Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: ఉద్యోగాల కోత‌కు ముగింపు ఎప్పుడు?

సాంకేతిక విప్ల‌వంలో వంద‌లాది ఉద్యోగుల‌ను ఇంటికి పంపించేసిన కంపెనీల్లో సిస్కో, యుపిఎస్, గూగుల్, స్నాప్, అమెజాన్ స‌హా వంద‌లాది సంస్థ‌లు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   26 Feb 2024 2:59 PM GMT
టాప్ స్టోరి: ఉద్యోగాల కోత‌కు ముగింపు ఎప్పుడు?
X

2023లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధికంగా చ‌ర్చించిన టాపిక్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్. దీనిని AI అని షార్ట్ ఫామ్‌లో పిలుస్తున్నారు. ఇది ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీగా ఉద్యోగాల కోత‌కు కార‌ణ‌మైంది. చాలా కార్పొరెట్ దిగ్గ‌జాలు త‌మ సంస్థ‌ల నుంచి ఉద్యోగుల‌ను త‌గ్గించుకునే వ్యూహాన్ని అనుస‌రించ‌డానికి కార‌ణం ఏఐ సాంకేతిక‌త‌తో వ‌చ్చిన ముప్పుగా అభివర్ణించారు.

సాంకేతిక విప్ల‌వంలో వంద‌లాది ఉద్యోగుల‌ను ఇంటికి పంపించేసిన కంపెనీల్లో సిస్కో, యుపిఎస్, గూగుల్, స్నాప్, అమెజాన్ స‌హా వంద‌లాది సంస్థ‌లు ఉన్నాయి. అయితే స‌డెన్ గా ఇలా ఉద్యోగాల కోత దేనికి? అంటే.. క‌రోనా క్రైసిస్ స‌మ‌యంలో అవ‌స‌రానికి మించి ఉద్యోగుల‌ను చేర్చుకోవ‌డం.. మార్కెట్లో మారిన ప‌రిస్థితులు కొనుగోలుదారుల్లో కొనుగోలు శ‌క్తి త‌గ్గిపోవ‌డం వంటి విభిన్న కార‌ణాలున్నాయ‌ని కొంద‌రు నిపుణులు విశ్లేషించారు. అలాగే పెరిగిన ఏఐ సాంకేతికతతో ఖ‌ర్చు త‌గ్గించుకోవాల‌నుకోవ‌డం ఉద్యోగాల కోత‌కు కార‌ణం. ఆదాయం త‌గ్గ‌డం, ఉత్ప‌త్తి అమ్మ‌కాల‌ ఖ‌రీదును త‌గ్గించే వ్యూహం కూడా ఉద్యోగాల కోత‌కు ఒక కార‌ణమ‌య్యాయ‌ని విశ్లేషించారు. అదే స‌మ‌యంలో ఏఐతో ప‌ని చేయ‌గ‌లిగే స్కిల్ ఉన్న ఉద్యోగుల‌కు ఇది పెద్ద వ‌రంగాను మారింది.

ఏఐ వ‌ల్ల ఉద్యోగాలు పోయినా ఇందులో కూడా పాజిటివ్ ట్రెండ్ ఉంది. కంపెనీలు ఏఐతో అప్ గ్రేడ్ అయిన ఉద్యోగుల‌ను ఎంపిక చేసుకోవ‌డం కొన‌సాగింది. ఒక పాపుల‌ర్ పార్సిల్ స‌ర్వీస్ కంపెనీ, త‌మ కంపెనీ లాభాల్లో ఉన్నా కానీ, ఖ‌ర్చును త‌గ్గించుకోవాల‌నుకుంది. పార్సిల్ ని త‌క్కువ రేటులోనే వినియోగ‌దారుడికి ఇవ్వాల‌నే ధృక్ప‌థంతో కూడా ఉద్యోగుల‌ను త‌గ్గించుకోవాల‌ని భావించింది. కంపెనీలు ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఇప్పుడు ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్నాయ‌ని ఒక‌రు విశ్లేసించారు. అలాగే ఈ ప‌రిస్థితి కొంత‌కాలం పాటు స‌ర్ధుబాటు దిశ‌గా కొన‌సాగుతోంద‌ని అర్థం చేసుకోవాలని విశ్లేషించారు నిపుణులు.

మ‌రోవైపు ఉద్యోగాల కోత‌ల‌ను ప‌రిశీలించాక బ్యాంకులు తీసుకున్న ఒక కొత్త నిర్ణ‌యం చాలా ప్ర‌యోజ‌న‌క‌రంగా మారింది. ఇండియా, అమెరికాలో వ‌డ్డీ రేట్లు పెంచ‌కుండా త‌గ్గించ‌డం అనేది ప్ర‌ధానంగా క‌లిసొచ్చేదిగా మారింది. దేశంలోని కొనుగోలు దారుల కొనుగోళ్లు పెంచేందుకు బ్యాంకులు మంచి నిర్ణ‌యం తీసుకుంటున్నాయి. హోమ్ లోన్స్ లేదా ఇత‌ర లోన్ల‌ను సులువుగా ఇవ్వాల‌ని నిర్ణ‌యించాయి. ఇది కంపెనీల‌కు బూస్ట్ ఇస్తుంది.

ఉద్యోగాల కోత‌కు ఎండ్ ప‌లికేదెప్పుడు? అంటే.. ఏఐ టెక్నాల‌జీని వేగంగా నేర్చుకోవ‌డం దీనికి చాలా వ‌ర‌కూ సొల్యూష‌న్.. ఉద్యోగుల్లో ఎఫిషియెన్సీ ప్రొడ‌క్టివిటీని పెంచుతుంది. ఏఐ టూల్స్ నేర్చుకోవ‌డం దీనికి ప‌రిష్కారం. కంపెనీలు ఏఐ నేర్చుకునే వారికి ప్రాధాన్య‌త‌నిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. 2023తో పోలిస్తే 2024లో ఉద్యోగాల తొల‌గింపు శాతం త‌గ్గుతుంద‌ని గూగుల్ సీఈవో అన‌డం కొంత ఊర‌ట‌.

ఇండియాకు ఆ ర‌కంగా ప్ల‌స్:

కంపెనీలు ఉద్యోగుల‌ను తొల‌గించుకోవ‌డం ఒక మార్గం అనుకుంటే, త‌క్కువ ఖ‌ర్చుతో ఉద్యోగులు ఎక్క‌డ ల‌భిస్తారు? అని వెత‌క‌డం మ‌రో ఎత్తుగ‌డ‌. పెద్ద జీతాలు అందుకునే వారి జాబితాను రెడీ చేయాల‌ని మేనేజ‌ర్లు, టీమ్ లీడ్ ల‌పై బాస్ ల నుంచి ఒత్తిడి ఉంటుంది. టీమ్ లీడ్ ఉద్యోగుల పేర్లతో జాబితాను రాస్తారు. ముందుగా రిమోట్ వ‌ర్క‌ర్స్ ని తొల‌గించ‌డం.. లేదా వ‌ర్క‌ర్ల ప‌ని దినాల‌ను త‌గ్గించి, ఖ‌ర్చును త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం కొన్ని సంస్థ‌లు చేస్తున్నాయి. అమెరికాలో వ‌ర్క్ ఫ్రం హోమ్ చేసేవాళ్ల కంటే భార‌త్ వంటి నైపుణ్యం ఉన్న దేశాల నుంచి ఔట్ సోర్సింగ్ ద్వారా ఖ‌ర్చు త‌గ్గించుకోవాల‌ని చూసే కంపెనీలు ఉన్నాయి. ఇది ఒక ర‌కంగా భార‌తీయ నిరుద్యోగుల‌కు క‌లిసొచ్చే అంశ‌మ‌ని కూడా విశ్లేషించారు. నిజానికి క‌రోనా క్రైసిస్ తొల‌గిపోయిన‌ త‌ర్వాత ఉద్యోగాల కోత ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మారుతున్న‌ సాంకేతిక‌త‌తో ముప్పు పొంచి ఉంద‌ని, స్కిల్ ని మెరుగు ప‌రుచుకోవ‌డం అప్ గ్రేడ్ అవ్వ‌డం చాలా ముఖ్య‌మ‌ని ఈ ఉత్ప‌న్నం నేర్పించింది. మ‌నుషుల‌పై AI - మెషీన్ల‌ దాడిని జాగ్ర‌త్త‌గా అర్థం చేసుకోవాల్సిన త‌రుణ‌మిది.. దాడికి ప్ర‌తిదాడి కేవ‌లం నైపుణ్యం పెంచుకోవ‌డం మాత్ర‌మే. నిరుద్యోగులూ.. కెరీర్ విష‌యంలో త‌స్మాత్ జాగ్ర‌త్త‌!