Begin typing your search above and press return to search.

బెంగళూరు తొక్కిసలాట కేసు: ఆర్సీబీ నుంచి తొలి అరెస్ట్

కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

By:  Tupaki Desk   |   6 Jun 2025 10:06 AM IST
బెంగళూరు తొక్కిసలాట కేసు: ఆర్సీబీ నుంచి తొలి అరెస్ట్
X

బెంగళూరు ఘటనలో కర్ణాటక పోలీసులు తమ మార్క్ చూపించారు. అధికార పార్టీ, కర్ణాటక క్రికెట్ జట్టు నుంచి ఎదురైన తీవ్ర ఒత్తిళ్లను అధిగమించి, ఇప్పుడు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెన్స్‌లో పడటం, కర్ణాటక క్రికెట్ జట్టు మౌనం వహించడంతో పోలీసులు తమ పని తాము చేసుకుపోతున్నారు.

కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మృతులకు పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, బెంగళూరు ఆర్సీబీ ఫ్రాంచైజీ ప్రకటించినా మృతుల కుటుంబాలలో ఆగ్రహం చల్లారడం లేదు. "మీరిచ్చే డబ్బుల కంటే ఎక్కువే చెల్లిస్తాం, చనిపోయిన మా వారి ప్రాణాలు తిరిగి తీసుకురండి" అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామం మీడియాలో, సోషల్ మీడియాలో ప్రముఖంగా ప్రసారమవుతోంది.

-దర్యాప్తు వేగం, తొలి అరెస్ట్

పోలీసులు నిన్నటి నుంచి దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దర్యాప్తులో భాగంగా పలువురికి నోటీసులు జారీ చేసి, శుక్రవారం తెల్లవారుజాము నుంచి అరెస్టులను ప్రారంభించారు. ఇందులో భాగంగా, బెంగళూరు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలేను ముంబై వెళ్లడానికి విమానాశ్రయానికి చేరుకోగా, పోలీసులు అక్కడే అరెస్ట్ చేశారు. విజయయాత్రకు సంబంధించి సోసలే అనధికారికంగా ప్రమోషన్లు నిర్వహించారని, అనుమతి లేకుండానే పరేడ్ నిర్వహించారని పోలీసులు అభియోగాలు మోపారు. కాగా, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శంకర్, ట్రెజరర్ జయరాం పరారీలో ఉన్నారు.

-కీలక అరెస్టుల అంచనా

"కర్ణాటక పోలీసులు ఈ ఘటనలో దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్నవారిని వదిలిపెట్టడం లేదు. కీలక ఆధారాలు సేకరించారు, సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో విపరీతంగా ప్రచారం చేసిన బెంగళూరు తరఫు వారిని పోలీసులు గుర్తించారు. వారందరినీ అరెస్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ ఘటనలో భారీగా అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే, ఈ ఘటనలో మరిన్ని పెద్ద తలకాయలు అరెస్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు" అని కర్ణాటక మీడియాలో వార్తలు వస్తున్నాయి.