Begin typing your search above and press return to search.

అన్ని జిల్లాల్లో భూకబ్జాలు.. సంచలనంగా మారిన బాలినేని వ్యాఖ్యలు

విషయం ఏదైనా మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడే యాటిట్యూడ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సొంతమని చెప్పాలి

By:  Tupaki Desk   |   21 Nov 2023 5:05 AM GMT
అన్ని జిల్లాల్లో భూకబ్జాలు.. సంచలనంగా మారిన బాలినేని వ్యాఖ్యలు
X

విషయం ఏదైనా మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడే యాటిట్యూడ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సొంతమని చెప్పాలి. తాజాగా ఆయన భూ కబ్జాల మీద మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లోనూ భూవివాదాలు.. భూకబ్జాలు ఉన్నాయన్న ఆయన.. ఎక్కడా కూడా సిట్ ఏర్పాటు కాలేదని చెప్పారు. ఏ జిల్లాలోనూ ప్రజాప్రతినిధులు విచారణ కోరిన దాఖలాలు లేవని.. రాష్ట్రంలో తాను ఒక్కడినే స్పందించినట్లు చెప్పారు.

ఒంగోలులో భూఆక్రమణలు తన వరకు వచ్చినంతనే స్పందించి.. కలెక్టర్.. ఎస్పీలతో మాట్లాడి సిట్ వేయించినట్లుగా పేర్కొన్నారు. నిందితులు ఎవరైనా సరే వదలొద్దని చెప్పానని.. కఠినంగా శిక్షించాలని తాను కోరినట్లుగా చెప్పారు. తాను సిట్ వేయించిన తర్వాతే ప్రజల్లో ధైర్యం వచ్చి.. తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదులు చేయటం మొదలు పెట్టినట్లుగా చెప్పారు.

ఈ తరహా కేసుల్లో తాను ఎక్కడా జోక్యం చేసుకోనని స్పష్టం చేసిన బాలినేని మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఒంగోలులో భూస్కాంలో ప్రమేయం ఉన్న వారిలో సుమారు 200 మంది ఊరొదిలి పారిపోయినట్లు చెప్పారు. సిట్ దర్యాప్తు సజావుగా సాగుతోందని.. కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అరెస్టుల్లో కొంత జాప్యం జరుగుతుందన్న బాలినేని.. ప్రతి కేసులోని నిందితుల్ని పోలీసులు అరెస్టు చేసి తీరుతారని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో భూ దురాక్రమణలు చేయాలంటేనే భయపడేలా చర్యలు ఉంటాయన్న బాలినేని మాటలు బాగున్నా.. మిగిలిన జిల్లాల్లో ఈ స్థాయిలో జరగటం లేదన్న వైనం షాకింగ్ గా మారింది.

మొత్తంగా చూస్తే.. తాను తప్పించి మరెవరికి భూ దురాక్రమణలు పట్టట్లేదన్న మాట ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నట్లైంది. బాలినేని మాట్లాడే మాటలు తరచూ పార్టీకి.. ప్రభుత్వానికి అంతో ఇంతో ఇబ్బంది కలిగించేలా మారుతున్నాయన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకునేలా ఉన్నాయంటున్నారు. మరి.. దీనిపై రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.