Begin typing your search above and press return to search.

అచ్చెన్నకి బాబుని కలిసే భాగ్యం !

ఆయన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఉత్తరాంధ్రాలో రాజకీయంగా పలుకుబడి కలిగిన కుటుంబానికి చెందిన వారు

By:  Tupaki Desk   |   25 Sep 2023 10:49 AM GMT
అచ్చెన్నకి  బాబుని కలిసే భాగ్యం  !
X

ఆయన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఉత్తరాంధ్రాలో రాజకీయంగా పలుకుబడి కలిగిన కుటుంబానికి చెందిన వారు. చంద్రబాబు తరువాత పార్టీలో అంతటి వారు. అలాంటి అచ్చెన్నాయుడుకు బాబు దర్శన భాగ్యం కలగడంలేదు. ఎందుకంటే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం లో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రీ కారాగారంలో ఉంటున్నారు.

బాబు రిమాండ్ కూడా పదిహేను రోజులు పూర్తి అయిపోయింది. మరో విడత పొడిగించారు. ఇక బాబు రిమాండ్ లో ఉన్నపుడు ఆయనతో ములాఖత్ అయ్యేందుకు బాబు సొంత కుటుంబీకులు తప్ప బయట వారిని తీసుకుంటే యనమల రామక్రిష్ణుడుకు పవన్ కళ్యాణ్ కి మాత్రమే దక్కింది.

యనమల టీడీపీలో సీనియర్ నేత కాబట్టి కలిశారు అనుకున్నా బయట పార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ బాబు తో ములాఖత్ అయి బయటకు వచ్చి పొత్తు ప్రకటన చేశారు. అది కూడా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు లేని వేళ ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడే కీలకం అవుతారు. కానీ అచ్చెన్న లేకుండా లోకేష్ బాలయ్య సమక్షంలో జనసేన టీడీపీల మధ్య పొత్తుని పవన్ ప్రకటించారు.

జైలు బయట పొత్తు ప్రకటన చేయడమే విడ్డూరం అనుకుంటే ఏపీ ప్రెసిడెంట్ లేకుండా ప్రకటన చేయడం మరో విడ్డూరం. దీని తరువాత జరిగిన పరిణామాలు కూడా అచ్చెన్నను హర్ట్ అయ్యేలా చేశాయని అంటున్నారు. ఏపీ ప్రెసిడెంట్ గా తాను ఉండగా యనమలను పిలిపించుకుని బాబు చర్చించడం ఏంటని కూడా అచ్చేన్న వర్గం కలత చెందుతోంది.

ఈ నేపధ్యంలో నుంచి చూసుకుంటే అచ్చెన్న ఆవేదనకు ఎట్టకేలకు తగిన సమాధానం వచ్చినట్లుంది. సోమవారం సాయంత్రం చంద్రబాబుతో ములాఖత్ అయ్యే చాన్స్ ఆయనకు దక్కుతోంది. బాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణితో పాటుగా అచ్చెన్నాయుడు కూడా చంద్రబాబుని కలవనున్నారు.

ఇప్పటికే టీడీపీ ఆద్వర్యంలో పొలిటికల్ యాక్షన్ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. అందులో అచ్చెన్న, యనమల సహా సీనియర్లు అంతా ఉన్నారు. ఈ కమిటీ యాక్షన్ ఏంటో, అలాగే టీడీపీ వ్యూహం ఏంటో కూడా చంద్రబాబు అచ్చెన్నకు దిశా నిర్దేశం చేయనున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే బాబు అచ్చెన్నకు ఈ ములాఖత్ ద్వారా సరైన డైరెక్షన్ ఇస్తారని అంటున్నారు. దాంతో రానున్న రోజుల్లో ఏపీలో టీడీపీని పరుగులు పెట్టించే బాధ్యత అచ్చేన్నదే అవుతుంది అంటున్నారు.

మరో వైపు బాబుకు ఇప్పట్లో బెయిల్ రాదు అని ఫిక్స్ అయ్యే పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు అని కూడా అంటున్నారు. బాబు మరిన్నాళ్ళు జైలులో ఉన్నా కూడా దానికి తగిన విధంగా పార్టీని తీర్చిదిద్ది జనంలో ఉంచేలా బాబు మార్క్ వ్యూహాలను అచ్చెన్న ద్వారా అమలు చేయిస్తారు అంటున్నారు.