Begin typing your search above and press return to search.

బాబు నినాదమే నిజమవుతోంది...ఏపీలో మరీ క్షీణత !

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబుని అంతా విజనరీ అని ఎందుకు అంటారో మరో మారు రుజువు అయింది.

By:  Tupaki Desk   |   10 April 2025 8:23 AM IST
బాబు నినాదమే నిజమవుతోంది...ఏపీలో మరీ క్షీణత !
X

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబుని అంతా విజనరీ అని ఎందుకు అంటారో మరో మారు రుజువు అయింది. ఆయన దార్శనికత చాలా గొప్పది. అందరూ ఇవాళా రేపటి గురించిన ఆలోచనలు చేస్తే బాబు మాత్రం మరో పాతిక యాభై ఏళ్ళ ముందుకు వెళ్ళి ఆలోచిస్తారు. బాబు అలా మాట్లాడినప్పుడు చాలా మంది దానిని పెద్దగా పట్టించుకోక విమర్శలు చేసినా తర్వాత కాలంలో ఆయన చెప్పినదే నిజం అయింది అని అంగీకరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

బాబు ఇపుడు ఒక్కటే స్లోగన్ ని గట్టిగా వినిపిస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ వేదిక ఎక్కినా పదే పదే అదే మాట అంటున్నారు. ఏపీలో పిల్లలను కనండి అని ఆయన ఒక ఇంటికి పెద్దాయన మాదిరిగా చెబుతున్నారు. ఈ రోజున పిల్లలను కంటేనే రేపటికి రాష్ట్ర నిలిచేది అని చెబుతున్నారు. తాజాగా క్రిష్ణా జిల్లా పర్యటనలోనూ బాబు ఇదే చెప్పారు. పిల్లలను కనకపోతే ఈ ఊళ్ళన్నీ మరో పది ఇరవై ఏళ్ళకు ముసలాళ్ళతో నిండి ఉంటాయని కూడా ఆయన అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

నిజానికి బాబు అన్నది అక్షర సత్యమని నిరూపించే గణాంకాలు ఇపుడు ముందుకు వచ్చాయి. ఏపీలో జనాభా పెద్ద ఎత్తున క్షీణిస్తోందని ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ రోజున చూస్తే ఏపీలో ఒక్కో కుటుంబంలో సగటు సభ్యుల సంఖ్య 3.7 శాతానికి పడిపోయింది అని లెక్కలు వెల్లడిస్తున్నాయి.

ఇదే జాతీయ సగటు రేటుతో పోల్చి చూస్తే కనుక అక్కడ 4.3 శాతం ఉంది. అలాగే కర్ణాటక కూడా 4.3 శాతంగా ఉంది. తమిళనాడు, తెలంగాణా 4.1 శాతంగా ఉంటే, కేరళ 3.8గా ఉంది. ఇది నాబార్డు సంస్థ తాజాగా విడుదల చేసిన ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వేగా ఉంది. ఈ సర్వే నివేదికల ప్రకారం చూస్తే కనుక ఇప్పటికి అన్ని దక్షిణాది రాష్ట్రాలలో జనాభా పరంగా అతి తక్కువ శాతంగా ఉన్నది ఏపీ మాత్రమే అని అంటున్నారు.

అదే ఉత్తరాదిలో సగటున కుటుంబ సబ్యుల సంఖ్య అయిదు నుంచి ఎక్కువగానే ఉంది. ఉత్తరప్రదేశ్ లో చూస్తే 5 శాతం, బీహార్ లో 4.8 శాతం దాకా ఉంది. అంటే అక్కడ భార్య భర్తలకు కనీసంగా ముగ్గురు పిల్లలు ఉంటున్నారు అన్న మాట. అదే ఏపీలో చూస్తే ఒక్క సంతానం కూడా గగనంగా ఉందనే ఈ సర్వే సారాంశంగా ఉంది.

దీనిని గమనంలోకి తీసుకుని ఏపీలో జనాభా పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. జనాభాతోనే నిధులు వస్తాయి. రాజకీయంగా సీట్లు పెరిగి చట్ట సభలలో పలుకుబడి అధికారం వంటివి కూడా పెరుగుతాయి. మరి ఈ విషయం తెలిసే చంద్రబాబు పిల్లలను కనమని పోరుతున్నారు. ఏపీలో ఆయన మాట వింటే రేపటి రోజుకి అయినా జనాభా శాతం కనీసంగా 4 శాతానికి అయినా చేరుతుందని అంటున్నారు.