Begin typing your search above and press return to search.

ఇప్పుడు బెంగళూరు వంతు... బాబుకోసం రోడ్డెక్కిన ఐటీ ఉద్యోగులు!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై ప్రసుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 Sep 2023 11:14 AM GMT
ఇప్పుడు బెంగళూరు వంతు... బాబుకోసం రోడ్డెక్కిన ఐటీ ఉద్యోగులు!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై ప్రసుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన్ని వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు కొంతమంది టీడీపీ అభిమానులు, కార్యకర్తలు. ఇందులో భాగంగా ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.

ఈ క్రమంలో... బుధవారం హైదరాబాద్ లోని గచ్చిబౌలి వద్ద ఐటీ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. "ఐయాం విత్ సీబీఎన్" అంటూ ఫ్లకార్డులు చేతబట్టి నిరసనకు దిగారు. అయితే ఈ ర్యాలీలకు, నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని చెదరగొట్టారు. ఇదే సమయంలో గురువారం సైబర్ టవర్స్ వద్ద కూడా ఆందోళనకు దిగగా.. పోలీసులు అందుకు అనుమతివ్వలేదు.

ఈ సమయంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ... బెంగళూరులోని ఐటీ ఉద్యోగులు నిరసనకు దిగారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని నినాదాలు చేస్తూ... స్థానిక ఫ్రీడం పార్కులో వారంతా ఆందోళన చేపట్టారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని నినాదాలతో హోరెత్తించారు. "వియ్‌ వాంట్‌ జస్టిస్‌" అంటూ నినాదాలు చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇదే సమయంలో చంద్రబాబుకు మద్దతుగా తెలుగు సంఘాల ఆధ్వర్యంలో బెంగళూరు జయనగర్‌ కాలనీలోని వినాయకుడి ఆలయంలో పూజలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు. దీంతో ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా... ఈ నిరసనలకు సంబంధించి "బెంగళూరు టీడీపీ ఫోరం" గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వంపై నిరసనగా, బాబుకు సంపూర్ణంగా మద్దతు ఇద్దామని పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరు ఫ్రీడం పార్కులో జరిగే నిరసనకు కదిలిరావాలని పిలుపునిచ్చారు.

బెంగళూరుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే తెలుగు వారంతా చంద్రబాబు మద్దతుగా సాగుతున్న దీక్షలో భాగస్వామ్యులు కావాలని ఫోరం నాయకులు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో... తెలుగు మేధావులు.. పారిశ్రామిక వేత్తలు.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ అభిమానులు అందరూ భాగస్వామ్యులు కావాలని పేర్కొన్నారు.