Begin typing your search above and press return to search.

బిల్ గేట్స్ వస్తే ఏంటి? సోషల్ మీడియాలో హాట్ టాపిక్

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ఏపీ పర్యటనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   16 Feb 2026 1:48 PM IST
బిల్ గేట్స్ వస్తే ఏంటి? సోషల్ మీడియాలో హాట్ టాపిక్
X

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ఏపీ పర్యటనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకప్పటి ప్రపంచ కుభేరుడైన బిల్ గేట్స్ రాకతో ఏపీకి ఏం ప్రయోజనమన్న ప్రశ్న ఎక్కువ చర్చకు దారితీస్తోంది. ఒక వ్యాపారవేత్త అయిన బిల్ గేట్స్ తన సొంత వ్యాపార ప్రయోజనాల కోసం రాష్ట్రానికి వచ్చారా? లేక ఇంకేమైనా విశేషం ఉందా? అనే అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లో అతిపెద్ద హైపర్ స్కేల్ డాటా సెంటర్ ను మైక్రోసాఫ్ట్ నిర్మిస్తోంది. ఇది ఈ ఏడాదే ప్రారంభం కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో మైక్రోసాఫ్ట్ ఏపీలో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహణకు ముందుకొస్తుంది అన్న చర్చ ఆసక్తి రేపుతోంది. వాస్తవానికి బిల్ గేట్స్ ప్రస్తుత పర్యటనలో మైక్రోసాఫ్ట్ వ్యాపారాల కంటే ఎక్కువగా సామాజిక ప్రాజెక్టులపై ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు వచ్చారని అంటున్నారు.

బిల్ గేట్స్ కేవలం ఒక వ్యాపారవేత్తగానే కాకుండా, తన ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య, సామాజిక మార్పులకు కృషి చేస్తున్నారు. ఆయన ఏపీ పర్యటన రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడమే కాకుండా, సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఆశిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో బిల్ గేట్స్ కు మూడు దశాబ్దాల పరిచయం ఉంది. తొలిసారి 1997లో ఈ ఇద్దరు కలుసుకున్న తర్వాత ఉమ్మడి ఏపీలో ఐటీ పరిశ్రమ విస్తరణకు బీజం పడింది. ఇక ప్రస్తుతం పర్యటన ద్వారా బిల్ గేట్స్ వ్యాపార అంశాలు కంటే ఎక్కువగా సామాజిక అంశాలకే ప్రాధాన్యమిస్తున్నారని చెబుతున్నారు.

ఏపీలో 'సంజీవని' అనే డిజిటల్ హెల్త్ ప్రాజెక్టును బిల్ గేట్స్ విస్తరించనున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు అవుతున్న ‘సంజీవని’ విజయవంతమైంది. దీని స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ హెల్త్ రికార్డుల సిస్టం విస్తరించే విషయమై ప్రభుత్వంతో బిల్ గేట్స్ చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, బిల్ గేట్స్ మధ్య ఉన్న అనుబంధం కేవలం రాజకీయ లేదా వ్యాపార సంబంధం మాత్రమే కాదని తాజా భేటీ రుజువు చేస్తోంది. ఈ ఇద్దరి మధ్య స్నేహం మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక సాంకేతిక భాగస్వామ్యంగా అభివర్ణిస్తున్నారు.

మరోవైపు అమరావతిలో ప్రతిపాదిత క్వాంటం వ్యాలీ, ఇతర ఐటీ ప్రాజెక్టులలో మైక్రోసాఫ్ట్ దాని అనుబంధ సంస్థల పెట్టుబడులపై ఆశలు రేకెత్తుతున్నాయి. బిల్ గేట్స్ వంటి ప్రపంచ స్థాయి వ్యక్తి రాజధాని అమరావతిని సందర్శించడం వల్ల ఇతర గ్లోబల్ కంపెనీలకు ఏపీపై నమ్మకాన్ని కలిగించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. అదేవిధంగా రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పాలనలో అత్యాధునిక సాంకేతికతను ఏపీ ప్రభుత్వం వాడుకుంటోంది. ఈ నేపథ్యంలో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో ఏపీ చేస్తున్న కృషికి గేట్స్ ఫౌండేషన్ సాంకేతిక సహాయం అందిస్తే, పాలనలో మరింత పారదర్శకత, వేగం పెరుగుతాయని అంటున్నారు.

ఇక ఈ రోజు అమరావతిలో జరుగుతున్న చర్చలు ఈ పాత అనుబంధానికి కొనసాగింపుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒక వైద్య రంగంలోనే కాకుండా వ్యవసాయంలో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి తెచ్చి సాగుఖర్చులు తగ్గించడం, దిగుబడి పెంచేందుకు గేట్స్ ఫౌండేషన్ సహకారం అందించనుంది. ఇదే సమయంలో అమరావతిలో ప్రతిపాదిత క్వాంటం వ్యాలీ, ఇతర ఐటీ ప్రాజెక్టులలో మైక్రోసాఫ్ట్, దాని అనుబంధ సంస్థల పెట్టుబడులపై ఆశలు రేకెత్తుతున్నాయి. బిల్ గేట్స్ వంటి ప్రపంచ స్థాయి వ్యక్తి అమరావతి సందర్శన ఇతర గ్లోబల్ కంపెనీలకు ఏపీపై నమ్మకాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. సాగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ల వినియోగాన్ని విస్తరించి రైతులకు లాభదాయకమైన విధానాలు అమలు చేసే దిశగా గేట్స్ ఫౌండేషన్ సహకరించనుందని అంటున్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, పేదరిక నిర్మూలన వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం లభిస్తే, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను వేగంగా చేరుకోవచ్చు అని కూడా ఆశిస్తున్నారు.