Begin typing your search above and press return to search.

'మోడీ గారూ.. కేజ్రీవాల్ జ‌నార్ద‌నుడు.. విష్ణుమూర్తి.. ప‌రోప‌కారి!'

''మోడీ గారూ.. కేజ్రీవాల్ మీరు అనుకుంటున్న‌ట్టుగా దొంగ కాదు. ఆయ‌న జనార్ద‌నుడు. విష్ణుమూర్తి, ప‌రోప‌కారి

By:  Tupaki Desk   |   23 March 2024 4:09 AM GMT
మోడీ గారూ.. కేజ్రీవాల్ జ‌నార్ద‌నుడు.. విష్ణుమూర్తి.. ప‌రోప‌కారి!
X

''మోడీ గారూ.. కేజ్రీవాల్ మీరు అనుకుంటున్న‌ట్టుగా దొంగ కాదు. ఆయ‌న జనార్ద‌నుడు. విష్ణుమూర్తి, ప‌రోప‌కారి. ఆయ‌న‌కు ద్రోహం త‌ల‌పెట్టిన వారు ఎవ‌రూ ప్ర‌జాభిమానం సొంత చేసుకోలేక పోయారు'' అని కేజ్రీవాల్ స‌తీమ‌ణి సునీత వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అన్ని వ‌ర్గాల నుంచి ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. పార్టీల‌కు అతీతంగా కొంద‌రు మేధావులు కూడా కేజ్రీవాల్‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. ఇప్ప‌టికే ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కులు ఢిల్లీలో నిర‌స‌న కూడా చేప‌ట్టారు. తాజాగా కేజ్రీవాల్ స‌తీమ‌ణి సునీతా కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు.

ఆమె ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ గారూ... మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తిని మీరు అధికార అహంకారంతో అరెస్ట్ చేశారు అని మండిపడ్డారు. ''ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రతి ఒక్కరినీ అణచివేయాలని చూస్తున్నారు. సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం ద్వారా ఢిల్లీ ప్రజలకు ద్రోహం తలపెట్టారు. ఢిల్లీ ప్రజలారా... మీ ముఖ్యమంత్రి ఎప్పుడూ మీ పక్షానే ఉంటారు. ఆయన బయట ఉన్నా, జైల్లో ఉన్నా ఆయన జీవితం ఎప్పుడూ దేశానికే అంకితం. ఆయన జనార్దనుడు(విష్ణువు, పరోపకారి) అని ప్రజలందరికీ తెలుసు" అని అని స్పష్టం చేశారు.

మ‌మ‌త హాట్ కామెంట్స్‌

కేజ్రీవాల్ అరెస్టుపై ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కూడా తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. ఈడీ ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డాన్ని మ‌మ‌త దుయ్య‌బ‌ట్టారు. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ అరెస్ట్ ప్రజాస్వామ్యంపై దాడి అని మండిపడ్డారు. ''ప్రతిపక్షంలో ఉన్న, బీజేపీకి అనుకూలంగా లేని.. వారిని విమ‌ర్శిస్తున్న‌ ముఖ్యమంత్రులను ఉద్దేశ్యపూర్వకంగా లక్ష్యంగా చేసుకొని అరెస్ట్ చేస్తున్నారు. ఇది చాలా దారుణం. అదే సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సీబీఐ లేదా ఈడీ దర్యాఫ్తు చేస్తున్న నాయకులు ఎవరైనా బీజేపీలో ఉంటే మాత్రం వారికి శిక్షపడడం లేదు. క‌నీసం విచార‌ణ కూడా సాగ‌డం లేదు. ముఖ్యంగా ఇతర పార్టీలో ఉన్నప్పుడు దర్యాఫ్తు సంస్థలు వెంటబడతాయి. బీజేపీలో చేరిన తర్వాత ఎలాంటి శిక్ష ఉండదు. ఇలాంటి వైఖరిని ప్రజాస్వామ్యంపై తీవ్రమైన దాడిగానే భావిస్తున్నాం'' అని మ‌మ‌త వ్యాఖ్యానించారు.