నో టికెట్స్ : జంపింగ్ జఫాంగులకు బాబు భారీ షాక్....!
దాంతో ఇతర పార్టీల నుంచి వచ్చి సైకిలెక్కేసి ఎంచక్కా వచ్చే ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్న వారి పక్కలో బాంబు పేలినట్లు అయింది.
By: Tupaki Desk | 20 Jan 2024 10:40 PM ISTవైసీపీ నుంచి వరసబెట్టి టీడీపీలోని నేతలు క్యూ కడుతున్నారు. అదే విధంగా టికెట్ కోసం వైసీపీలో నుంచి ఆశావహులు కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కానీ ఆసక్తిగా చూస్తున్నారు. అలాంటి వారికి గోదావరి జిల్లాల సభలో చంద్రబాబు గట్టి షాక్ ఇచ్చేశారు. అయారాం గయారాం లకు ఇక టికెట్లు లేవు అని ఆయన చెప్పేశారు.
దాంతో ఇతర పార్టీల నుంచి వచ్చి సైకిలెక్కేసి ఎంచక్కా వచ్చే ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్న వారి పక్కలో బాంబు పేలినట్లు అయింది. పార్టీలో జంపింగ్ జఫాంగులను పట్టించుకునే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. వారికి ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వమని తేల్చేశారు.
తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఈసారి అధికారంలోకి రావడం తధ్యమని బాబు జోస్యం చెప్పారు. అమలాపురం జిల్లాలోని ఏడు సీట్లను టీడీపీ గెలుచుకుంటని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు వంతున మొత్తం అయిదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలను ఇస్తామని హామీ ఇచ్చారు.
కోనసీమలో ఆక్వా రంగాన్ని ఆదుకుంటామని రాయితీ మీద విద్యుత్ ఇస్తామని చంద్రబాబు మరో హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం మీద చంద్రబాబు విమర్శలు గుప్పించారు. మరోసారి జగన్ సీఎం అయితే ఏపీ మొత్తం చీకటిమయం అవుతుందని అన్నారు.
జగన్ ఎన్నో హామీలు ఇచ్చారని, చివరికి ప్రజలకు మోసం చేశారని అన్నారు. పేరుకు జగన్ పది రూపాయలు ఇస్తున్నారని కానీ మరో వైపు వంద రూపాయలు వసూలు చేస్తున్నారు అని చంద్రబాబు మండిపడ్డారు. టిడ్కో ఇళ్ళను లబ్దిదారులకు ఇవ్వకుండా పేదలను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని బాబు ఫైర్ అయ్యారు.
పేదరికం లేని సమాజం కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని అందుకే తమ పార్టీని ఎన్నికోవాలని అన్నారు. వైసీపీని గద్దె దించాలని ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఇదిలా ఉంటే మండపేట సభలో బాబు మనసులో మాటను బయటపెట్టేశారు. పార్టీలు మారి వచ్చేవారికి నో టికెట్లు అని కుండబద్ధలు కొట్టేశారు. దీంతో చంద్రబాబు వైపు ఆశగా చూస్తూ టీడీపీలోకి రావాలని చూస్తున్న వారు ఏమి ఆలోచించుకుంటారో మరి. ఏది ఏమైనా జంపింగు జఫాంగులకు బాబు కామెంట్స్ మాత్రం షాకింగ్ గానే ఉన్నాయని అంటున్నారు.
