ‌రించారు. ఐసిస్ స్లీప‌ర్ సెల్స్ తోనూ వీరికి సంబంధాలు ఉన్న‌ట్లు తెలిపారు.