Begin typing your search above and press return to search.

ఆయనకు టికెట్‌ ఇస్తే ఆశ్చర్యపోయిన చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు జూన్‌ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు

By:  Tupaki Desk   |   11 Jun 2024 12:30 PM GMT
ఆయనకు టికెట్‌ ఇస్తే ఆశ్చర్యపోయిన చంద్రబాబు!
X

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు జూన్‌ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో మూడు పార్టీల ఎమ్మెల్యేలు చంద్రబాబును తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు హాట్‌ కామెంట్స్‌ చేశారు. మూడు పార్టీల సమిష్టి కృషితోనే ఈ విజయం సాకారమైందన్నారు. నరసాపురం బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నర్సాపురం ఎంపీ టికెట్‌ ను బీజేపీ శ్రీనివాస వర్మకు ఇస్తే ఆశ్చర్యపోయానన్నారు. ఆయన ఎవరని ఆరా తీస్తే ఆ పార్టీలో మొదటి నుంచి ఉన్న సామాన్య కార్యకర్త అని.. ఆ పార్టీ కోసం నిబద్ధతతో కృషి చేస్తున్నారని తెలిసిందన్నారు.

ఒక సామాన్య కార్యకర్తకు సీటు ఇచ్చి ఎంపీ చేసిన ఘనత, ఆయనను కేంద్ర మంత్రిని చేసిన ఘనత బీజేపీకి దక్కిందన్నారు. ఎంపీగా సీటు ఇవ్వడమే ఆశ్చర్యం అనుకుంటే.. ఇంకా ఆశ్చర్యపోయేలా శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవిని కూడా ఇచ్చారన్నారు. బీజేపీలో ఇదే ప్రత్యేకత అని తెలిపారు. ఒక్క బీజేపీనే కాకుండా జనసేన, టీడీపీలు కూడా కార్యకర్తలకు సీట్లు ఇచ్చి గెలిపించుకున్నాయన్నారు.

కాగా కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి సముచిత గౌరవం దక్కిందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ముగ్గురు ఏపీ ఎంపీలకు కేంద్రంలో మంత్రి పదవులు లభించాయన్నారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నర్సాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు కేంద్ర కేబినెట్‌ లో చోటు దక్కిందని తెలిపారు.

పదేళ్ల మోదీ పరిపాలన దేశప్రతిష్ఠను పెంచిందని చంద్రబాబు కొనియాడారు. ప్రపంచంలో భారతీయులకు గుర్తింపు తీసుకొచ్చారన్నారు. ప్రపంచంలో ఏడు స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చిన ఘనత నరేంద్ర మోదీదే అని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ కల వికసిత్‌ భారత్‌– 2047 అని అన్నారు. అప్పటికి ప్రపంచంలో భారత్‌ ఒకటో స్థానంలో ఉంటుందన్నారు. అలాగే మనది వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ అని తెలిపారు.

తనకు కూడా స్వార్థం ఉందని తెలుగు వాళ్లు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారంతా ముందుకెళ్లాలనేది తన ఆకాంక్ష అని తెలిపారు. వివిధ దేశాల్లో ఉంటున్న తెలుగువారు అత్యధికంగా సంపాదిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.