మోడీ ముట్టుకుని పొగిడారు అంటే ఆ పార్టీ అంతే....లోకేష్ కీ ఇదే చెబుతున్నారు అందరూ..!
మరి ఇటీవల కాలంలో లోకేష్ బాబుని మోడీ సార్ తెగ ముద్దు చేస్తున్నారు. లోకేష్ ని చూసిన వెంటనే పున్నమి చంద్రుని వెన్నెల మాదిరిగా నిండుగా నవ్వుతూ దగ్గరకు తీస్తున్నారు.
By: Tupaki Desk | 23 Jun 2025 6:00 PM ISTఅవునా ఇది నిజమా అంటే గత అనుభవాలను చాలా మంది చెబుతున్నారుట. అతి ప్రేమతో పెద్దాయన టచ్ చేస్తే చాలు ఇంక అంతే అంటున్నారు. మరి ఇటీవల కాలంలో లోకేష్ బాబుని మోడీ సార్ తెగ ముద్దు చేస్తున్నారు. లోకేష్ ని చూసిన వెంటనే పున్నమి చంద్రుని వెన్నెల మాదిరిగా నిండుగా నవ్వుతూ దగ్గరకు తీస్తున్నారు. మోడీ అంతటి శక్తివంతమైన నాయకుడు తన స్పీచ్ లో పదే పదే లోకేష్ అంటూ చెబుతున్నారు అంటే నిజంగా అది షాకింగ్ లాంటిదే. అయితే ఇది షేక్ చేసే షాకింగా లేక మేలు చేసే షాకింగా అన్నదే అంతటా చర్చ.
మ్యాటర్ లోకి వస్తే మోడీతో ఎవరైనా కలిశారు అంటే వారు అంత వీక్ అయినట్లు అని చరిత్ర చెబుతోంది. బీజేపీలో వరిష్ట నేతలుగా ఉన్న వాజ్ పేయి అద్వానీ మాదిరిగా కాదు మోడీ అమిత్ షాలతో అని అంటున్నారు. వాజ్ పేయ్ అద్వానీ పక్కా పార్టీ సిద్ధాంతాలతో బీజేపీని నడిపించారు. ప్రత్యర్ధులు అయినా అదే మెచ్చుకుంటారు కూడా.
అయితే మోడీ అమిత్ షాలతో అలా కాదు, వారు తలచుకున్నారు అంటే ఆయా రాష్ట్రాలలో బీజేపీ బలపడి తీరాల్సిందే. ఈ విషయంలో సామదాన భేద దండోపాయాలను వారు కచ్చితంగా అనుసరిస్తారు అని అంటున్నారు. ఇక చూస్తే కనుక మహారాష్ట్రలో శివసేన ఠాక్రే ఫ్యామిలీ కానీ, యూపీలో బీఎస్పీ మాయావతి కానీ, కర్ణాటకలో జేడీఎస్ దేవేగౌడ కానీ, తమిళనాడులో అన్నాడీఎంకే కానీ, బీహార్ లో నితీష్ కుమార్ కానీ బీజేపీతో జట్టు కట్టాక వీక్ అయిపోయిన సంగతిని అంతా గుర్తు చేస్తున్నారు.
పైగా బీజేపీ ఆయా రాష్ట్రాలలో తన రాజకీయ వాటాను భారీగా పెంచుకోవడమే కాదు కొన్ని చోట్ల అధికారాన్ని సైతం అందుకుంది అని చెబుతున్నారు. పైన చెప్పుకున్న రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ బీజేపీతో చేరి జూనియర్ పార్టనర్లుగా మారిపోయారు అని అంటున్నారు.
ఇక ఇపుడు చూస్తే ఏపీ మీద బీజేపీ కన్ను పడింది. ఏపీలో పాగా వేయాలని బీజేపీ డిసైడ్ అయింది అని అంటున్నారు. లోకేష్ ని అదే పనిగా బీజేపీ పొగుడుతోంది అంటే వెనకాల ఏదో జరుగుతోంది అని అర్ధం చేసుకోవాలని రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి.
ఇక ఏపీలో చూస్తే టీడీపీ తనకు తానుగా సొంతంగా క్యాడర్ ఉన్న పార్టీ. ఏదో విధంగా కిందా మీద పడి అయినా పలుమార్లు అధికారంలోకి వచ్చిన పార్టీగా ఉంది. మరో వైపు చూస్తే కనుక బీజేపీ కనుక స్కెచ్ గీస్తే మాత్రం టీడీపీ ఇరుక్కోవడం ఖాయమని అంటున్నారు. అందువల్ల బీజేపీతో చాలా జాగ్రత్తగా ఉండాలని అంతా సూచిస్తున్నారు. బీజేపీ వల్ల టీడీపీకే ఎక్కువ నష్టం అని పార్టీ క్యాడర్ కూడా అంటోంది.
మరో వైపు చూస్తే కనుక మోడీ చంద్రబాబుని పొగడడం లేదు, అదే పనిగా లోకేష్ ని పొగుడుతున్నారు అని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు అపర చాణక్యుడు వ్యూహకర్త. అదే సమయంలో లోకేష్ ఇపుడిపుడే రాజకీయంగా రాటు తేలుతున్నారు. ఎంత ధీటుగా ఉన్నా చంద్రబాబు మార్క్ పొలిటికల్ వ్యూహాలు అయితే లోకేష్ కి లేవనే అంటారు.
బాబుది ఇన్ బిల్ట్ నాలెడ్జి. లోకేష్ విషయం తీసుకుంటే ఆయన చేతిలో అధికారం ఉంది వెనకాల తండ్రి దిగ్గజ నేత బాబు దన్ను ఉంది కాబట్టి దూకుడు చేస్తున్నారు. కానీ ఒక సంక్షోభం వచ్చినపుడు డీల్ చేయడం అంటే బాబుకే చెల్లు అంటారు. ఇక చూస్తే బాబు మాదిరిగానే లోకేష్ కి పొలిటికల్ గ్లామర్ అయితే లేదు. అదే సమయంలో బాబు మాదిరిగా పొలిటికల్ గ్రామర్ కూడా అంతగా లేదని అంటారు.
రాజకీయాల్లో ఈ రెండూ కావాల్సి ఉంది. గ్లామర్ తక్కువ అయినా గ్రామర్ లేకపోతే మనుగడ కష్టమని కూడా చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మరో వైపు చూస్తే కనుక చంద్రబాబుతో కంటే లోకేష్ తో పాలిటిక్స్ చేయడం బీజేపీకి చాలా సులువు అని అంటున్నారు. అధికారంలో సగం వాటా కోరడం ఇంకా ఈజీ అంటున్నారు. అలా బీజేపీ పాగా వేయడానికి లోకేష్ ఒక సాధనంగా మారుతారా అన్నది మరో చర్చగా ఉంది.
అందువల్ల లోకేష్ ని సీఎం గా చేయడానికి బీజేపీ అభ్యంతరం పెట్టకపోయినా ఆ తరువాత మాత్రం చాలా సన్నివేశాలు చూడాల్సి వస్తుందని అంటున్నారు. లోకేష్ ప్రతి వ్యూహాలు రచించడంలో తడబాటు పడితే మాత్రం బీజేపీ నెత్తిన పాలు పోసిన వారు అవుతారని కూడా అంటున్నారు.
ఇక ఏపీలో చంద్రబాబు ఉండగా బీజేపీ ఎంట్రీ కష్టం కావచ్చేమో కానీ లోకేష్ కి టీడీపీ పగ్గాలు దక్కిన మరుక్షణం కమలం మార్క్ రాజకీయం ఆట స్టార్ట్ అవుతుందని అంటున్నారు. అదే కనుక జరిగితే మాత్రం ఏపీలో బీజేపీ దూకుడుని నిలువరించడం కష్టమని అంటున్నారు. బీజేపీ రాజకీయ భవిష్యత్తుని ఊహించే ఈ విధంగా లోకేష్ ని దువ్వుతోందని అంటున్నారు. ఏది ఏమైనా లోకేష్ జాగ్రత్తగా ఉండమనే సలహా సూచనలు వస్తున్నాయి.
