పట్టు-బెట్టుల బనకచర్ల.. ఏం జరుగుతుంది?
ఒకరిది పట్టు.. మరొకరిది బెట్టు.. ఇదీ.. ప్రస్తుతం బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారం. దీనిని ఎట్టి పరిస్థితిలోనూ నిర్మించి తీరుతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు.
By: Tupaki Desk | 5 July 2025 10:00 PM ISTఒకరిది పట్టు.. మరొకరిది బెట్టు.. ఇదీ.. ప్రస్తుతం బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారం. దీనిని ఎట్టి పరిస్థితిలోనూ నిర్మించి తీరుతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అన్ని విష యాలను సమగ్రంగా తెలుసుకున్నాకే.. దీనిని నిర్మించాలని భావించామని అంటున్నారు. అంతేకాదు.. రాయలసీమకు బనకచర్ల ప్రాజెక్టు గేమ్ ఛేంజర్ అవుతుందని కూడా చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహా రంపై ముందుకే వెళ్లాలని నిర్ణయించారు.
ఇక, ఏపీ ప్రభుత్వం బనకచర్ల నిర్మాణంపై ఎంత పట్టుదలతో ఉందో.. తెలంగాణ సర్కారుకూడా.. దీనిని అడ్డుకునేందుకు అంతే పట్టుదలతో ఉందన్నది వాస్తవం. అందుకే.. సీఎం రేవంత్ రెడ్డినుంచి మంత్రుల వరకు ఇప్పటి వరకు పదే పదే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ క్రమంలోనే పర్యావరణ అనుమతుల విషయంలో ఒకింత మెలిక పడేలా చేసామని.. వారు చెబుతున్నారు. వాస్తవానికి బనకచర్ల విషయంలో కేంద్రం నేరుగా ఇప్పటి వరకు జోక్యం చేసుకోలేదు.
ప్రస్తుతం ఏపీకి వచ్చిన సమాచారం లేదా.. ప్రతిపాదనల వెనక్కి విషయాన్ని తీసుకుంటే.. కేంద్రంలోని పెద్దలు ఈవిషయంలో జోక్యం చేసుకోలేదు. కేవలం కేంద్ర పర్యావరణ విభాగం అధికారులు మాత్రమే.. గోదావరిలో మిగులు జలాల లెక్క చెప్పాలని.. దీనిని కేంద్ర జల సంఘం నిర్ణయించాలని కోరారు. ఇదేసమయంలో గోదావరి ట్రైబ్యునల్‌కు రిఫర్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అంటే.. ఒక రకంగా.. ఈ ప్రాజెక్టుకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే వచ్చిందని.. ఏపీ నాయకులు చెబుతున్నారు.
కానీ.. తెలంగాణ నాయకులు మాత్రం దాదాపు ఈ ప్రాజెక్టు ఆగిందని చెబుతున్నారు. అయితే.. ఇందులో నూ సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నారు. బనకచర్ల ఆగిపోలేదని ఆయన కూడా చెబు తున్నారు. అందుకే నిరంతరం అప్రమత్తంగా ఉండాలని.. ఎప్పుడు ఏమైనా జరగొచ్చని అంటున్నారు. మరోవైపు ఏపీ సర్కారు నిపుణులతో సంప్రదింపులు ముమ్మరం చేసింది. కేంద్ర పర్యావరణ నిపుణులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేస్తోంది. ఇలా.. ఏపీ ఓవైపు పట్టుదలతో ఉంటే.. తెలంగాణ మరోవైపు బెట్టుతో ముందుకు సాగుతోంది. ఇది తేలే సరికి.. మళ్లీ ఎన్నికలువచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు.