Begin typing your search above and press return to search.

రాజమండ్రి రూరల్ సీటు మీద మహా బెట్టింగ్స్ ....!

రాజమండ్రి రూరల్ పొత్తుల కధేంటి అంటే అందులోనే అసలైన పొలిటికల్ మసాలా ఉంది.

By:  Tupaki Desk   |   17 Feb 2024 1:07 PM GMT
రాజమండ్రి రూరల్ సీటు మీద మహా  బెట్టింగ్స్ ....!
X

ఈ టైటిల్ చూసి వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమిలో ఏ పార్టీ నెగ్గుతుందన్న దాని మీద అటూ ఇటూ బెట్టింగ్స్ జరుగుతున్నాయని అనుకుంటే పొరపాటే. అసలు విషయం అది కానే కాదు. రాజమండ్రి రూరల్ సీటు పొత్తులో భాగంగా ఎవరికి దక్కుతుంది అన్నదే ఇపుడు హాట్ టాపిక్. దాని మీదనే బెట్టింగుల మీద బెట్టింగులు జరుగుతున్నాయి. వీర లెవెల్ లో ఈ బెట్టింగ్స్ సాగడం చిత్రం.

రాజమండ్రి రూరల్ పొత్తుల కధేంటి అంటే అందులోనే అసలైన పొలిటికల్ మసాలా ఉంది. ఈ సీటు కోసం టీడీపీ జనసేన రెండూ పట్టుబడుతున్నాయి. ఈ సీటులో ఇప్పటికి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేతగా టీడీపీ సీనియర్ మోస్ట్ లీడర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఆయన 2024లో కూడా తాను పోటీకి సిద్ధం అంటున్నారు. సిట్టింగులకు చంద్రబాబు సీట్లు ఏనాడో కన్ ఫర్మ్ చేశారు అని ఆయన చెబుతున్నారు.

అయితే ఈ సీటు మీదనే జనసేన పట్టుబడుతోంది. కందుల దుర్గేష్ ఈ సీటు నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. అయితే గోరంట్ల మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. తాను పోటీలో ఉంటాను అని అంటున్నారు. ఇలా పోటాపోటీగా ఈ సీటు కోసం పోటీ సాగుతోంది. పొత్తులో ఎవరికి ఈ సీటు దక్కుతుంది అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది. గోరంట్లకు సీటు దక్కుతుందా లేక కందుల దుర్గేష్ కి ఇస్తారా అన్నదే ఇక్కడ పాయింట్. మరి పై స్థాయిలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ మాట్లాడుకుని ఎవరికి ఏ సీటు అన్నది ఖరారు చేస్తారు.

కానీ తమ నేతకే సీటు ఇవ్వాలని సాధారణంగా వారి అనుచరులలో ఉంటుంది. అలా బుచ్చయ్యచౌదరి అనుచరులు అభిమానులు తమ నేతకే టికెట్ ఇస్తారని ఎంత పందెం అని ముందుకు వస్తున్నారు. అలాగే దుర్గేష్ కి టికెట్ ఖాయం అని ఆయన అభిమానులు కూడా ముందుకు వస్తున్నారు. ఇలా బెట్టింగుల మీద బెట్టింగులు తీవ్ర స్థాయిలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉన్నాయని అంటున్నారు.

అవి పట్టణ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ కూడా వెళ్ళిపోయాయి. చిన్న స్థాయి నేత కూడా బెట్టింగ్ అంటున్నారు. ఇంతకీ ఈ బెట్టింగ్ ఏదో వైసీపీ మీద తమ పార్టీ విజయం అని కాదు, అలా అయితే బాగుండును. కానీ సీటు కోసమే ఈ బెట్టింగ్. మరి బెట్టింగులు ఈ స్థాయిలో ఉన్నాయి అంటే ఒకే సీటు కోసం పోరు ఇద్దరు నేతల మధ్య గట్టిగానే సాగుతుంది అని అనుకోవాలి.

నిజానికి టీడీపీ జనసేన పొత్తులు కనుక సజావుగా సాగాలీ అంటే ఎవరికి సీటు ఇచ్చినా రెండవ పార్టీ వారు పనిచేయాలి. ఓటు బదిలీ అన్నది సక్రమంగా సాగాలి. మరి సీటు దగ్గరే పేచీ వస్తే ఈ ఇద్దరిలో ఒకరికి సీటు ఇస్తే రెండవ వర్గం నేత అనుచరులు అభిమానులు పనిచేస్తారా అన్న డౌట్లు వస్తున్నాయి.

అలా పనిచేయకపోతే ఓట్ల బదిలీ కాకపోతే అది కూటమికే ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. ఇది కేవలం ఒక్క రాజమండ్రి రూరల్ కే సంబంధించిన విషయం కాదు, రాష్ట్రమంతా అలాగే పొత్తు సీట్ల మధ్య అంటే ఒకే సీటు కోసం రెండు పార్టీలూ గట్టిగా పోటీ పడుతున్న చోట నెలకొన్న పరిస్థితులు అని అంటున్నారు. అయితే ఓటు ట్రాన్స్ఫర్ అన్నది చాలా ముఖ్యం.

పై స్థాయిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లను చూసుకుని దిగువ స్థాయి నేతలు అంతా ఒక్కటిగా కలవాలి. రెండు పార్టీలూ కూడా ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలి. కానీ దానికి రాజమండ్రి రూరల్ భిన్నంగా ఉంది అని అంటున్నారు. ఈ విషయంలో మాత్రం ఏమి జరుగుతుంది ఎవరికి టికెట్ వస్తుంది అన్నది పక్కన పెడితే బెట్టింగ్ రాయుళ్ళు దిగిపోయి ఈ ఇష్యూని మరింతగా పెద్దది చేస్తున్నారా అన్న చర్చ కూడా నడుస్తోంది.

మరో వైపు చూస్తే రామచంద్రాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అయిన చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ రాజమండ్రి రూరల్ కి షిఫ్ట్ అయ్యారు. ఆయన అక్కడ తమ ప్రచారాన్ని మొదలెట్టేశారు. వైసీపీ తరఫున ఆయన ముందుకు అలా సాగిపోతున్నారు. ఈ నేపధ్యంలో రెండు పార్టీలు సయోధ్యతో ముందుకు సాగితే బాగుంటుంది అని అంటున్నారు.