Begin typing your search above and press return to search.

అస్సాంలో కమలం హ్యాట్రిక్ సక్సెస్ ఖాయమేనా ?

అస్సాం రాష్ట్రం జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉంది. ఈశాన్య రాష్ట్రంగా ఉన్న అస్సాం ఒకప్పుడు కాంగ్రెస్ కి కంచుకోటగా ఉండేది.

By:  Tupaki Desk   |   17 March 2026 1:00 AM IST
అస్సాంలో కమలం హ్యాట్రిక్ సక్సెస్ ఖాయమేనా ?
X

అస్సాం రాష్ట్రం జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉంది. ఈశాన్య రాష్ట్రంగా ఉన్న అస్సాం ఒకప్పుడు కాంగ్రెస్ కి కంచుకోటగా ఉండేది. అయితే 1985లో వచ్చిన విద్యార్థులు ఉద్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ఓటమి పాలు అయింది. అస్సాం గణపరిషత్ ఆ ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే యువకులే అంతా ప్రభుతాన్ని నడపడంతో అనుభవ లేమి మూలంగా తిరిగి కాంగ్రెస్ పుంజుకుంది. అయితే కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయానికి ఆ విధంగా బీజం పడింది. తరువాత కాలంలో బీజేపీ మెల్లగా అస్సాంలో దానిని కొనసాగించింది. ప్రతిపక్షంగా బీజేపీ గొంతు పెంచుతూ 2016 నాటికి ఏకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది.

కలసి వచ్చిన రాజకీయం :

అస్సాంలో తరుణ్ గొగోయ్ బలమైన నాయకుడిగా ఉంటూ సీఎం గా పనిచేశారు. అయితే ఆయనకు కుడి భుజంగా ఒకనాడు ఉన్న హిమంత బిశ్వ శర్మ బీజేపీలో చేరడంతో కమలం దశ తిరిగింది. కేవలం అస్సాంలో మాత్రమే కాదు ఈశాన్య రాష్ట్రాలలో కాషాయ జెండా రెపరెపలాడడానికి కారణం హిమంత్ బిశ్వశర్మ అని చెప్పాల్సి ఉంది. ఆయనకు 2021 ఎన్నికల్లో సీఎం గా బీజేపీ చాన్స్ ఇచ్చింది. అయిదేళ్ల పాటు ఆయన పాలించారు. ఇపుడు ఎన్నికలను ఆయన నాయకత్వంలో బీజేపీ ఎదుర్కోబోతోంది.

బీజేపీ పటిష్టంగా :

ఇక అస్సాం వంటి రాష్ట్రంలో బీజేపీ తొలిసారి అడుగు మోపాక సంస్థాగతంగా మరింత గట్టిగా పటిష్టం చేసుకుంది. గ్రాస్ రూట్ లెవెల్ దాకా బీజేపీ పాతుకుని పోయింది. అదే మరోసారి గెలవడానికి కారణం అయింది ఇక గత పదేళ్లలో బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలు అనేకం చేస్తూ వచ్చింది అలాగే సంక్షేమ పధకాలను కూడా అమలు చేస్తోంది. ఇక ప్రత్యేకించి శాంతి ఒప్పందాలు ప్రజలలో చర్చకు కారణం అవుతున్నాయి. దీంతో డబుల్ ఇంజన్ సర్కార్ ప్రగతి సమర్ధ నాయకత్వం అంటూ బీజేపీ ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది అస్సాం కి గత పదేళ్ళలో చేసిన మేలుని బీజేపీ జనాలకు వివరించే ప్రయత్నం చేస్తోంది.

కసి మీద ఉన్న కాంగ్రెస్ :

ఇక చూస్తే వరసగా పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ లో కసి పెరుగుతోంది. గౌరవ్ గోగోయ్ నాయకత్వంలో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాన్ని ఢీ కొడుతోంది. బీజేపీ పదేళ్ల పాటు అధికారంలో ఉండడంతో జనంలో సహజంగా ఏర్పడుతున్న ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. గౌరవ్ గోగోయ్ దూకుడుతో కూడిన రాజకీయాన్ని చేస్తూ వస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఎంత మంది లీడర్లు బయటకు వెళ్ళినా ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో బలం ఇంకా అలాగే ఉంది దాంతో బీజేపీని ఈసారి ఓడించి తీరుతామని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్ ప్రతిన పూనుతున్నారు ముఖ్యమంగా మైనారిటీ ఓటర్ల మీద కాంగ్రెస్ ఎన్నో ఆశలను పెట్టుకుంది. ఇదిలా ఉంటే గౌరవ్ గోగోయ్ భార్య ఎలిజబెత్ కోల్ బర్న్ కి పాకిస్థాన్ తో సంబంధాలు ఉన్నాయని సీఎం హిమంత బిశ్వ శర్మ చేస్తున్న ఆరోపణలు అయితే కాంగ్రెస్ కి కొంత ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని అంటున్నారు.

ఇవీ బలాబలాలు :

అస్సాంలో ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 126 అసెంబ్లీ సీట్లకు జరిగే ఈ ఎన్నికల్లో బీజేపీ ఒక కూటమిగా వస్తోంది. బీజేపీ కూటమిలో అస్సాం గణ పరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్, బోడో ల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ భాగస్వాములుగా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమిలో సీపీఎం, అస్సాం జాతీయ పరిషత్, ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ ఉన్నాయి. ఇక గత ఎన్నికల్లో 16 సీట్లను గెలుచుకున్న ఏఐయూడీఎఫ్ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. దాంతో ఈ పార్టీ ఎవరి ఓట్లకు చీలిక పెడుతుందో తెలియడం లేదు. ఇక హ్యాట్రిక్ సక్సెస్ కొట్టాలని బీజేపీ చూస్తూంటే పదేళ్ళ తరువాత అధికారం అందుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది మరి అస్సాం ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాల్సిందే.