Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదా : హామీ ఇచ్చే పార్టీ ఉందా...!?

ప్రత్యేక హోదా ఈ హమీని ఇపుడు ప్రధాన రాజకీయ పార్టీలలో ఏ ఒక్కటైనా టచ్ చేసే సీన్ ఉందా అన్నది చర్చగా సాగుతోంది.

By:  Tupaki Desk   |   14 Feb 2024 5:15 AM GMT
ప్రత్యేక హోదా :  హామీ ఇచ్చే పార్టీ ఉందా...!?
X

ప్రత్యేక హోదా ఈ హమీని ఇపుడు ప్రధాన రాజకీయ పార్టీలలో ఏ ఒక్కటైనా టచ్ చేసే సీన్ ఉందా అన్నది చర్చగా సాగుతోంది. 2014లో టీడీపీ బీజేపీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ హామీని పెట్టి ఊరూరా తిరిగాయి. జనం మద్దతు కూడగట్టి అధికారంలోకి వచ్చాయి.


కానీ ఆ తరువాత దానిని ముగిసిన అధ్యాయం అని బీజేపీ అంటే హోదా సంజీవినా అని టీడీపీ అధినాయకత్వం ప్రశ్నించింది. ప్రత్యేక ప్యాకేజీ చాలు అని కూడా చెప్పుకొచ్చింది. నాడు విపక్షంలో ఉన్న వైసీపీ సహా ఇతర పక్షాలు ఉద్యమించడంతో టీడీపీ యూ టర్న్ తీసుకుంది. 2019లో వైసీపీ అజెండాలో ప్రత్యేక హోదా హామీ కీలకంగా ఉంది. టీడీపీ కూడా అదే హామీని ముందు పెట్టి జనం లోకి వెళ్ళింది.

జనాలు వైసీపీని ఆదరించారు. ప్రత్యేక హోదా కోసం పాతిక మంది ఎంపీలను ఇమ్మని జగన్ కోరితే 22 మందిని ఇచ్చి జనాలు పూర్తి మద్దతుగా నిలిచారు. కానీ గడచిన అయిదేళ్ల కాలంలో ప్రత్యేక హోదా ఊసే లేదు. అటు అధికార వైసీపీ ఇటు విపక్ష టీడీపీ కూడా దాన్ని మరచిపోయాయనే విమర్శలు ఉన్నాయి.

ఇపుడు మళ్లీ ప్రత్యేక హోదా అంటూ కాంగ్రెస్ కొత్త ప్రెసిడెంట్ షర్మిల జనంలోకి వస్తున్నారు. దాంతో పాటు ప్రత్యేక హోదా సాధన సమితి పేరిట చలసాని శ్రీనివాస్, అలాగే జై భారత్ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ జేడీ లక్ష్మీ నారాయణ ప్రత్యేక హోదా నినాదాన్ని వినిపిస్తున్నారు.

ప్రజా ఉద్యమంగా మారితేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని వారు అంటున్నారు. అంతేకాదు అన్ని రాజకీయ పార్టీలు దీని మీద పోరాడాలని కోరుతున్నారు. అయితే ఎన్నికల హామీలలో అనేకం తెచ్చి జనం ముంచు పెడుతున్న వైసీపీ కానీ టీడీపీ జనసేనలు కానీ ప్రత్యేక హోదా విషయంలో నోరు విప్పడంలేదు. వైసీపీ అయితే కేంద్రంలో బలహీన కూటమి రావాలని అంటోంది. అది జరిగితేనే తప్ప హోదా రాదు అని అంటోంది.

ఇక బీజేపీతో పొత్తుకు ఆసక్తితో ఉన్న టీడీపీ జనసేన పార్టీలు ప్రత్యేక హోదా అన్న మాటనే అనవన్నది అందరూ చెబుతున్న విషయం. మొత్తానికి విభజన ఏపీలో ముచ్చటగా మూడవసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యేక హోదా అన్న అతి కీలకమైన హామీ మాత్రం ప్రధాన పార్టీల అజెండాలో లేకపోవడమే 2024 ఎన్నికల అసలైన ప్రత్యేకత అంటున్నారు.

ఇక ఈ హామీ పట్ల జనంలో కూడా నిర్వేదం నైరాశ్యం ఉండడంతో ఈసారి అది వర్కౌట్ కాదని ఓట్ల వర్షం కురిపించదని కూడా భావించి కూడా దీనిని ఎత్తుకునేందుకు కూడా ఎవరూ ఆసక్తిని చూపించడంలేదు అని అంటున్నారు.