బాలయ్య సింహ గర్జన.. వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్
సినిమాల్లో మాస్ డైలాగులతో సింహ గర్జన చేసే నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణ రాజకీయాల్లోనూ అదే జోరు చూపిస్తున్నారు
By: Tupaki Desk | 5 May 2025 6:43 PM ISTసినిమాల్లో మాస్ డైలాగులతో సింహ గర్జన చేసే నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణ రాజకీయాల్లోనూ అదే జోరు చూపిస్తున్నారు. తమ పార్టీ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్ అంటూ తీవ్ర హెచ్చరికలు చేస్తున్న బాలయ్య టీడీపీ కార్యకర్తల మనసు దోచుకుంటున్నారు. రెండు రోజులుగా తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్న బాలయ్య.. కార్యకర్తలను ఆదుకునే విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. రాయలసీమ అంటే తన అడ్డగా వ్యాఖ్యానించారు.
పద్మభూషణ్ సత్కారం అందుకున్న ఎమ్మెల్యే బాలక్రిష్ణను ఆయన సొంత నియోజకవర్గం హిందూపురంలో ఘనంగా సన్మానించారు. టీడీపీతోపాటు కూటమి నేతలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలయ్యతోపాటు ఆయన భార్య వసుంధర కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం పూర్తయిన అనంతరం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు బాలక్రిష్ణ. వరుస షూటింగులతో ఇన్నాళ్లు బిజీబిజీగా గడిపిన బాలయ్య ప్రత్యేకంగా నియోజకవర్గానికి సమయం కేటాయించడంపై కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇదే సమయంలో రాయలసీమ జిల్లాల్లో కూటమి పార్టీల కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారని బాలయ్య ఆరోపిస్తున్నారు. తమ కార్యకర్తల జోలికి వస్తే తాటతీస్తానంటూ మాస్ వార్నింగు ఇచ్చారు. రాయలసీమను తన అడ్డాగా ప్రకటించిన బాలయ్య.. ఇక్కడ వైసీపీ ఆగడాలను సాగనివ్వనని వ్యాఖ్యానించారు. దోచుకుని, దాచుకునేందుకు ప్రయత్నిస్తే తాటతీస్తానంటూ ఊర మాస్ డైలాగ్ చెప్పారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు.
తాను నియోజకవర్గంలో ఉండటం లేదని ప్రత్యర్థుల విమర్శలపైనా బాలయ్య విరుచుకుపడ్డారు. వారి మైండ్ పనిచేయడం లేదని వ్యాఖ్యానించారు. గత పది నెలల్లో రూ.50 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని? అవి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు.
