Begin typing your search above and press return to search.

సీఎం రమేశ్‌ ఓకే.. మరి సుజనా చౌదరి పోటీ ఎక్కడ?

గతంలో టీడీపీకి ఆర్థిక మూలస్తంభాలుగా సీఎం రమేశ్, సుజనా చౌదరిలను పేర్కొనేవారు.

By:  Tupaki Desk   |   25 March 2024 8:43 AM GMT
సీఎం రమేశ్‌ ఓకే.. మరి సుజనా చౌదరి పోటీ ఎక్కడ?
X

గతంలో టీడీపీకి ఆర్థిక మూలస్తంభాలుగా సీఎం రమేశ్, సుజనా చౌదరిలను పేర్కొనేవారు. టీడీపీకి కావాల్సిన ఆర్థిక వనరులను ఈ ఇద్దరు నేతలు తమ పరిచయాల ద్వారా పార్టీకి సమకూర్చిపెట్టేవారు. ఈ క్రమంలో టీడీపీ తరఫున సీఎం రమేశ్‌ తోపాటు సుజనా చౌదరి రాజ్యసభ సభ్యులుగా రెండుసార్లు ఎంపికయ్యారు. అంతేకాకుండా సుజనా చౌదరి 2014లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ నుంచి కేంద్ర సహాయ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు.

అయితే 2019లో టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక సీఎం రమేశ్, సుజనా చౌదరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం రమేశ్‌ బీజేపీ తరఫున అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. మరోవైపు సుజనా చౌదరికి ఎంపీగా పోటీ చేసే అవకాశం రాలేదు. దీంతో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారని టాక్‌ నడుస్తోంది.

టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తులో భాగంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ లో 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో భాగంగా ఆరు పార్లమెంటు సీట్లకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు.

ఈ నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి అసెంబ్లీకి పోటీ చేస్తారని టాక్‌ నడుస్తోంది. సుజనా చౌదరిది కృష్ణా జిల్లా కంచికచర్ల స్వగ్రామం. దీంతో విజయవాడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బీజేపీ విజయవాడ పశ్చిమ నుంచి మాత్రమే పోటీ చేస్తుంది. దీంతో ఈ స్థానం నుంచి పోటీ చేయాలని సుజనా భావిస్తున్నారు.

కాగా విజయవాడ తూర్పు నుంచి 1999లో బీజేపీ తరఫున ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు పోటీ చేసి గెలుపొందారు. మళ్లీ బీజేపీ తరఫున విజయవాడ నగరంలో ఒక్క అభ్యర్థి ఇప్పటివరకు గెలుపొందలేదు. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ఈ రికార్డును బ్రేక్‌ చేస్తారో, లేదో వేచిచూడాల్సిందే.

మరోవైపు పొత్తులో భాగంగా మొదట విజయవాడ పశ్చిమ సీటును జనసేన పార్టీకి కేటాయించారు. అయితే చివరలో బీజేపీ కూడా చేరడంతో జనసేన ఆ పార్టీకి ఈ సీటును వదిలేసింది. దీంతో ఇక్కడ జనసేన ఇంచార్జిగా ఉన్న పోతిన వెంకట మహేశ్‌ రెబల్‌ అభ్యర్థిగా బరిలో దిగే యోచనలో ఉన్నారు.