Begin typing your search above and press return to search.

కూటమిలో ఎవరి యాత్ర వారిదే..'నందమూరి స్వర్ణాంధ్ర సాకారం'

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి పోటీ చేస్తున్న బాలయ్య.. తన యాత్రకు సొంతంగా పేరు పెట్టుకోవడం గమనార్హం.

By:  Tupaki Desk   |   16 April 2024 8:06 AM GMT
కూటమిలో ఎవరి యాత్ర వారిదే..నందమూరి స్వర్ణాంధ్ర సాకారం
X

రాజకీయాలన్నాక యాత్రలు సహజం.. అది పాదయాత్రలు.. బస్సు యాత్రలు.. ఆఖర్లో సమయం సరిపోకుంటే 'హెలికాప్టర్ యాత్రలు'. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రచార యాత్రలు మహా ఆసక్తికరంగా సాగుతుంటాయి. ప్రత్యర్థులపై మాటల తూటాలు.. విమర్శల బాణాలు.. ప్రసంగాల మధ్యమధ్యలో పంటికింది రాళ్లలా ''రాళ్ల దాడులు''. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఏపీలో ఎన్నికలకు మరో 27 రోజులే సమయం.. ఒక వైపు సంక్షేమాన్ని నమ్ముకున్న సీఎం జగన్ సారథ్యంలోని వైసీపీ.. మరోవైపు ఆయన పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి. రానున్న 25 రోజులు ప్రజలకు మహా రంజైన యుద్ధం చూసే అవకాశం ఉంటుంది.

కూటమిలో తలో యాత్ర ఏపీ ఎన్నికల్లో టీడీపీ –జనసేన- బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నప్పటికీ ఎవరి యాత్ర వారిదే అన్నట్లు సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన యాత్రకు 'ప్రజా గళం' అనే పేరు పెట్టారు. ఇదే పేరుతో టీడీపీ భారీ బహిరంగ సభలను సైతం నిర్వహించింది. ఇక కూటమిలోని మరో ప్రధాన పార్టీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ 'వారాహి విజయ భేరి' పేరిట ప్రజల్లోకి వెళ్తున్నారు. సీఎం జగన్ పై పదునైన విమర్శలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ తన యాత్రను కొనసాగించాల్సి ఉంది.

ఆయన దారి వేరు..టీడీపీ కీలక నాయకుడైన నందమూరి బాలక్రిష్ణ తన స్టయిలే వేరంటూ యాత్ర ప్రారంభించారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా గళం యాత్ర సాగిస్తుండగా ఆయన బావమరిది బాలక్రిష్ణ ఏమో 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర' అంటూ ప్రజల్లోకి వచ్చారు.

అయితే, బాలక్రిష్ణ ప్రస్తుతం రాయలసీమలోని అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి పోటీ చేస్తున్న బాలయ్య.. తన యాత్రకు సొంతంగా పేరు పెట్టుకోవడం గమనార్హం. వాస్తవానికి 'స్వర్ణాంధ్ర' అనేది ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉండగా ఇచ్చిన నినాదం. ఉమ్మడి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తామని ఆయన పదేపదే చెప్పేవారు. ఇప్పుడు బాబు యాత్రకు భిన్నంగా యాత్ర చేపడుతున్నా.. తన బావ పాత నినాదాన్ని మాత్రం టైటిల్ గా పెట్టుకున్నారు.