Begin typing your search above and press return to search.

ఏఐ తో సాధ్యం కాదు.. ప్రోగ్రామింగ్ లో మానవ మేధకే గెలుపు

బిల్ గేట్స్ వ్యాఖ్యల మేరకు చూస్తే, భవిష్యత్తులో AI ప్రభావం తప్పనిసరి అయినా, అది మనిషి సృజనాత్మకతను పూర్తిగా భర్తీ చేయలేదని స్పష్టమవుతోంది.

By:  Tupaki Desk   |   10 July 2025 11:01 PM IST
ఏఐ తో సాధ్యం కాదు..  ప్రోగ్రామింగ్ లో మానవ మేధకే గెలుపు
X

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతూ, ఉద్యోగాల భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్న తరుణంలో, ప్రముఖ సాంకేతిక విజ్ఞాని, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. "వచ్చే 100 ఏళ్లయినా AI ప్రోగ్రామర్లను పూర్తిగా భర్తీ చేయలేదు" అని బిల్ గేట్స్ స్పష్టం చేశారు.

AI కేవలం కోడింగ్‌కి ఒక 'అసిస్టెంట్' మాత్రమేనని ఆయన అన్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోడింగ్‌లో AI తోడుగా ఉపయోగపడుతుందని, ముఖ్యంగా డీబగ్గింగ్, ఆటోమేటెడ్ టెస్టింగ్ వంటి పనుల్లో మానవుల భారాన్ని తగ్గించగలదని అభిప్రాయపడ్డారు. అయితే ఒక క్లిష్టమైన సమస్యను పరిష్కరించాలంటే, అక్కడ మానవ మేధలో ఉన్న సృజనాత్మకత, నిర్ణయం తీసుకునే సామర్థ్యం (జడ్జిమెంట్), ఆలోచన ధోరణి, పరిస్థితులకు అనుగుణంగా మారే సామర్థ్యం అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఇవన్నీ AIకి ఇంకా చాలా దూరంగా ఉన్న లక్షణాలని ఆయన పేర్కొన్నారు.

కోడింగ్ అంటే కేవలం "టైపింగ్" కాదని, అది ఒక కళలాంటిదని, లోతుగా ఆలోచించే పనిగా బిల్ గేట్స్ సూచించారు. ఒక మంచి ప్రోగ్రామర్ సమస్యను ఏ కోణంలోనైనా అర్థం చేసుకొని, సరికొత్త రీతిలో పరిష్కారం అందించగలగాలని, అలాంటి లక్షణాలను అల్గారిథమ్‌లు సాధించలేవని ఆయన తేల్చిచెప్పారు.

గతంలోనూ గేట్స్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కోడింగ్, ఎనర్జీ మేనేజ్‌మెంట్, బయాలజీ వంటి రంగాల్లో ఆటోమేషన్ వల్ల వచ్చే ముప్పు తక్కువేనని చెప్పారు. ఎందుకంటే, ఈ రంగాల్లో సమస్య పరిష్కారం, అనుకూలత, సృజనాత్మకత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయం.

ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చిన నివేదిక ప్రకారం, 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 8.5 కోట్ల ఉద్యోగాలు AI భర్తీ చేసే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించే అవకాశమూ ఉందని పేర్కొంది. దీనిపై స్పందించిన గేట్స్, ఈ పరిణామంపై ఆందోళన కలిగి ఉన్నట్లు వెల్లడించారు. అయితే, AIను తెలివిగా ఉపయోగించుకుంటే, మన ఉత్పాదకత పెరగడంతో పాటు, మానవులకు ఖాళీ సమయం, విహారానికి, ఆత్మవికాసానికి అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బిల్ గేట్స్ వ్యాఖ్యల మేరకు చూస్తే, భవిష్యత్తులో AI ప్రభావం తప్పనిసరి అయినా, అది మనిషి సృజనాత్మకతను పూర్తిగా భర్తీ చేయలేదని స్పష్టమవుతోంది. ప్రోగ్రామింగ్ వంటి రంగాల్లో మానవ మెదడు విశేషమైన పాత్ర పోషిస్తూనే ఉంటుంది. కాబట్టి, భవిష్యత్తులో AIతో పోటీ పడకుండా, దాన్ని ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగించుకోవడమే తెలివైన దారి అవుతుంది.