Begin typing your search above and press return to search.

జగన్‌ ప్రభుత్వంపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

బారికేడ్లు అడ్డుపెట్టి పోలీసులు వారిని అడ్డుకోవడంతో వారికి, నేతలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   5 Feb 2024 8:57 AM GMT
జగన్‌ ప్రభుత్వంపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు!
X

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాల తొలి రోజే హీటెక్కింది. రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. అసెంబ్లీకి వెళ్లే సభ్యులను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిదని ప్రశ్నించారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద ‘బైబై జగన్‌’ అంటూ ప్లకార్డులు పట్టుకొని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. బారికేడ్లు అడ్డుపెట్టి పోలీసులు వారిని అడ్డుకోవడంతో వారికి, నేతలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

జాబ్‌ క్యాలెండర్‌ విడుదల ఎప్పుడు? పోలవరం పూర్తి ఎక్కడా? మద్యపాన నిషేధం ఎక్కడా అని టీడీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పనైపోయిందన్నారు. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడటానికి ఏముందని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

తమను చూసి సీఎం జగన్‌ భయపడిపోతున్నారని బాలకృష్ణ ఎద్దేవా చేశారు. అందుకే అసెంబ్లీకి వచ్చే నేతలను అడ్డుకునే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. కాగా డీఎస్సీ విషయంలో 5 ఏళ్లుగా సీఎం తమని మోసం చేశారంటూ బాలకృష్ణకు నిరుద్యోగులు వినతిపత్రాలు అందజేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పక న్యాయం చేస్తామని వారికి ఆయన హామీ ఇచ్చారు. అనంతరం పోలీసులు పెట్టిన బారికేడ్లను తోసుకుంటూ కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు.

కాగా అంతకుముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీలా ఒక స్థానానికి ఉదయం ఒకరిని, రాత్రికి మరొకరిని మార్చే పార్టీలు తెలుగుదేశం, జనసేన కావన్నారు. చివరి అసెంబ్లీ సమావేశాల్లోనైనా జగన్‌ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు.

జగన్‌ ఒక అబద్ధాల కోరని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తేల్చిచెప్పారు. జగన్‌ ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నారని.. అందుకే సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. చివరకు పులివెందులలో సైతం గెలుపుపై జగన్‌ తన నమ్మకం కోల్పోయారని తెలిపారు. వ్యక్తిగతంగా కూడా జగన్‌ కు ఇవే చివరి సమావేశాలన్నారు.