Begin typing your search above and press return to search.

కొత్త చర్చ: బాబు సీటు మారుస్తారా.. కోటంరెడ్డి పార్టీ మారుస్తారా?

గత రెండు, మూడు రోజులుగా టీడీపీలో ఏమి జరుగుతుంది.. టీడీపీ - జనసేన పొత్తులో ఏమి జరగబోతుంది అనే చర్చ విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   28 Jan 2024 7:06 AM GMT
కొత్త చర్చ: బాబు సీటు మారుస్తారా.. కోటంరెడ్డి పార్టీ మారుస్తారా?
X

గత రెండు, మూడు రోజులుగా టీడీపీలో ఏమి జరుగుతుంది.. టీడీపీ - జనసేన పొత్తులో ఏమి జరగబోతుంది అనే చర్చ విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా సీట్ల సర్దుబాటులో భాగంగా రెండు పార్టీల మధ్య పెద్ద చిచ్చే రగిలేలా ఉందనే కామెంట్లు మొదలైపోయాయి. జరుగుతున్న పరిణామాలు కూడా ఆ కామెంట్లకు బలం చేకూరుస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వారి పరిస్థితి కూడా దయణీయంగా మారిందనే సంకేతాలు వినిపిస్తున్నాయి.

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ దఫా నేరుగా కలిసే పోటీ చేయబోతున్న టీడీపీ - జనసేనల మధ్య సీట్ల సర్ధుబాటు వ్యవహారం హాట్ టాపిక్ గా మరుతున్న సంగతి తెలిసిందే. పొత్తుతో సంబంధం లేకుండా చంద్రబాబు మండపేట, అరకు నియోజకవర్గాలు ప్రకటించడం.. దీంతో ఏమి తమకు లేవా సీట్లు, అభ్యర్థులూ అన్నట్లుగా జనసేన అధినేత పవన్ కూడా రాజోలూ, రాజానగరం జనసేనవే అంటూ ప్రకటించుకున్నారు.

ఇది చాలదన్నట్లు... చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటుందని, న్యూటన గమన నియామలను ప్రస్థావిస్తూ ఆజ్యం పోశారు నాగబాబు! ఈ సమయంలో ఎంటరైన హరిరామ జోగయ్య... రెండే కాదు వెస్ట్ గోదావరిలో మరికొన్ని సీట్లు ప్రకటించి ఉండాల్సిందని రెచ్చగొట్టినంత పనిచేశారు! దీంతో.. ఈ యవ్వారం చెడేలా ఉందనే చర్చ మొదలైంది. దానికి బలం చేకూర్చే ఘటన మరొకటి తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... వైసీపీ బహిస్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ టిక్కెట్ ఉండదని.. అది కూడా జనసేన కోరుతుందని.. అక్కడ అభ్యర్థులను రెడీ అయిపోమని పవన్ చెప్పారని అంటున్నారు. దీంతో... కోటంరెడ్డి పరిస్థితి ఏమిటి అనే చర్చ మొదలైంది. మూడో వంతు సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్... ఆ 50 - 60 సీట్లలో నెల్లూరు రూరల్ ని కూడా చేర్చారని చెబుతున్నారు. దీంతో... వాట్ నెక్స్ట్ కోటంరెడ్డి? అనే ప్రశ్నలు దర్శనమిస్తున్నాయి!

వాస్తవానికి నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ఇంతకాలం పార్టీకి అండగా ఉన్న అబ్దుల్‌ అజీజ్‌ ను కాదని కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు బాబు. దీంతో... మైనార్టీలకు కాదని వలస వాదులకు పెద్దపీట వేశారంటూ కేడర్ లో అసంతృప్తి తెరపైకి వచ్చింది. అయినప్పటినీ నెట్టుకొస్తున్న కోటంరెడ్డికి తాజాగా షాక్ తగిలిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆ సీటు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది.

2014, 2019 ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ పై నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా రెండుసార్లు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన సైకిల్ ఎక్కారు. నెల్లూరు రూరల్ నుంచే పోటీకి దిగుతున్నట్లు కథనాలొచ్చాయి! అయితే తాజాగా ఈ సీటు జనసేన ఖాతాలోకి అని తెలుస్తుంది. దీంతో... బాబు సీటు మారుస్తారా.. లేక, కోటంరెడ్డి పార్టీ మారుస్తారా అనేది ఆసక్తిగా మారింది!!