Begin typing your search above and press return to search.

క్రియేటివ్ కంటెంట్ రైటర్లకు ఏఐ ముప్పు.. సౌకర్యం పేరుతో సృజనాత్మకత కోల్పోతున్నారా?

కానీ నేడు డిజిటల్ యుగంలో 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (ఏఐ) అనే ఒక మాయాజాలం కంటెంట్ రైటింగ్ రంగాన్ని కబళిస్తోంది.

By:  A.N.Kumar   |   17 April 2026 1:05 PM IST
క్రియేటివ్ కంటెంట్ రైటర్లకు ఏఐ ముప్పు.. సౌకర్యం పేరుతో సృజనాత్మకత కోల్పోతున్నారా?
X

నేడు అక్షరం ఒక యంత్రం చేతిలో బందీ అవుతోంది. భావం ఒక అల్గారిథమ్ లెక్కల్లో చిక్కుకుపోతోంది. ఒకప్పుడు కలం పడితే కాగితం మీద ఆలోచనలు నాట్యం చేసేవి. ప్రతి వాక్యంలో ఒక వ్యక్తిత్వం.. ప్రతి పదంలో ఒక అనుభూతి కనిపించేవి. కానీ నేడు డిజిటల్ యుగంలో 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (ఏఐ) అనే ఒక మాయాజాలం కంటెంట్ రైటింగ్ రంగాన్ని కబళిస్తోంది. సౌకర్యం అనే ముసుగులో సృజనాత్మకతను నిలువునా గొంతు నులుముతోంది.

అంకెల్లో విషాదం.. ఆవిరవుతున్న ఉద్యోగాలు

తెలుగు మీడియా రంగం గత కొన్ని నెలలుగా ఒక నిశ్శబ్ద యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. కేవలం అంచనాల ప్రకారమే.. తెలుగు మీడియా రంగంలో వెబ్ సైట్లు, పత్రికలు, న్యూస్ పోర్టల్స్, న్యూస్ చానెల్స్ లో సుమారు 150 మందికి పైగా నైపుణ్యం కలిగిన రైటర్లు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు.. 150 కుటుంబాల జీవనాధారం. వేగంగా కంటెంట్ కావాలి.. తక్కువ ఖర్చుతో పని జరగాలి అనే కార్పొరేట్ ధోరణికి ఏఐ ఒక అస్త్రంగా దొరికింది. పది మంది చేసే పనిని ఒక సాఫ్ట్‌వేర్ క్షణాల్లో పూర్తి చేస్తుంటే.. యజమాన్యాలకు మానవ రచయితల 'భావోద్వేగాలు'.. 'సృజనాత్మకత' అనవసరమైన భారంగా కనిపిస్తున్నాయి.

సోమరితనపు సంకెళ్లు.. ఆలోచనా శక్తికి గ్రహణం

ఏఐ ఇస్తున్న అతిపెద్ద ముప్పు ఉద్యోగాల కోత మాత్రమే కాదు.. అంతకు మించి రచయితల స్వతంత్ర ఆలోచనా శక్తి క్షీణించడం. ఒకప్పుడు ఒక కథనం రాయాలంటే గంటల తరబడి మేధోమథనం చేసేవారు. ఇప్పుడు కేవలం ఒక 'ప్రాంప్ట్' ఇస్తే చాలు.. నిమిషాల్లో పేజీల కొద్దీ మేటర్ వచ్చేస్తోంది. దీనికి అలవాటు పడిన మెదడు క్రమంగా తన పదును కోల్పోతోంది. ఏఐ రాసే భాషలో వ్యాకరణం ఉండొచ్చు కానీ.. 'ఆత్మ' ఉండదు. చదువుతుంటే అది ఒక మనిషి రాసినట్టు కాకుండా ఒక యంత్రం పేర్చిన ఇటుకల్లా కనిపిస్తోంది. ఒక రచయితకు ఒక శైలి ఉంటుంది. కానీ ఏఐ అవుట్‌పుట్‌లో అందరిదీ ఒకే గొంతు.. ఒకే ధోరణి.

గుర్తిస్తున్న సంస్థలు.. కఠినమవుతున్న నిబంధనలు

కంటెంట్ క్రియేటర్లు తాము ఏఐ వాడుతున్న విషయం ఎవరికీ తెలియదు అనుకుంటే అది భ్రమ మాత్రమే. సంస్థలు ఇప్పుడు ఏఐ కంటెంట్‌ను పసిగట్టే టెక్నాలజీని వాడుతున్నాయి. భావ పునరావృతం, భావోద్వేగం లేని వాక్య నిర్మాణం, వ్యక్తిగత విశ్లేషణ లోపించడం వంటి అంశాలు రైటర్ల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నాయి. "ఒక్కసారి ఏఐకి బానిస అయితే.. ఆ రచయిత మళ్ళీ తిరిగి తన సొంత శైలిని తట్టి లేపలేడు" అన్న చేదు నిజం ఇప్పుడు మీడియా రంగంలోని పెద్దలను కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తోంది.

ఏఐ.. సేవకుడిగా ఉండాలి కానీ యజమానిగా కాదు..

ఏఐ అనేది ఒక అద్భుతమైన పరిశోధనా సాధనం. డేటా సేకరించడానికి.. కొత్త ఐడియాల కోసం.. వ్యాకరణ దోషాలను సరిదిద్దుకోవడానికి దీన్ని వాడటం తప్పు లేదు. కానీ ఆ కంటెంట్‌లో ప్రాణం పోయాల్సింది మాత్రం రచయిత మాత్రమే.

ఏఐ సమాచారాన్ని ఇస్తుంది.. కానీ దానికి భావోద్వేగాన్ని మనిషి మాత్రమే ఇవ్వగలడు. గూగుల్‌లో దొరకని నిజాలను.. క్షేత్రస్థాయి పరిశీలనలను మీ రచనల్లో చేర్చండి. మీ అక్షరం చూస్తే ఇది ఫలానా వ్యక్తి రాశారు అని పాఠకుడు గుర్తించేలా మీ సంతకాన్ని నిలబెట్టుకోండి.

అక్షరమే ఆయుధం కావాలి

సాంకేతికత ఎంత పెరిగినా మనిషి హృదయానికి ఉండే స్పందన యంత్రానికి ఉండదు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే కంటెంట్ రైటర్లు తమను తాము అప్‌డేట్ చేసుకోవాలి. ఏఐని ఒక ప్రత్యర్థిగా చూసి భయపడటం మానేసి.. దాన్ని ఒక సహాయకుడిగా మార్చుకోవాలి. యంత్రం కన్నా వేగంగా కాకపోయినా.. యంత్రం కన్నా ప్రభావవంతంగా రాయగలిగినప్పుడే అక్షరానికి గౌరవం.. రచయితకు భవిష్యత్తు ఉంటుంది.

గుర్తుంచుకోండి.. టెక్నాలజీ మారుతుంది.. కానీ తర్కం మారనిది ఒక్కటే సృజన ఎప్పుడూ సజీవంగానే ఉండాలి.. అది యంత్రానికి లొంగిపోకూడదు.