చంద్రబాబు వద్దకు తెలంగాణ మంత్రులు.. మ్యాటరేంటి? అంటే..
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పర్యటన పూర్తిగా వ్యక్తిగతంగానే చెబుతున్నారు.
By: Tupaki Political Desk | 27 Feb 2026 3:43 PM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం కలుసుకున్నారు. రాజధాని అమరావతికి వచ్చిన ఈ ఇద్దరు ఉండవల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇద్దరు మంత్రులను చంద్రబాబు సాదరంగా ఆహ్వానించి, చాలాసేపు ముచ్చటించారు. ఇటీవల కాలంలో తెలంగాణకు చెందిన మంత్రులు తరచూ ఉండవల్లి వస్తున్నారు. సీఎం చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు పర్యటన ఆసక్తి రేపింది. చంద్రబాబును కలవడానికి కారణం ఏంటి అన్న ఉత్కంఠతో అంతా ఆరా తీస్తున్నారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పర్యటన పూర్తిగా వ్యక్తిగతంగానే చెబుతున్నారు. మార్చి 5న భట్టి కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు భట్టి, శ్రీధర్ బాబును వెంటబెట్టుకుని ఉండవల్లి వచ్చినట్లు చెబుతున్నారు. తన కుమారుడి పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేసి చంద్రబాబు తప్పకుండా హాజరు కావాలని కోరినట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబును తెలంగాణ ప్రజాప్రతినిధులు వరుసగా కలుస్తున్నారు. ప్రతి వారాంతంలో చంద్రబాబు హైదరాబాద్ వెళుతుంటారు. అక్కడ ఆయన నివాసంలో అందుబాటులో ఉంటారు. కానీ, భట్టి, శ్రీధర్ బాబు ప్రత్యేకంగా రాజధానికి వచ్చి మర్యాదపూర్వకంగా చంద్రబాబును ఆహ్వానించడం ఆసక్తికరంగా చెబుతున్నారు.
తెలంగాణ కేబినెట్ లో మంత్రులు కోమటిరెడ్డి వెంటకరెడ్డి, తమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొద్ది రోజుల వ్యవధిలోనే వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబును కలిశారు. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా కలవడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. అయితే చంద్రబాబును కలుస్తున్న తెలంగాణ మంత్రులు అంతా పూర్తిగా తమ వ్యక్తిగత పర్యటనలే అంటూ తేల్చి చెబుతున్నారు. చంద్రబాబుతో ఉన్న సుదీర్ఘ రాజకీయ పరిచయాల కారణంగా ఆయనను తమ ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు తప్పనిసరిగా ఆహ్వానిస్తున్నామని చెబుతున్నారు.
మార్చి 5న భట్టి కుమారుడు వివాహం హైదరాబాద్ లో జరగనుందని చెబుతున్నారు. ఈ వేడుకకు జాతీయస్థాయి పెద్దలు అందరినీ ఆహ్వానిస్తున్నారు. రెండు రోజుల క్రితం కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లిన భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లను ఆహ్వానించారు. వారికి పెళ్లి శుభలేఖలు అందజేశారు. ఇక సీఎం చంద్రబాబును ఆహ్వానించిన భట్టి తనతో మంత్రివర్గ సహచరుడు శ్రీధర్ బాబును తీసుకువచ్చారు. చంద్రబాబుకు పెళ్లి శుభలేఖ అందజేసిన తర్వాత కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు.
