Begin typing your search above and press return to search.

బీజేపీ అంటే భయంతో కూడిన భక్తా...గౌరవమా...?

అయినా బీజేపీతో లింక్ మాత్రం కుదరలేదు. ఈ నేపధ్యంలోనే ఇపుడు ఒక సంచలన పరిణామం జరిగిపోయింది.

By:  Tupaki Desk   |   12 Sep 2023 12:21 PM GMT
బీజేపీ అంటే భయంతో కూడిన భక్తా...గౌరవమా...?
X

భారతీయ జనతా పార్టీ ప్రాపకం కోసం తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికలు పూర్తి అయిన తరువాత నుంచి ప్రయత్నం చేస్తూనే ఉందన్న్నది బహిరంగ రహస్యం అంటారు. బీజేపీతో చెలిమి లేకపోవడం వల్లనే 2019 ఎన్నికల్లో చేటు జరిగింది అని చంద్రబాబు చాలా త్వరగానే గ్రహించి ఎన్నికల తరువాత నుంచి కమలం పార్టీ మీద తన మమకారాన్ని అమితంగా చాటుకుంటూ వస్తున్నారు.

ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్ కోసం గడచిన నాలుగున్నరేళ్ళుగా టీడీపీ పెద్దలు చాలా సార్లు ట్రై చేశారని కూడా ప్రచారంలో ఉన్న మాట. ఇదిలా ఉంటే మోడీతో గత ఏడాది రెండు సార్లు ఢిల్లీలో కొద్ది సేపు మాట్లాడే అవకాశం బాబుకు దక్కింది. ఇక ఈ ఏడాది మధ్యలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ వేశారు.

అయినా బీజేపీతో లింక్ మాత్రం కుదరలేదు. ఈ నేపధ్యంలోనే ఇపుడు ఒక సంచలన పరిణామం జరిగిపోయింది. తనను ఎవరూ అరెస్ట్ చేయలేరు అని ధీమా మీద నారా చంద్రబాబు ఉన్నారని అంటారు. ఆయనకు ఏ మాత్రం వాసన వచ్చినా కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకునేవారు అని అంటున్నారు.

అయితే జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ అలా ఉంది మరి. దాని వెనక బీజేపీ పెద్దలు ఉన్నారని కూడా ఇపుడిపుడే టీడీపీలోని కీలక నాయకులు, ఎల్లో మీడియా అనుమానిస్తోంది. అయినా చేసేది ఏమీ లేదు బాబు జైలుకు వెళ్ళి మూడు రోజులు గడచిపోయాయి. శపధం పట్టినట్లుగా బాబు అరెస్ట్ అయితే జరిగిపోయింది. తన జీవితంలో జైలు గోడలు టచ్ చేయలేదని చెప్పుకునే చంద్రబాబు ఆ వ్రత భంగం అయితే సంపూర్ణంగా జరిగిపోయింది.

సరే ఇపుడు ఇంత జరిగినా బీజేపీ కేంద్ర పెద్దలు స్పందిస్తున్న తీరు మాత్రం విస్మయం కలిగించేలా ఉంది అని అంటున్నారు. పెద్ద నాయకులు కేంద్ర మంత్రులు ఎవరూ బాబు అరెస్ట్ మీద ఏ మాత్రం స్పందించడంలేదు. ఇక ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈ విషయం దృష్టిలో పెట్టిందని ఆయనే మీడియాకు చెప్పారు.

అంటే పురంధేశ్వరి తన స్థాయిలో తాను బీజేపీ పెద్దలకు చెబుతూ బాబు విషయంలో సానుకూలంగా చేయాలని ఆలోచిసున్నారా అన్న చర్చ ఒక వైపు ఉంది. అయినా బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది అంటున్నారు. ఇదిలా ఉంటే బాబు అరెస్ట్ వెనక కేంద్ర ప్రభుత్వం ఉందని ఇప్పటికే వామపక్షాలు ఆరోపించాయి. బాబు వంటి లీడర్ ని జైలులో వేయడం అంటే అది సామాన్యంగా జరిగేది కాదని కూడా అంటున్నారు.

దీని మీద నారా లోకేష్ కి మీడియా నుంచి ఒక కీలక ప్రశ్న వచ్చింది. దానికి లోకేష్ బదులిస్తూ ఆ ప్రశ్నలు డౌట్లూ వచ్చిన వారినే అడగండి అటూ బదులిచ్చారు తప్ప బీజేపీ ఉందా లేదా అన్న దానికి సూటిగా చెప్పలేదు. దీనిని బట్టి నారా లోకేష్ కి బీజేపీ మీద కనీసంగా మాట్లాడడానికి కూడా కొంత ఇబ్బందిగా ఉందని అంటున్నారు.

ఇక చంద్రబాబు తీరు కూడా ఇలాగే ఉంది అని అంటున్నారు. ఆయన బీజేపీని పల్లెత్తు మాట అనకుండా ఎపుడూ వైసీపీ మీదనే తన విమర్శలు చేస్తూ వచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి ధరల పెరుగుదల, పెట్రోల్ డీజిల్ పెంపు వంటి వాటి మీద కూడా వైసీపీ మీదనే బాబు విమర్శలు చేస్తూ వచ్చారు.

మరో వైపు చూస్తే బీజేపీ ఈ రోజు పవర్ లో ఉంది. ఇండియా కూటమికి రేపటి రోజున అధికారం దక్కుతుందా లేదా అన్నది ఎవరికీ తెలియదు. దీంతో బీజేపీ మూడవసారి కూడా అధికారంలోకి వస్తే అపుడు ఇంకా ఇబ్బంది అవుతుందనే 2019లో మాదిరిగా తొందరపడకుండా టీడీపీ బీజేపీ మీద ఏమీ అనేందుకు సాహసించడంలేదు అని అంటున్నారు. దీనిని చూసిన వారు ఇదంతా బీజేపీ మీద భయంతో కూడిన భక్తి గౌరవం టీడీపీకి అని సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా ఆపరేషన్ చంద్రబాబు అన్నది వైసీపీ ప్లాన్ అని అంటున్నా సూత్రధారులు తెర వెనక ఉన్నారని అంటున్నారు. మరి టీడీపీకి ఆ సూత్రధారుల గురించి మాట్లాడేందుకు నిలువెల్లా భయమే అని కామెంట్స్ వస్తున్నాయి.