Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్... భీమవరం జనసేన అభ్యర్థి ఈయనేనా?

ఇందులో భాగంగా.. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) తో హైదరాబాద్ లోని తన నివాసంలో భేటీ అయ్యారు పవన్ కల్యాణ్.

By:  Tupaki Desk   |   26 Feb 2024 2:01 PM GMT
హాట్  టాపిక్... భీమవరం జనసేన అభ్యర్థి ఈయనేనా?
X

టీడీపీ - జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 94 స్థానాల్లోనూ చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించగా... 24 స్థానాలు దక్కించుకున్న పవన్ కల్యాణ్ మాత్రం ఐదు స్థానాలో మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. అయితే... ఆ ఐదు స్థానాల్లోనూ తాను ఎక్కడి నుంచి పోటీచేసేది ప్రకటించకపోవడం గమనార్హం. దీంతో... భీమవరం విషయంలోనూ పవన్ ఫిక్సయినట్లు లేదని తెలుస్తుండగా... ఇప్పుడు తాజాగా సరికొత్త పేరు తెరపైకి వస్తుంది.

అవును... పొత్తులో భాగంగా 175 స్థానాలకు గానూ 24 స్థానాలు దక్కించుకున్న పవన్ కల్యాణ్... కేవలం 5 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించారు. దీంతో మిగిలిన స్థానాలు, అందులోని అభ్యర్థులు ఎవరు అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ విషయంపై వినిపిస్తున్న సెటైర్ల సంగతి కాసేపు పక్కనపెడితే... పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్ తాను పోటీ చేసే స్థానంపైనా స్పష్టత ఇవ్వలేదు. ఈ సమయంలో భీమవరం మాజీ ఎమ్మెల్యేతో పవన్ భేటీ అయ్యారు!

ఈసారి పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారని అంటున్న వేళ... సర్వేల ప్రభావమో లేక ఇంకేదైనా కారణమో తెలియదు కానీ... పవన్ ఆ విషయాన్ని అభ్యర్థుల ప్రకటన సందర్భంగా కూడా స్పష్టం చేయలేదు. ఈ సమయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) తో హైదరాబాద్ లోని తన నివాసంలో భేటీ అయ్యారు పవన్ కల్యాణ్.

దీంతో భీమవరం జనసేన, టీడీపీల్లో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో అంజిబాబును భీమవరం నుంచి బరిలోకి దింపబోతున్నారా అనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి. వాస్తవానికి అంజిబాబుకి భీమవరం నుంచి రెండు సార్లు వేరు వేరు పార్టీల నుంచి గెలుపొందిన అనుభవం ఉంది. ఈ సమయంలో ఆయన అనుభవాన్ని పవన్ తీసుకుంటున్నారా.. లేక, ఆయననే తీసుకుంటున్నారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరి ఈ విషయంపై స్పష్టత ఎవరిస్తారనేది వేచి చూడాలి!

కాగా... 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భీమవరం నుంచి పోటీచేసిన అంజిబాబు... 22,099 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అప్పుడు పీఆర్పీ, టీడీపీ అభ్యర్థులు కూడా భీమవరం నుంచి బరిలో నిలిచారు. అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన... వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనుపై 13,726 ఓట్ల తేడాతో గెలిచారు. ఇలా రెండు సార్లు భీమవరం నుంచి వేరు వేరు పార్టీలలో గెలుపొందారు అంజిబాబు.

ఇక గడిచిన ఎన్నికల్లో గ్రంథి శ్రీను చేతిలో జనసేన అభ్యర్థిగా పవన్ తో పాటు టీడీపీ అభ్యర్థిగా అంజిబాబు ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో గ్రంథి శ్రీనుకి 70,642 ఓట్లు దక్కగా... రెండో స్థానంలో నిలిచిన అంజిబాబుకి 62,285 ఓట్లు దక్కాయి. ఇక మూడో స్థానానికి పరిమితమైన పవన్ కల్యాణ్ 54,037 ఓట్లు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో... వైసీపీకి భీమవరంలో తనకంటే అంజిబాబే సరైన ప్రత్యర్థి అని పవన్ భావిస్తున్నారా అనే చర్చ తెరపైకి వచ్చింది.