మారిన చంద్రన్న.. జెట్ స్పీడ్ నిర్ణయాలు.. తాజాగా రజనీకాంత్ ఉక్కిరిబిక్కిరి
కట్ చేస్తే.. చంద్రబాబు నోటి నుంచి మాట వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే.. సదరు ఆటో డ్రైవర్ రజనీకాంత్ ఇంటి ఎదురు కొత్త ఎలక్ట్రికల్ ఆటో వచ్చేసింది.
By: Tupaki Desk | 18 Aug 2024 1:23 PM ISTగతంలోనూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు. కానీ.. అప్పటి బాబుకు ఇప్పటి చంద్రబాబుకు చెప్పలేనంత తేడా ఉంది. ఆయన ప్రతి అడుగులోనూ ఇప్పుడు జెట్ స్పీడ్ కనిపిస్తోంది. ఎవరికేమైనా చేయాలంటే చాలు.. గంటల వ్యవధిలో పనులు పూర్తి అయ్యేలా వ్యవహరిస్తున్నారు. సామాన్యుడు మొదలుకొని అసమాన్యుడు వరకు అందరికి ఒకేలాంటి ప్రాధాన్యతను ఇస్తున్న ఆయన తీరు ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.
నిన్నటికి నిన్న అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఒక ఆటో డ్రైవర్ తో మాట్లాడారు. అతడి కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ ఆటోను కొనుక్కోవచ్చు కదా? అని అడిగితే.. అంత స్థోమత లేదన్నారు. ఇంజిన్ మారిస్తే సరిపోతుంది కదా? అంటూనే.. అలా సాధ్యమవుతుందా? అని కలెక్టర్ ను అడగటం.. ఆయన బదులివ్వకపోవటం తెలిసిందే.
ఈ సందర్భంగా అన్ని విషయాలపైనా అవగాహన పెంచుకోవాలన్న ఒక మాటను నవ్వుతూనే అన్న ఆయన.. ఆ తర్వాత సదరు ఆటో డ్రైవర్ కష్టసుఖాల్ని అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రికల్ ఆటో చేతికి వస్తే అతడి జీవితం సెట్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ క్రమంలో తాను ఎలక్ట్రికల్ ఆటోను ఇస్తానని మాట ఇచ్చారు. వలివర్తిపాడు గ్రామానికి చెందిన ఈ ఆటో డ్రైవర్ పేరు రజనీకాంత్.
కట్ చేస్తే.. చంద్రబాబు నోటి నుంచి మాట వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే.. సదరు ఆటో డ్రైవర్ రజనీకాంత్ ఇంటి ఎదురు కొత్త ఎలక్ట్రికల్ ఆటో వచ్చేసింది. మాట ఇచ్చిన సీఎం చంద్రబాబు అందుకు తగ్గట్లే మెరుపు వేగంతో స్పందించి.. సదరు ఆటో డ్రైవర్ సమస్యను కొలిక్కి తేవాలన్న ఆదేశాలు జారీ చేశారు. దాని ఫలితమే.. సదరు ఆటో డ్రైవర్ ఇంటి ముందు కొత్త ఆటో వచ్చేసింది. జెట్ స్పీడ్ తో నిర్ణయాలు తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. అంతే స్పీడ్ తో సదరు నిర్ణయాలు అమలు అయ్యేలా చేస్తున్న చంద్రబాబు తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి విపక్ష నేతగా గడిచిన ఐదేళ్లలో చోటు చేసుకున్న పరిణామాలు.. ఆయనలో ఇంతటి మార్పునకు కారణమన్న మాట వినిపిస్తోంది.
